దమ్ముంటే పార్టీ మారిన ఆ 10 మందితో రాజీనామా చేయించు: కెటిఆర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో 66 శాతం ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న సిఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన తమ ఎంఎల్‌ఏలు 10 మందితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల జిల్లాలో మూడో విడత నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులుగా గెల్చిన పార్టీ నాయకులకు స్థానిక తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..సిఎం గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తమకు 66 శాతం ప్రజల ఆశీర్వాదం ఉందని ప్రకటించిన ఐదే నిమిషాల్లో మాట మార్చారని ఎద్దేవా చేశారు. లోకల్ సమస్యలు ఆధారంగా ఎన్నికలు ఉంటాయని. వాటితో తమకేం సంబంధమని మాట మార్చారని అన్నారు. పార్టీ మార్చిన ఆ 10 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలపై స్పీకర్ తీర్పు తీరు జాలి కలిగిస్తోందన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా చేసిన కడియం శ్రీహరి బహిరంగంగా అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని ప్రకటించగా, స్పీకర్‌గా, మంత్రిగా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసానని, ఆయన తనను పార్టీలోకి స్వాగతించారని ప్రకటించినా మిగతావారు పార్టీ మారలేదని స్పీకర్ ప్రకటించడం పచ్చి అబద్ధాలాడటమేనని అన్నారు. గడ్డిపోచకంటే హీనమైన పదవులకోసం కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాలాడటం చూస్తే జాలి కలుగుతోదని అన్నారు. పార్టీ మారిన ఆ 10 మంది ఎంఎల్‌ఏలు ఆడోళ్లా, మగోళ్లా తెలియడం లేదని వ్యాఖ్యానించారు. వారు కాంగ్రెస్‌లో ఉన్నారా.. బిఆర్‌ఎస్‌లో ఉన్నారో వారికే తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన వారి స్థితి గింత బతుకు బతికి గబ్బిలంలా చూరు పట్టుకుని వేలాడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పటికైనా ప్రోగ్రెస్‌కు అభివృద్ధికి వ్యతిరేకమన్నారు. ఈ సందర్భంగా పలువురు నూతన సర్పంచులు,ఉప సర్పంచులను ఆయన సత్కరించారు.