Trending
ఏపీ రైతులకు అప్డేట్ – ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి
బీహార్‌లో కులం కార్డే కీలక పాత్ర
బీహార్ ఓటర్ల జాబితా వివాదం మధ్య, కొన్ని రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను మెరుగుపరుచుకుంటున్నాయి. కానీ యథాప్రకారం అభ్యర్థుల ఎంపికలో కులం కార్డే కేంద్ర బిందువు అవుతుంది. ఏదైనా ఎన్నికల్లో రెండు విధాలుగా ఓటర్లను ప్రలోభపరచవలసి ఉంటుంది. ఐదేళ్ల క్రితం లాలూప్రసాద్ అప్పటి ఎన్నికలను అగ్డా (అగ్ర వర్గాలు), పిచ్చడా (వెనుకబడిన వర్గాలు) మధ్య పోరాటంగా అభివర్ణించారు. బిజెపిని సంప్రదాయ అగ్రకులాల, ఉన్నత వర్గాల పార్టీగా ప్రకటించారు. 2024లో ‘ఇండియా కూటమి’ కూడా రెండు విధాలుగా ప్రచారాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించింది. వెనుకబడిన వర్గాలపైనే దృష్టిపెట్టి మరింత సంరక్షణ వారికి అవసరమని ప్రచారం సాగించింది.
బీహార్‌లో వెనుకబడిన వర్గాల సమీకరణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస కాలంనుంచే ఈ తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఇవి రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టాయి. ఈ వెనుకబడిన వర్గాల సమీకరణే ఎన్నికల పోటీకి సాధనంగా ఉపయోగపడుతుంది. ఉన్నతవర్గాలు, తక్కువస్థాయి వర్గాలు అన్న తేడాయే విచక్షణకు దారితీస్తుంది. ఏదెలాగున్నా పొత్తులు, ప్రతిపొత్తుల ఆట, మొత్తంమీద పార్టీ వ్యవస్థలో రాజకీయ చీలికలు ఈ రెండు కోణాల దృష్టిని నిత్యం క్లిష్టం చేస్తున్నాయి. చారిత్రకంగా చూస్తే బిజెపి అభ్యర్థుల ఎంపిక ఉన్నత కులాల అనుకూలంగానే ఉంటుంది. 2020 లో బిజెపి 74 మంది ఎంఎల్‌ఎల్లో 33 మంది (40%) ఉన్నత కులాల వారే. అలాగే ఎక్కడా బిజెపి ముస్లిం అభ్యర్థులను ఎంపిక చేయదు. అంటే దీని అర్థం మిగతా అభ్యర్థులు ఒబిసి(26), ఇబిసి(2) నుంచి ఎంపిక చేసిన వారే. దీనికి విరుద్ధంగా జెడియు 43 మంది ఎంఎల్‌ఎల్లో 22 మంది ఒబిసి, ఇబిసిలకు చెందినప్పటికీ కేవలం 10 మంది మాత్రమే ఉన్నత కులాల వారు ఉన్నారు.
చాలామంది జెడియు ఎంఎల్‌ఎల్లో ఏడుగురు కుర్మీలు, నలుగురు యాదవులతో కలుపుకుని స్థానిక ప్రాధాన్యం కలిగిన ఒబిసి గ్రూపులకు చెందినవారే. మరోవైపు ఆర్‌జెడి నిర్మొహమాటంగా పూర్తిగా యాదవులకే అనుకూలంగా ఉంటుంది. 2020లో ఆర్‌జెడి అవకాశం ఉన్నంత వరకు సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకుంది. 44 సీట్లలో 26ను గెలుచుకుంది. బిజెపి, జెడియుకు భిన్నంగా ఆర్‌జెడి ముస్లిం అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కూడా అలాగే చేసింది. వాస్తవానికి ప్రధాన పార్టీలన్నిటిలో కాంగ్రెస్ లోనే ముస్లిం ఎంఎల్‌ఎల జనాభా ఎక్కువ. కానీ అది కూడా బీహార్‌లో అతిచిన్న నాలుగు పార్టీల్లో ఒకటిగా మిగిలిపోతుంది. 2000 సంవత్సరం మొదట్లో లాలూ తగ్గిపోవడంతో కుర్మీలు/ కుష్వాహాలు, మరికొంతమంది ఇబిసిలతోపాటు యాదవేతర ఒబిసిల ప్రాతినిధ్యానికి చోటు లభించింది.
2020లో తొమ్మిది వేర్వేరు గ్రూపులనుంచి వైవిధ్యంగా 28మంది ఒబిసి ఎంఎల్‌ఎలను ఎంచుకుంది. వీరిలో చాలావరకు బనియాలు, యాదవులు కూడా ఉన్నారు. బిజెపి, జెడియు లేదా ఆర్‌జెడి ఏదైనా ఎన్నికైన ఒబిసి ఎంఎల్‌ఎల్లో మెజార్టీ స్థానిక ప్రాధాన్యం కలిగిన సామాజిక వర్గాలవారే ఎంపికయ్యారు. ఇబిసిలు ప్రచార వాక్చాతుర్యానికి కేంద్రబిందువే అయినప్పటికీ, చాలావరకు మినహాయింపబడ్డారు. బీహార్ జనాభాలో ఇబిసిలు దాదాపు 36 శాతం నుంచి 40 శాతం ఉన్నప్పటికీ, 2020 అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం కేవలం 11 శాతానికి పరిమితమైంది. చాలా పార్టీలు తమ టికెట్ల పంపిణీలో వైవిధ్యం చూపించినప్పటికీ ఫలితాలలో పెద్ద చీలిక కనిపించింది. తీవ్రమైన కుల విభజనే కీలకమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో ఆర్‌జెడి అతిపెద్ద పార్టీగా తెరపైకి వచ్చింది. 2014 నుంచి హిందీ బెల్టులో బిజెపి ఆధిపత్యం వహిస్తున్నా ఓట్లలో అయిదోవంతు మాత్రమే పొందగలిగింది.
అభ్యర్థుల ఎంపికలో వైవిధ్యం చూపించాలని బిజెపి కాంక్షిస్తున్నా, అధికారంలో ఉండడానికి మిత్రవర్గాల పొత్తుపైనే ఆధారపడవలసి వస్తోంది. ముఖ్యంగా దాని ప్రధాన మిత్రపక్షం జెడియు తన జాతి మతపరమైన జాతీయవాద భాగాన్ని పంచకుండా ఇప్పటికీ సెక్యులర్‌శక్తిగా తన అస్తిత్వాన్ని ప్రదర్శిస్తోంది. కులాల చీలిక, వెనుకబడిన వర్గాల సుదీర్ఘ చారిత్రక ప్రభావం బిజెపి హిందుత్వవాదాన్ని అడ్డుకుంటున్నాయి. సామాజిక, ఎన్నికల పొత్తుల నిర్మాణానికే మొగ్గుచూపుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ వంటి చరిష్మా కలిగిన హిందుత్వరాజకీయ నేత లేకపోవడం కూడా బిజెపికి మైనస్ పాయింటే. మతపరమైన కేంద్రీకరణ బీహార్‌లో చాలా తక్కువ ప్రభావం చూపుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే బీహార్ రాజకీయ వ్యాకరణ మౌలిక స్వరూపం మారే అవకాశం లేదు.
2023లో నితీశ్‌కుమార్ నిర్వహించిన కులాల గణన బట్టి బీహార్ రాజకీయాల్లో కులమే ప్రధాన బలమైన పునాదిగా వెల్లడవుతోంది. అయితే ఈసారి రెండు కోణాలనుంచి అత్యంత ముఖ్యమైన అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఓటర్ల జాబితాపై సమగ్ర సర్వే ఒకటి కాగా, మరొకటి ప్రశాంత్ కిశోర్ ‘జనసూరజ్’ ప్రచారం. పంజాబ్‌లో స్థానిక ఉన్నత వర్గాలను తిరస్కరించి ఓటర్లు బయటనుంచి వచ్చిన ఆమ్‌ఆద్మీపార్టీకి ఎలాగైతే పట్టం కట్టారో అలాగే బీహార్‌లో కూడా జరుగుతుందని ప్రశాంత్ కిశోర్ భవిష్యత్ రాజకీయ అంచనాలు వేస్తున్నారు. కానీ బీహార్ పంజాబ్‌లా కాదు. ఇక్కడ కులం అన్నది చాలా లోతుగా వేళ్లూనుకుంది. కిశోర్ స్వంత వ్యూహం కూడా కులం గణాంకాలను ప్రతిబింబిస్తోంది. ఆయన ప్రచారం కూడా సంప్రదాయ కుల స్వరంపైనే ఆధారపడుతోంది. ఏ పార్టీకి ఫలితాలు ఎలా వస్తాయో చెప్పలేకపోయినా ఇప్పుడు అనిశ్చితి మాత్రం వెంటాడుతోంది.
గద్వాల్ లో రోడ్డు ప్రమాదం
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారు జింకలపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. బస్సు కారును 100 మీటర్లు దూరం ఈడ్చుకెళ్ళింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా ఆపడం వలన కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో వాహనంలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనదారులు కారు డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగపూర్‌ను ముంచెత్తిన బౌద్ధ సంద్రం
అది నాగపూర్. నాగానది ఒడ్డున ఉన్న నగరం. అది ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏడాది నాగపూర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయుంటుంది. నాగపూర్ జనాభా ప్రస్తుత 30 లక్షల దాటి ఉంటుందని అంచనా. అయితే అక్టోబర్ 2వ తేదిన ఆ నగరాన్ని వరద ముంచెత్తింది. అది నీటి వరద కాదు జనసంద్రం. 30 లక్షల ఉన్న జనాభా నగరాన్ని దాదాపు 50 లక్షల సునామి ముంచెత్తింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సముద్ర సునామి ప్రాంతాలను మింగేస్తుంది. కానీ 50 లక్షల జన సునామి నాగపూర్‌కు ఎటువంటి చెడు చేయలేదు. చాలా శాంతంగా, ప్రశాంతంగా వెనకు వెళ్ళింది. అయితే గురువారం, అక్టోబర్ 2వ తేదిన విజయదశమ రోజున ఆ మహోత్సవ సంఘటన ప్రతి సంవత్సరం కొత్త చరిత్రను తిరగ రాస్తుంది. పంచవన్నె పతాకాలతో, పంచశీల పఠనంతో ఆ రోజు నాగపూర్ దద్దరిల్లింది.
వందలూ, వేలు కాదు ఏకంగా యాభై లక్షల మందికి పైగా నమో—- బుద్ధాయ, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంగం శరణం గచ్ఛామి అంటూ స్మరిస్తుంటే నాగపూర్ ఎంతో తధేక దీక్షలో మునిగిపోయింది. నాగపూర్ వీధుల్లో ప్రతి ఏడాది కనిపించే అపురూప దృశ్యమిది. చిన్న, చిన్న సభలు సమావేశాలు జరిగితే పోలీసుల పహరాను అభ్యర్థిస్తుంటారు. సహజంగానే పోలీసులు శాంతి భద్రతల సమస్యను నివారించడానికి అక్కడ హాజరవుతుంటారు. కానీ నాగపూర్‌లో గురువారం రోజున పోలీసుల ఆనవాలు అతి తక్కువ. అది కూడా ఎక్కడో నగర కూడళ్ళలో తమ రోజువారీ విధులను నిర్వర్తిస్తున్నారు. కానీ జనసమూహంలో వారి జాడలేదు. లక్షల జన వాహిని స్వయం నియంత్రణతో చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది. వాలంటీర్లు అక్కడకి చేరుకున్న వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తుంటారు.
కిలోమీటర్ల పొడవు బారికేడ్లు ఉంటాయి. రావడానికి ఒకటి పోవడానికి మరొకటి ఉంటుంది. విశేషమేమిటంటే, ఒకరినొకరు తోసుకొని వెళ్ళడాని ప్రయత్నించరు. దానితో తొక్కిసలాటకు అవకాశం లేదు. ఇందులో పసిపిల్ల, వృద్ధులు, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అందరూ ఒకే వరుసలో నడుస్తుంటారు. దొంగతనాలు, మహిళల వేధింపులు మచ్చుకైనా చూడం. నియమబద్ధంగా సాగుపోయే ఈ దృశ్యం నిశ్శబ్దంగా సాగిపోతున్న నది ప్రవాహంలా ఉంటుంది. రెండు జీవనదులు ఒకదానికొకటి ఎదురుగా కదలిపోతున్న భావం కలుగుతుంది. నాకు తెలిసి భారత దేశంలో జరిగిన, జరుగుతున్న అనేక సమ్మేళనాలు, జాతరలు, మేళాలు, రాజకీయ సభలు నాగపూర్ జన సంద్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఎంతో శాంతంగా క్రమశిక్షణతో మరెంతో ఓపికతో తమ వంతు వచ్చే వరకు కదిలే ప్రయత్నిం ఎవరూ చేయరు. ఇది ఒక అద్భుత సందర్భం. భారతదేశం నుంచి బౌద్ధం మాయమైపోయిందని, ఇతర దేశాల్లో మాత్రమే అది కొనసాగుతున్నదని సంతోషపడిన చాలా మందికి 1956 , అక్టోబర్ 14వ తేది విజయదశమి రోజు ఒక పీడకల లాంటిది. నేపథ్యం ప్రతి సంవత్సరం విజయదశమి రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి 70 సంవత్సరాలు నిండాయి. దీనినే బౌద్ధ పరిభాషలో ధమ్మచక్ర ప్రవర్తన దివస్‌గా పిలుస్తారు. ఆ రోజు అంటే 1956, అక్టోబర్ 14వ తేదీన దాదాపు అయిదున్నర లక్షల మందితో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించారు. భారతదేశంలో పాటు ప్రపంచం మొత్తాన్ని ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలను ప్రభావితం చేసిన బౌద్ధం ఈ విప్లవ సంరంభంతో నూతన జవ సత్వాలను అందిపుచ్చుకున్నది. అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం వైపు ఆలోచించడానికి, ఈ బౌద్ధ నవీన విప్లవానికి రూపకల్పన చేయడానికి ఆయన ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు, దాడులు, దౌర్జన్యాలే కారణమని చెప్పక తప్పదు.
అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాలు ఆయనకు చేదు అనుభవాన్నిచ్చాయి. 1927 మార్చి 20వ తేదీన జరిగిన మహర్ చెరువు పోరాటంలో సనాతన హిందువులు కర్రలతో, రాళ్ళతో దాడి చేసి దళితుల తలలు పగుల గొట్టారు. అదే విధంగా 1930 మార్చి 2వ తేదీన నాసిక్‌లోని కాలారాం దేవాలయానికి వెళ్ళిన బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, ఆయన అనుచరులను అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత దేవాలయ ప్రవేశ పోరాటం అర్థంలేనిదని తేల్చివేశారు. ఆ తర్వాత 1930 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేండ్ సమావేశాలలో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించిన సపరేట్ ఎలక్టోరేట్ అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానాన్ని మహాత్మా గాంధీ తన నిరాహార దీక్షతో వెనక్కొచ్చారు. దాని ఫలితంగా వచ్చిన పూనా ఒడంబడిక కేవలం రిజర్వేషన్ స్థానాలను మాత్రమే అందించింది. ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్‌ను బాధకు గురిచేసింది.
ఈ మూడు ఘటనలు ఆయనను ఇక ఎంత మాత్రం అంటరానితనంతో వెలివేసిన దళితుల బతుకులు హిందూమతంలో ప్రగతికి నోచుకోరనే నిర్ధారణకు వచ్చారు. ఒక రెండు సంవత్సరాల తర్వాత 1935 అక్టోబర్ 13వ తేదీన నాసిక్ సమీపంలోని యోలా పట్టణంలో మాట్లాడుతూ “నేను హిందువుగా పుట్టాను. కానీ హిందువుగా మాత్రం మరణించను” అంటూ ప్రకటించారు. అప్పటి నుంచి అనేక కులాలను అధ్యయనం చేస్తూనే, బౌద్ధం వైపు తన ప్రత్యేక దృష్టిని సారించారు. అయితే రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందువల్ల ఆయన తక్షణమే మతం మారే నిర్ణయం తీసుకోలేదు. అయితే కులం, హిందూమతం లాంటి అనేక విషయాలపై చాలా విస్తృతమైన అధ్యయనం చేశారు. ఆ క్రమంలోనే ఆయన బౌద్ధం వైపు అధ్యయనాన్ని వేగవంతం చేశారు. అయితే బౌద్ధం చాలా లోతైన అధ్యయనం అవసరమని భావించి, తనతోపాటు బౌద్ధం తీసుకునే వాళ్లు విద్యావేత్తలు, మేధావులు కానందువల్ల వాళ్లందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక పుస్తకం రాయాలని, ఆ తర్వాతనే ప్రజలను ఆహ్వానించాలని భావించి ‘బుద్ధుడు అతని బోధనలు’ అనే పుస్తకాన్ని రచించి, ఆ తర్వాత బౌద్ధం స్వీకరించడానికి 1956, అక్టోబర్ 14 వ తేదీని ఖరారు చేశారు.
ఇది నేపథ్యం. అయితే ఇక్కడ చివరగా ఒక విషయాన్ని సమాజం ముందుంచాలని భావిస్తున్నాను. పుష్కరాలు, కుంభమేళాలు, జాతరలు, మత పెద్దల సమ్మేళనాలను మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించడం, టివి ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తాయి. అది తప్పేమీ కాదు. అంతేకాకుండా వాళ్ల ఇష్టం. అయితే నాగపూర్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన రోజును దాదాపు అరకోటి మంది ఒక ఉత్సవంగా జరుపుకుంటే పత్రికలు, ఛానెళ్లు అది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఎట్లా అర్థం చేసుకోవాలి. 1956 అక్టోబర్ 14వ తేదీన కార్యక్రమానికి 70 ఏళ్ల కిందట విదేశీ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో ఒక రోజు ఇన్ని లక్షల మంది ఒక చోట చేరి ఎంతో క్రమశిక్షణతో తమ అంకిత భావాన్ని ప్రకటించుకొని శాంతియుతంగా వెళ్లిపోతున్న సందర్భం పత్రికలకు, మీడియాకు ఎందుకు పట్టడం లేదనేది సమాధానం లేని ప్రశ్న. ఇది వివక్షలో భాగం కాదా? ఇది ఈ దేశ చారిత్రక సాంప్రదాయం కాదా? ఇది దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సందర్భం కాదా? భారత దేశంలోని మేధావులు, పత్రికా ప్రపంచం ఆలోచించాల్సిన అంశం.
– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
పండుగలతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ప్రజలందరినీ పండుగలు పేరుతో మతం మత్తులో ముంచితేలిస్తున్నాయి. సహజంగా దేశంలో ప్రజలకు దైవభక్తి ఎక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన పాలకులు, ఆ ప్రమాణాలను, రాజ్యాంగ లక్ష్యాలను పక్కన బెట్టి, సెక్యులర్ అనే భావన పాటించకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మత క్రతువుల్లో పాల్గొంటూ, ప్రజలను కూడా వీటిలో భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది. దీంతో దేశం లో తాండవిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మానవ అభివృద్ధి వంటి అంశాలు పక్కదోవపట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు కూడా ఇటువంటి అంశాలను సీరియస్‌గా ఆలోచించకుండా పండుగలు జరుపుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు.
ఈ మత మైకంలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకలేకపోవడం బాధాకరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, నేటికీ మన అక్షరాస్యత 74% శాతంగా ఉంది. ఇది కూడా కేవలం సంతకాలు చేసిన వారిని కలుపుకుంటే… లేదంటే అరవై శాతంలోపే… దీని వల్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన లేకపోవడం వల్ల అసలు సమస్యలు, దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలు అర్థం చేసుకోలేకపోవడంతో పాలకులుచెప్పే మాటల గారడీలో పడిపోతున్నారు. అందుచేతనే వారి జీవితాలు అన్ని రకాలుగా అంతంత మాత్రంగానే ఉన్నాయి.. నేటికీ దాదాపు సగం జనాభా ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ పథకం, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని వివిధ రకాల పండుగలు దేశంలో ఉన్నాయి. పూర్వం కాలంలో మామూలుగా పండుగ కార్యక్రమాలు జరుపుకుని, వారి దైనందిన జీవితంలో మునిగిపోయే వారు. కానీ నేడు పండుగలను ‘పెద్ద పెద్ద ఈవెంట్స్’ లాగా ప్రభుత్వాలే జరపటం ఆశ్చర్యం వేస్తుంది. పుష్కరాలు అని, పౌర్ణమి అని, ఉత్సవాలు అని భారీ ఎత్తున, రోజులు తరబడి చేయడం జరుగుతుంది.కొద్ది మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేసి, భారీ ఎత్తున ప్రజల నుంచి ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుంది. అనగా భక్తిని ‘వ్యాపారం’ గా మార్చివేసారు. ప్రజలు నుంచి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.
దేవస్థానాలు, ట్రస్టులు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు భారీగా ఆర్థికంగా బలపడుతున్న పరిస్థితి. నేటి ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, కనీస అవసరాలు తీర్చడం మానేసి, ప్రజలను మభ్యపెట్టే మత క్రతువుల్లో పాల్గొనేటట్లు ప్రోత్సాహిస్తున్నాయి. అసలు ఈ ఆధునిక కాలంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే వివిధ రంగాల్లో అనగా అక్షరాస్యత, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి విషయంలో, సంతోష సూచిలో, మానవ అభివృద్ధి సూచికల్లో మనం ఎక్కడ ఉన్నాం అని ప్రశ్నించుకుని ప్రభుత్వాలు పనిచేయాలి. కొంతమంది చేతిలోనే దేశసంపద కేంద్రీకృతమై, కొద్దిమంది బిలియనీర్ల సంపద పెరుగుదలచూసి దేశం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అని మురిసి పోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఎందుచేతనంటే దాదాపు సగం జనాభా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత, సంక్షేమ పథకాలతోనే జీవితాలు గడుపుతున్నారు. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే వంటి దేశాలను దృష్టిలో ఉంచుకుని మన దేశాన్ని నడిపించాలి. వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. అవినీతిని నిర్మూలించాలి. దక్షిణ కొరియా, జపాన్, చైనా, క్యూబా వంటి దేశాలు ఉత్పత్తి రంగంలో ఎలా అభివృద్ధి చెందుతున్నయో చూసి దేశంలో అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీటవేయాలి. శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి.
‘ఆత్మనిర్భర్ భారత్, మేక్‌ఇన్ ఇండియా’ అనే కార్యక్రమాలు మొదలు పెట్టి దాదాపు దశాబ్దం కాలం గడిచినా ఏ మేరకు ఆ లక్ష్యం చేరేమో ఈ ప్రభుత్వాలు పునఃసమీక్ష చేసారా! ఇటువంటి అంశాలపై దృష్టి సారించడం మానివేసి, కేవలం మత క్రతువులకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తే ఎలా! ఎప్పటికి మన దేశం ‘వికసిత భారత్’ అవుతుంది…!? ప్రపంచ దేశాలు అన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే మన విద్యాలయాల్లో తిరిగి వాస్తు, జ్యోతిష్యం, మతపరమైన అంశాలు వంటివి ప్రవేశపెడుతుంటే, ఇక మన విద్యార్థులు అంతర్జాతీయ విద్యార్థిగా ఎలా మారతాడో ప్రభుత్వాలు చెప్పాలి. ఇకనైనా ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు విడనాడాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు స్వస్తి పలకాలి. ప్రభుత్వాలు ఇకనైనా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన వికసిత భారత్‌గా ఉంటుంది.
– ఐ. ప్రసాద్ రావు, 6305682733
జాబితాలో లోపాలకు ఇసిదే బాధ్యత
భారతీయ ప్రజాస్వామ్య మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ)పై ఉంది. అయితే ఇటీవల కర్నాటకలోని అలంద్ నియోజకవర్గం, అలాగే మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ సీటులలో వెలుగుచూసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలు ఈ సంస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2022 డిసెంబర్‌లో అలంద్‌లో ఆన్‌లైన్ ఫారం 7 ద్వారా 6,018 ఓటర్ల తొలగింపు అభ్యర్థనలు వచ్చాయి. వీటిలో కేవలం 24 మాత్రమే నిజమైనవిగా గుర్తించబడ్డాయి. మిగిలిన 5,994 మోసపూరితమైనవిగా తేలాయి. ఇది కేవలం స్థానిక సమస్య మాత్రమే కాదు. ఒక పెద్ద పథకం ప్రకారం జరిగిన కుట్రగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇలాంటి అక్రమాలు మహారాష్ట్రలోనూ జరిగాయి. అక్కడ రాజురాలో 6,850కి పైగా బోగస్ ఓట్ల చేర్పులు జరిగాయి. ఈ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నాలుగా (కుట్ర)గా చూడాలి. ఈ విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రవర్తన, ప్రతిస్పందనలు మరింత సందేహాలను కలిగిస్తున్నాయి.
ఈ అక్రమాలు మొదట అలంద్‌లో బయటపడ్డాయి, అక్కడ బూత్ లెవల్ అధికారి (బిఎల్‌ఒ) ఒకరు తమ సొంత కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపును గమనించి అప్రమత్తమయ్యారు. ఈ అభ్యర్థనలు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మొబైల్ నంబర్లతో నమోదు చేయబడ్డాయి. జార్ఖండ్, చెన్నై, మహారాష్ట్ర మొదలైనవి. అలాగే ఇవి ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిని ఒక పెద్ద కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాలలోనే ఈ తొలగింపులు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. అందుకు రాహుల్ గాంధీ చూపించిన సాక్షాలు రుజువు చేస్తున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితాను మార్చడానికి చేసిన ప్రయత్నమని స్పష్టమవుతుంది. మరోవైపు, రాజురా నియోజకవర్గంలో బోగస్ ఓట్ల చేర్పులు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయానికి దారితీసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బిబిసి మరాఠీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు నమోదైనా 11 నెలల తర్వాత కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు.
అలాగే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను సంప్రదించలేదు. ఎందుకు? ఇది స్పష్టంగా వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతుంది. కానీ కర్నాటక సిఐడి 18 సార్లు ఐపి అడ్రస్, డెస్టినేషన్ పోర్టులు, ఒటిపి టయిల్స్ వంటి డేటాను అభ్యర్థించినా ఇవ్వలేదు. ఈ ఆరోపణల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రతిస్పందన మరింత వివాదాస్పదంగా ఉంది. ఎలాంటి విచారణ చేయకుండానే మొదటి నుండి ఈ ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేయడం ఏదో ఒక పార్టీని సమర్ధించే నేతగా అతని ప్రతిస్పందన ఉందే కానీ నిష్పాక్షికంగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ డేటా లేకుండా, అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాయలను కనుగొనడం అసాధ్యం. అందుకే రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘం ఓట్ చోర్లను కాపాడుతున్నది అని స్పష్టంగా, బహిరంగంగా మీడియా ముందు ఆరోపించారు. ఆయన ఆరోపణ సమంజసమే అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ విషయంలో ఎన్నికల సంఘం తనంతట తాను ఈ విషయాలను వెల్లడించలేదు. మూడేళ్ల తర్వాతే ఈ కుట్ర బట్టబయలైంది. తాజాగా రాహుల్ ఆరోపణల తర్వాత ఆధార్ లింక్డ్ ఈ-సైన్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది పనిని ముందుగా ఎందుకు చేయలేదనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇది రియాక్టివ్ చర్య మాత్రమే, ప్రోయాక్టివ్ పర్యవేక్షణ కాదు. ఇలాంటి ఘటనలే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయా! అనేదే కీలక ప్రశ్న. అలంద్, అలాగే రాజురా కేవలం ఉదాహరణలు మాత్రమే కావచ్చు. కానీ, ఇలాంటి అక్రమాలు ఇతర రాష్ట్రాలలోనూ జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో సాఫ్ట్‌వేర్ ఉపయోగం ఇది ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్లను టార్గెట్ చేసి బల్క్ అప్లికేషన్లు సమర్పించడం అనేది ఒక వ్యూహాత్మక సిస్టమాటిక్ అప్రోచ్‌ను బలంగా సూచిస్తుంది.
కర్నాటక సిఐడి దర్యాప్తులో ఫేక్ ఐడీలతో 100 సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్టు తేలింది. ఇది ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ఉనికిని ధ్రువీకరిస్తుంది. ఇలాంటి మోసాలు ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చుతాయి. ఎందుకంటే ఓటర్లు తమ హక్కును కోల్పోతారు. అలాగే ఎన్నికల ఫలితాలు మార్చబడతాయి. బిజెపి ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ డ్రామా అని కొట్టిపారేస్తున్నప్పటికీ తగిన సాక్ష్యాలు ఉన్నప్పుడు దీనిని తేలికగా తీసుకోకూడదు. బ్లాక్ లెవల్ అధికారుల పర్యవేక్షణలో లోటుపాట్లు స్పష్టం. ఆన్‌లైన్ అప్లికేషన్లు వచ్చినప్పుడు, వెరిఫికేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌గా జరగాలి. కానీ, అలంద్‌లో (బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్‌ఒలు) హెచ్చరికలు చేసిన తర్వాతే చర్యలు తీసుకున్నారు.ఇది సిస్టమ్‌లోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఇలాంటివి ముఖ్యంగా డిజిటల్ ఎరాలో. ఎవరికి లాభం చేకూరుతుంది? స్పష్టంగా, రాజకీయ పార్టీలు లేదా వారి మద్దతుదారులు ఓటర్ బేస్‌ను మార్చడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు.
కానీ ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే, పారదర్శక చర్యలు తీసుకోవాలి. ముందుగా, సిఐడికి అవసరమైన డేటాను అందించాలి. అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ఆడిట్‌ను చేపట్టాలి. అత్యున్నత స్థాయి జ్యుడీషియల్ కమిషన్ లేదా అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ ద్వారా ఈ విషయంలో విచారణ జరపాలి. రాజ్యాంగంలోని 324, 326 అధికరణల స్ఫూర్తిని కాపాడుకోవాలి. ఇది స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఎన్నికలను నిర్ధారిస్తుంది. ఇప్పుడు చర్య తీసుకోకపోతే, భవిష్యత్ ఎన్నికలలో మరిన్ని అక్రమాలు, అవకతవకలు జరగవచ్చు. ఇది ప్రజాస్వామ్యం మూలాలు బలహీనపరుస్తాయి. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామా కాదు. దేశ భవిష్యత్‌కు సంబంధించిన విషయం.
– డా. కోలాహలం రామ్‌కిశోర్
– 9849328496
బిక్షపతి నగర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్: కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉదయం నుంచి రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు.
హైడ్రా ఏర్పాటు చేసిన తరువాత ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించామని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లు, చెరువుల్లో భూములు ఉన్నట్లు అనుమానిస్తే వాళ్లు సరిచూసుకుంటున్నారన్నారు. కొనేవాళ్లు లేకపోతే అమ్మేవాళ్లు, ఆక్రమించే వాళ్లు తగ్గిపోతున్నారని వివరించారు. మూసీలో జరిగే కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు. నగరంలో వాన పడితే చాలు నీళ్లు నిలిచిపోతున్నాయని నాలాలు పూడిచి కట్టడాలు నిర్మించడంతో వాన నీరు నిలిచిపోతుందన్నారు.
శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం
పాన్- ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో ఆసక్తికరమైన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. హిలేరియస్ బ్లాక్‌బస్టర్ సామజవరగమనను అందించిన తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి ఈ వెంచర్ కోసం జతకడుతున్నారు. ’శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’ పూర్తి డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్. హాస్యం ఎక్కువగా వుండే కథనంతో ఈ చిత్రం నాన్-స్టాప్ వినోదాన్ని అందించబోతోంది. ఈ చిత్రాన్ని దసరా శుభ సందర్భంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్‌ను నారా రోహిత్‌తో కలిసి నిర్మాతలకు అందజేశారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ద్విపాత్రాభినయంలో..
హీరో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని చే స్తున్నారు. వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 1992లో ఆం ధ్ర, -ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యుయల్ రోల్స్‌లో కనిపించనున్నారు.
అమ్మవారి విగ్రహం నిమజ్జనం… గాల్లోకి లేచిన భారీ క్రేన్
రంగారెడ్డి: సరూర్ నగర్ చెరువు వద్ద అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం 6గంటలకు అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా భారీ క్రేన్ గాల్లోకి లేచింది. ఒక వైపు బరువు ఎక్కువగా ఉండడంతో క్రేన్ పైకి లేచి ఉంటుందని డ్రైవర్లు తెలిపారు. క్రేన్ కు ఇరువైపులా సమాన బరువును బిగిస్తారు. ఒక వైపు ఎక్కువ బరువును బిగిస్తే ఇలానే జరుగుతుందని డ్రైవర్లు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.