Trending
కొబ్బరిబోండాల మాటున గంజాయి అక్రమ రవాణా
కొబ్బరి బోండాల మాటున గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ నార్కొటిక్స్ పోలీస్‌స్టేసన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్ సంయుక్తంగా రట్టు చేసింది. ముగ్గురు రాజస్థాన్ ట్రాన్స్‌పోర్టర్లు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా అవుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం రంగంలోకి దిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ, పెద్ద అంబర్‌పేట్ సమీపంలో విశాఖపట్నం నుండి రాజస్థాన్‌కు అక్రమంగా 401 కిలోల గంజాయిని రవాణా చేస్తున డిసిఎం వాహనాన్ని అడ్డగించింది. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ట్రాన్స్‌పోర్టర్లను ఈగల్ టీం అరెస్టు చేసింది. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, శ్రీధర్, అషు, పరమేశ్వర్‌లు ఉండగా, వారిలో ముగ్గురు నిందితులు శ్రీధర్, అషు, రమేశ్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఓం బిష్ణోయ్ తన పట్టణంలో గంజాయి రవాణాలో పాలుపంచుకున్నాడు.అతను రాజమండ్రిలోని శ్రీధర్ నుండి అక్రమ వస్తువులను సేకరించి, తన హ్యుందాయ్ వెన్యూలో షిప్‌మెంట్‌లను రవాణా చేయడానికి చోటు నారాయణ లాల్ నాయక్‌ను నియమించుకున్నాడు. అతనికి ప్రతి ట్రిప్‌కు రూ.25,000 చెల్లించాడు. ఒడిశాలోని జగదల్‌పూర్‌లో ఓం బిష్ణోయ్‌ను అరెస్టు చేసి, తరువాత జైలులో ఉంచినప్పుడు,
చోటు నారాయణ లాల్ నాయక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కిలోగ్రాముకు 2,000 చొప్పున 400 కిలోగ్రాముల గంజాయిని కొనుగోలు చేయడానికి శ్రీధర్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత నాయక్ గంజాయిని బికనీర్‌లోని ఆశుకు కిలోకు 4,000 చొప్పున విక్రయించాలని పథక రచన చేశాడు. ఈ ఆపరేషన్‌లో రవాణా ఏర్పాట్ల కోసం పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, పరమేశ్వర్‌లను కూడా నాయక్ చేర్చుకున్నాడు. తరువాత, అక్రమంగా రవాణా చేసిన వస్తువులను ఒక వ్యాన్‌లో ఎక్కించి, కొబ్బరికాయల లోడు కింద దాచి, రాజస్థాన్‌కు వెళ్లాలని పథక రచన చేశారు. కిషన్ లాల్ నాయక్ నడుపుతున్న వ్యాన్‌కు నాయక్, పుష్కర్ తమ కారులో ఎస్కార్టుగా వెళ్లారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎక్స్ రోడ్ సమీపంలోని విజయవాడ హైవే వెంట ప్రయాణిస్తుండగా, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్‌కు చెందిన సంయుక్త బృందం రెండు వాహనాలను అడ్డగించి చోటు నారాయణ లాల్ నాయక్,కిషన్ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్‌లను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 401.467 కిలోగ్రాముల గంజాయి, వ్యాన్, కారుతో సహా ఐదు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబెల్..
స్టాక్‌హోమ్ : హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్‌జ్నా హోర్కె ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘హెర్ష్ 07769’ అనే నవల జర్మనీ లోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ నవలకే నోబెల్ బహుమతి వరించింది.ఈ నవలలో చనిపోయిన ఇద్దరు అద్బుతమైన వ్యక్తులు తిరిగి వస్తారన్న నమ్మకంతో మోక్షం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల మూఢత్వాన్ని చిత్రీకరించారు. ఇందులో హింస, అందం కలగలసి పోయిందని, ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచం లోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను, వినూత్నశైలిలో ఆవిష్కరించారని పేర్కొంది. 07769 నవల తరువాత 1994 లో సినిమాగా డైరెక్టర్ బెలాటార్ రూపొందించారు.
ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ (అలౌకిక) భయాల మధ్య కూడా కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. లాస్లో గాఢమైన ఆలోచనలు, మానవ మనస్తత్వాన్ని లోతుగా వ్యక్తపరిచే శైలికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు, గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్‌మోడర్న్ ( ఆధునికానంతర )నవలలు రచించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో’ , ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఈ రచనలు మానవుడి ఒంటరితనం, ఆధునిక నాగరికత లోని నిస్సారతపై సాహిత్యపరంగా మంచి పేరు పొందాయి. లాస్లో రచనలు మొదట హంగేరియన్ భాషలో రాయబడినప్పటికీ, అవి అనేక యూరోపియన్ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఈయనకు లభించాయి.
వాటిలో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో లభించింది. సినీ దర్శకుడు బెలా టార్ తీసిన చిత్రాలు కూడా లాస్లో నవలల ఆధారంగా రూపొందడంతో ఆయన రచనలకు అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది. 1954 లో ఆగ్నేయ హంగేరీలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో గ్యులా అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల ‘సాటం టాంగో’ 1985 లో ప్రచురించారు. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. గత ఏడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు ఈ బహుమతి లభించింది. హాన్‌కాంగ్‌కి ఈ గౌరవం లభించడం ఆసియా సాహిత్యానికి కొత్త ఉత్సాహం కల్పించింది. ఈ సంవత్సరం లాస్లో ఎంపికతో యూరోపియన్ సాహిత్యం మళ్లీ నోబెల్ వేదికపై వెలుగొందింది. ఇక 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు.
బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్
నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి ముగ్గురు బాలికలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెండవ టౌన్ ఎస్‌ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బిసి బాలిక వసతి గృహానికి చెందిన పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వసతి గృహంలోని సిసి కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్ర చారి (36) రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా తెల్లవారుజామున వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, భువనగిరి నుండి చిట్యాల వైపు వెళుతున్న లారీ కంటైనర్ అతి వేగంగా హోంగార్డుపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆసుపత్రికి తరలించారు.
నివాళులర్పించిన మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తిః హోంగార్డు ఉపేంద్రచారి మరణవార్త తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.
పోలీసుల చేయూతః హోంగార్డు ఉపేంద్రచారి విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో అతని కుటుంబానికి అండగా, తక్షణమే సిపి సుధీర్‌బాబు హోంగార్డు సంక్షేమ నిధి నుంచి 10 వేల రూపాయలు, భువనగిరి హెడ్ క్వార్టర్స్ తరపున అడిషనల్ ఎస్‌పి, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు, హెచ్ సిసి, ఉమెన్ పిసిఎస్ కలిసి సమకూర్చిన లక్ష రూపాయలను అడిషనల్ ఎస్‌పి వినోద్‌కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ శ్రీనివాస్ హోంగార్డు కుటుంబ సభ్యులకు అందజేశారు.
వాగు దాటే ప్రయత్నంలో భార్యాభర్తతో పాటు మరొకరు గల్లంతు
జిల్లాలోని పోతిరెడ్డి రెడ్డి చెరువు వద్ద వాగును దాటే ప్రయత్నంలో క్రిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటాపురం గ్రామానికి చెందిన తనెం బాలయ్య, రాములమ్మ దంపతులిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటు మరొకరు కూడా గల్లంతు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నవాబుపేట, హన్వాడ, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్‌పూర్ తదితర మండలాలతో పాటు అనేకచోట్ల భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైంది. నవాబుపేట మండలంలో భారీ వర్షానికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది రైతుల ఇళ్లలో దాన్యం, తిండిగింజలు సైతం వర్షార్పణం అయ్యాయి. స్థానిక. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, మర్లు, వన్‌టౌన్, పెద్ద చెరువు ప్రాంతం బగీరథ కాలనీ,వీరన్నపేట తదితర కాలనీలో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్లపై నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.గత రెండు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాత ఇళ్లలో ఉన్న వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎక్కడైన ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బింగి సతీష్ తండ్రి చిన్నయ్య 35 రోజూవారీ కార్యక్రమ వ్యవసాయ పనుల్లో భాగంగా వంటచేనుకు మందు పిచికారి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పక్కన గల పంటచేలో అమర్చిన విద్యుత్ తీగ షాక్ తగలడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.
బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది: హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అమలు జిఒ నెం.9పై హైకోర్టు స్టే విధించడంపై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏనాడైనా బిసి రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో పోరాటం చేయాలని, అందుకు కలిసి రావడానికి బిఆర్‌ఎస్ సిద్ధం అని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బిసిలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. బిసిల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జిఒ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి, బిసిల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్‌లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని డిమాండ్ అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి.. ఉద్యమ పార్టీగా బిఆర్‌ఎస్ ఎల్లప్పుడూ బిసిల కోసం గొంతెత్తుతుది… ఢిల్లీని నిలదీస్తుందని హరీష్‌రావు స్పష్టం చేశారు.
ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వం: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మళ్లీ నేడు వారు చార్జీల పెంపు, ఆర్టీసి కార్మికుల కష్టనష్టాలపై మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఆయన అన్నారు. గురువారం ఆద్దంకి విలేకరులతో మాట్లాడుతూ నాడు 40 రోజుల పాటు ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తే పట్టించుకోని బిఆర్‌ఎస్ నాయకులకు ఆర్టీసి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అద్దంకి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసిని క్రమంగా ప్రభుత్వ పరం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో బిఆర్‌ఎస్ నేతలు గందరగోళం సృష్టించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నేడు ఆర్టీసి నిలబడిందని, ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం సిఎం రేవంత్ రెడ్డి అని అద్దంకి దయాకర్ బిఆర్‌ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు.
అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిన రిచా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదట తడబడినా.. రిచా ఘోష్ అద్భుత పోరాటంతో రేసులో నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తన అద్భుత బ్యాటింగ్ తో జట్టును తిరిగి రేసులో నిలబెట్టింది. చివర్లలో స్నేహ్ రాణా (33)తో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుతిరగడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 45.5 ఓవర్లలో టీమిండియా 251 పరుగులు చేసింది.