తుపాకీ రాముడి మాటలకు రేవంత్ మాటలకు తేడా లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే ఇద్దరు రెడ్లు ఆ పదవిని చేపట్టడానికి రెడీగా ఉన్నారని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం, రాంనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తుపాకీ రాముడుకి, రేవంత్ రెడ్డి మాటలకు తేడా లేకుండా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని అడ్డగోలు జిఒలను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఆ పార్టీని కూడా ధోకా చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌పై వత్తిడి చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటింపజేసి, అదే స్థాయిలో 42 శాతo రిజర్వేషన్‌కు 9 జిఒను విడుదల చేయడంతో హైకోర్టు తప్పు బట్టి స్టే విధించిందని అన్నారు. దానివల్ల పోటీ చేయాలనుకునే ఆశావహులు గందరగోళానికి గురయ్యారన్నారు. బిసి రిజర్వేషన్లపై పొంతనలేని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి సిఎం కాకముందు బిసి రిజర్వేషన్లపై రాష్ట్రాలకు రిజర్వేషన్లపై హక్కు ఉండకూడదని, అలా అడిగిన వారిని జైల్లో పెట్టాలని అన్న మాటలను దయాకర్ రావు మీడియా ముందు వీడియో క్లిప్పింగ్ ను చూపించారు.
అదేవిధంగా అసెంబ్లీలో మాజీ మంత్రి కెటిఆర్ బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన అంశాలను, విధానాన్ని చెప్పాలని నిలదీసినప్పటికీ ముఖ్యమంత్రి మాట్లాడలేదన్న వీడియో క్లిప్పింగ్ కూడా విలేకరులకు చూపించారు. రేవంత్ రెడ్డి పదవీ కాంక్షతో నిత్యం అబద్ధాలతో గ్రామాల్లోని బ్రోకర్లను తలదన్నే విధంగా మాటలు మార్చి కాంగ్రెస్ అధిష్టానాన్ని మభ్యపెట్టి పిసిసి పదవి తెచ్చుకుని పార్టీలోని సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని ఆరోపించారు. ఇటు ప్రజలను, అటు పార్టీ నాయకులను, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా తెలంగాణ ప్రజల ముందు హామీలు ఇస్తున్నట్లు ఇరికించి వారిని కూడా మోసం చేసిన ఘనుడు అని అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను ముంచడానికి బిసి రిజర్వేషన్లలో కూడా ఆ వర్గాల ప్రజలను నట్టేట ముంచడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రం అమలు చేస్తున్న రిజర్వేషన్లను ఇక్కడ అమలు చేయాలంటే దానికి రాజ్యాంగ సవరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కేంద్రం ఏ విధంగా ప్రతిపక్ష ప్రభుత్వానికి సహకరిస్తుందా చెప్పాలన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పెద్దలను కాదని బిజెపితో దోస్తాను చేస్తూ మాయమాటలతో కోటలు కడితే.. అవి నేడు పేకమేడల్లా కూలిపోయాయని, దాని ఫలితం ప్రజలు అనుభవించాల్సి వస్తోందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎలు తాటికొండ రాజయ్య, విడుదల సతీష్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.