భారత జాతీయ ఆత్మకు 150 ఏళ్ల స్ఫూర్తి
వందేమాతరం’.. ఇది కేవలం ఒక గేయమే కాదు. భారతదేశాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా, తల్లిగా దర్శించే వేల సంవత్సరాల జాతీయ సంస్కృతి భావజాలానికి ప్రతీక. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ మహాగీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సమయంలో, దాని చారిత్రక నేపథ్యం, అసలైన భావార్థం, కాలక్రమంలో జరిగిన వక్రీకరణలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో ‘వందేమాతరం’ను రచించి, అనంతరం ఆనందమఠ్ నవలలో భాగంగా చేర్చారు. బ్రిటిష్ బానిస పాలన భారతీయ మనసుల్లో నిస్సహాయతను నాటే ప్రయత్నం చేసిన కాలంలో, ఆ సంకెళ్లను ఛేదించే ఆధ్యాత్మిక- జాతీయ స్ఫూర్తిగా వందేమాతరం అవతరించింది. ‘సుజలాం సుఫలాం’ అనే తొలి పాదం నుంచే భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, తన పిల్లలను ఆదరించే తల్లిగా భావించాలన్న ఆలోచనను ప్రజల మనసుల్లో బలంగా నాటింది. భారతదేశాన్ని పూజించాల్సిన మాతృభావంగా సామాజిక చైతన్యంలో స్థిరపరిచింది.
భారతదేశం కేవలం ఒక భూమి ముక్క కాదు; అది జీవించే జాతీయ ఆత్మ. అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నట్టుగా.. ‘భారత్ ఏ భూమి కా తుక్డా సహీ హై… యే జీతా జాతా ఏక్ రాష్ట్ర పురుష్ హై’. ఈ భావన ఏ ఒక్క కాలానికి చెందినది కాదు. వేదకాలం నుంచే ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను’ అనే దృఢమైన ఆలోచన భారతీయ సంస్కృతికి మూలాధారం. అదే మాతృభావం, తాత్విక భావజాలం, అదే జాతీయ చైతన్యం కాలక్రమంలో వందేమాతరంగా అవతరించింది. సరస్వతి, లక్ష్మీ వంటి దేవీదేవతలను భరతమాత రూపంలో దర్శించే విశాలమైన సంస్కృతి భారతదేశానిది. స్వామి వివేకానంద భారతదేశాన్ని తల్లిగా ఆరాధించే భావజాలాన్ని స్పష్టంగా వివరించి, దానిని తరతరాలకు అందించారు. అలాంటి వేల సంవత్సరాల సంస్కృతి పరంపరలోంచే వందేమాతరం అవతరించింది. అందుకే వందేమాతరం ఏ మతానికి చెందిన గేయం కాదు.. అది భారత జాతీయ సంస్కృతికి ప్రతీక. దాన్ని మతపరమైన గేయంగా ముద్ర వేయడమంటే భారతీయ సంస్కృతి మూలాలనే అపహాస్యం చేయడమే.
అయితే దురదృష్టవశాత్తు, కాలక్రమంలో వందేమాతరాన్ని బెంగాల్ రాజకీయాలకు, మత కోణాల కోసం ముడిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ‘ఇది బెంగాలీల గేయం’, ‘ఇది మతపరమైన పాట’ అనే విమర్శలు చరిత్రను అర్థం చేసుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కవి కావచ్చు, బంకించంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ రచయిత కావచ్చు. కానీ వారు ప్రాతినిధ్యం వహించినది ఏ ప్రాంతానికో, ఏ మతానికో కాదు.. సంపూర్ణ భారత జాతీయ ఆత్మకోసమేనని గుర్తుంచుకోవాలి. వారిని ప్రాంతీయ సంకుచితత్వంతో పరిమితం చేయాలనుకోవడం, భారతీయ జాతీయ భావజాలాన్ని చిన్నచూపుగా చూడడమే. బ్రిటిష్ కుట్రలకు ఎదురుగా భారతీయ ఐక్యతను నిలబెట్టిన శబ్దంగా వందేమాతరం మార్మోగింది. బ్రిటిషర్లు ‘విభజించి పాలించు’ అనే కుట్రను అమలు చేయడానికి బెంగాల్‌ను ప్రయోగశాలగా మార్చారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన నినాదం ‘వందేమాతరం’. ఆ గీతమే స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించింది. ఈ స్ఫూర్తి బెంగాల్‌కే పరిమితం కాలేదు, దేశం నలుమూలలా విస్తరించి స్వాతంత్య పోరాటానికి దిశానిర్దేశం చేసింది.
బెంగాల్‌కే పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ‘వందేమాతరం’ నినాదం గట్టిగా మార్మోగింది. రామచందర్ రావు వంటి నాయకులు నిజాం అణచివేతకు ఎదురుగా పోరాడిన సందర్భంలో.. అదే గేయం ఉద్యమకారులకు ధైర్యం, దిశ ఇచ్చింది. తమిళనాడులో సుబ్రమణ్యం భారతి వంటి మహానుభావులు కూడా ఇదే జాతీయ భావజాలాన్ని ప్రజలలో వ్యాప్తి చేశారు. అందుకే వందేమాతరం ఏ ఒక్క ప్రాంతపు నినాదం కాదు.. భారతదేశమంతటా ప్రతిధ్వనించిన జాతీయ నినాదం. ఇక్కడే ప్రధాన ప్రశ్న ఉద్భవిస్తుంది- వందేమాతరాన్ని మత కోణంలోకి లాగిన వారు ఎవరు? సంపూర్ణ గీతాన్ని పక్కన పెట్టి, కొన్ని చరణాలకే పరిమితం చేయడం ఎవరి స్వార్ధానికి అనుగుణంగా జరిగింది? 1933 -1947 మధ్యకాలంలో, దేశవిభజన రాజకీయాలు, జిన్నా కోసం సర్దుబాట్లు, కొన్ని వర్గాలను సంతృప్తిపర్చే ప్రయత్నాలు.. ఇవన్నీ భారత జాతీయ ఆత్మను బలహీనపరచే చర్యలే.
అప్పటి కాంగ్రెస్ జాతీయ చైతన్యాన్ని రాజకీయం కోసం తక్కువ చేసి, జిన్నా వ్యూహాలను అనుకూలంగా చూడటానికి సిద్ధపడింది. చరిత్ర స్పష్టంగా నిరూపిస్తోంది. స్వాతంత్యానికి ప్రతీకగా, దేశమాతకు ప్రతీకగా పుట్టిన వందేమాతరాన్ని, రాజకీయ లాభాల కోసం కుదించడమే తప్పు. మొత్తం వందేమాతరాన్ని కత్తిరించి, కొన్ని చరణాలకే పరిమితం చేయడంవల్ల గీతంలోని అసలు అర్థం, సంపూర్ణ స్ఫూర్తి దేశప్రజలకి అందలేదు. వందేమాతరం మొత్తం పాడినప్పుడు మాత్రమే, భారత దేశాన్ని తల్లిగా ఆరాధించే పూర్తి భావజాలం, జాతీయ చైతన్యం స్పష్టమవుతుంది. అన్ని చరణాలు కలిసినప్పుడు మాత్రమే, భారత జాతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయి. వందేమాతరం 150 ఏళ్ల ప్రయాణం స్పష్టంగా చెప్పేది ఏంటంటే- భారతదేశాన్ని మతపరమైన కళ్లజోడు ద్వారా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని. వేలాది సంవత్సరాల సంస్కృతి పరంపరను తల్లిగా ఆరాధించే భావజాలమే నిజమైన భారతీయత, ఆ భావజాలానికి ప్రతీక వందేమాతరం. ఈ గేయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం అసహ్యకరం. దాని అసలు అర్థాన్ని, స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడం అత్యవసర కర్తవ్యం. వందేమాతరం కేవలం చరిత్ర జ్ఞాపకం మాత్రమే కాకుండా, వర్తమానానికి దిశానిర్దేశం, భావితరాలకు ప్రేరణ.
– డా. ఎస్.ప్రకాశ్ రెడ్డి
(బిజెపి సీనియర్ నాయకులు)