మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కా ర్యాలయంలో డిజిపి శివధర్‌రెడ్డి ఎదుట 41మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్‌లు ఉన్నారు. వీరిలో గెరిల్లా ఆర్మీ బెటాలియ న్కు చెందిన 11 మంది, తెలంగాణ స్టేట్ రెండో రీజినల్ కమాండ్‌కు చెందిన ఐదుగురు, కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన డివిసి స్టేట్ కమిటీ క్యాడర్ చెందిన వారు నలుగురు ఉన్నారు. ఈ లొంగుబాటులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, లొంగిపోయిన 41 మంది లో 39 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన వారు.
పొరుగు రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల ద్వారా జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు దీని ద్వారా స్పష్టమవు తోంది .లొంగిపోయిన వారు తమ వద్ద ఉన్న ఎల్ఎంజీ, 3 ఏకే 47 రైఫిల్స్, 5 ఎస్ఎల్ఆర్ రెఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, 1 బీజేఎల్ గ్రానైడ్ లాంఛర్, నాలుగు 303 రైఫిల్స్, ఒకటి సింగిల్ షాట్ రైఫిల్స్, 2 ఎయిర్ గన్స్‌తో కలుపుకుని మొత్తం 24 తుపా కులను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరంతా లొంగిపోయారని తెలిపారు. ‘హింస ద్వారా ఏదీ సాధించలేమని గ్రహించి, ప్రజాస్వా మ్యబద్ధంగా జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. అడవిలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నాలకు ఈ లొంగుబాటు ఒక గొప్ప విజయమని డిజిపి పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు..
ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారని శివధర్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు, ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్త్స్రన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రభు త్వం లొంగిపోయిన వారికి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని, ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహా యం చేస్తుందన్నారు. . లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ. 1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నా రు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రా లకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తా మన్నారు.
ఇప్పటివరకు 509 మంది మావోయిస్టులు లొంగుబాటు
2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం , కీలక నేతలే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సాయం అందించారు. అలాగే వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని కూడా వారికే అందజేయనున్నారు. చట్టబద్ధమైన పౌరులుగా వారు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన గృహ వసతి, ఉపాధి వంటి సౌకర్యాలను కల్పిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. అడవిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు బయటకు వచ్చి మెరుగైన చికిత్స పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
‘ఆస్ట్రేలియాలో కాల్పులతో హైదరాబాద్‌కు సంబంధం లేదు’
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికీ, ఆ ఉగ్ర ఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన వారిలో సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది. ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులకు తెగబడి పోలీసుల చేతుల్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నగరంలోనే బీకామ్ వరకూ చదివారని తెలిపారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, ఆ తర్వాత అదే సంవత్సవరం యురోపియన్‌కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.
పెళ్లి అయిన అదే ఏడాది మెుదటిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి నగరానికి వచ్చాడని వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి చెప్పారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)తో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ యూదులం తా బాండీ బీచ్‌లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా 36 మంది గాయ పడ్డా రు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.