Latest News
అమెరికాలో భారత సంతతి వ్యాపారి హత్య
న్యూయార్క్: అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారిని చంపేశారు. ఇద్దరు మధ్య జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన రాకేశ్(51)ను తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో రాకేశ్ అనే భారత సంతతి వ్యక్తి మోటెల్ నడుపుతున్నాడు. మోటెల్ ఎదరుంగా పార్కింగ్ విషయంలో ఇద్దరు గొడవపడుతున్నారు. రాకేశ్ వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. నిందితుడు తుపాకీ తీసుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో రాకేశ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహం, ఐక్యతను చూపిన ఆత్మీయ వేదిక
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగే 80s స్టార్స్ రీ యూనియన్ చెన్నైలో జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశం, అందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది. గతేడాదే నిర్వహించాలనుకున్నా, చెన్నైలో జరిగిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రీయూనియన్ వాయిదా పడింది. ఈసారి ఆ వేడుక స్నేహం, ఐక్యత, హృదయపూర్వకమైన సమావేశం విజయవంతంగా జరిగింది. రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే ఈ రీయూనియన్‌ను ఆతిథ్యం ఇచ్చారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భగ్యరాజ్, ఖుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కోఅర్దినేట్ చేశారు. ఇంటి ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం, ఆ తారల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. మొత్తం 31 మంది నటులు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాటు హిందీ పరిశ్రమ నుండి కూడా స్టార్స్ వచ్చారు. సాయంత్రం అంతా నవ్వులు, జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయంగా గడిచింది. 80s స్టార్స్ రీ యూనియన్ గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. “80s స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది‘ అని చిరంజీవి అన్నారు.’ ఈసారి ఇది ఉత్సవం కాదు, అని సుహాసిని మణిరత్నం తెలిపారు. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ 80s స్టార్స్ రీ యూనియన్ స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రీ యూనియన్ లో చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ, నదియా, రాధ, సుహాషిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్బూ, భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరామ్, అశ్వతీ జయరామ్, సరిత, బాను చందర్, మీనా, లత, స్వప్న, జయశ్రీ పాల్గొన్నారు.
టాటా క్యాపిటల్ ఐపీఓ: తొలి రోజు వివరాలు, జీఎంపీ, విశ్లేషణ, దరఖాస్తు చేయాలా వద్దా?
మూడో పాట వచ్చేస్తోంది
మాస్ మహారాజా రవితేజ హీరోగా 75వ చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘మాస్ జాతర’ శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్‌గా ఈ అక్టోబర్‌లో రిలీజ్‌కి వస్తున్న ఈ సినిమా నుంచి నెకస్ట్ సాంగ్‌కి రంగం సిద్ధం అయ్యింది. ఇది వరకే వచ్చిన రెండు పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. ఇక మూడో సాంగ్ హుడియో హుడియో అంటూ సాగే శ్రీలీల, రవితేజ మాస్ నెంబర్. ఇక ఈ సాంగ్ తాలూకా ప్రోమో సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈసారి ఎలాంటి ట్యూన్‌ని అందించాడో చూడాలి మరి. ఇక ఈ సినిమా థియేటర్లలో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మొయినాబాద్ లో ‘ట్రాప్ హౌస్ పార్టీ’లో 50 మంది మైనర్లు
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పోలీసులు తనిఖీలు చేయడంతో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిజె ఇన్‌స్టా యాప్‌లో ట్రాప్ హౌస్ 9ఎంఎ పేరుతో పార్టీ నిర్వహిస్తున్నామని నిర్వహకులు ప్రకటించారు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లోని ట్రాప్ హౌస్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పార్టీ జరుగనుందని వెల్లడించారు. ఒక్క పాస్ కోసం అయితే రూ.1600, జంటగా వస్తే రూ.2800 ధర నిర్ణయించారు. ఇన్‌స్టాలో ఈ ప్రకటన కనిపించడంతో 50 మంది మైనర్లు టికెట్లు కొనుగోలు చేశారు. శనివారం మధ్యాహ్నం మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో అందరూ డ్యాన్స్ చేస్తుండగా రాజేంద్రనగర్ ఎస్‌ఒటి పోలీసులు వారిని పట్టుకున్నారు. అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు మైనర్లకు పాజిటివ్ వచ్చింది. ఆరుగురు నిర్వహకులతో పాటు ఆరు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
నేను మీ చిన్నారిని
నేను జీవించాలనుకుంటున్నాను
నేను ప్రేమించాలనుకుంటున్నాను
మై డియర్ సర్, మీరు అనుమతిస్తే
నేను ఆడాలనుకుంటున్నాను
నేర్చుకోవాలనుకుంటున్నాను
నన్ను చూడండి, మీరు నా పట్ల
శ్రద్ధ వహిస్తారు అని నాకు తెలుసు
నా వైపు చూడండి.. నాకు కూడా
మీలాగే రక్తమాంసాలు ఉన్నాయి
ఎందుకంటే నాకు హృదయం ఉంది..
నేను మీలాగే నవ్వుతాను.. నేను ఏడుస్తాను
డియర్ సర్ నన్ను చూడండి
నా కళ్లలోకి చూడండి
నేను ధైర్యం చేస్తున్నాను
చనిపోవడానికి నేను చేసిన పాపం ఏమిటి?
నేను చదరంగం పావుని కాదు, చిన్న పాపని
నేను ఒక సంఖ్యని కాదు, నేను చిన్న పిల్లని
నేను ల్యాబరేటరీ ఎలుకను కాదు
నేను చిన్నపిల్లని నన్నుసరిగా చూడండి
సర్.. నేను మీ బిడ్డను
ఇస్రా థియాబ్
ఇస్రా థియాబ్ పుట్టుకతో పాలస్తీనా శరణార్థి, జోర్డాన్ జాతీయతను కలిగి ఉంది. ఆమె తండ్రి ఒ క రాజకీయ కార్యకర్త. పాలస్తీనియన్‌ల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో అన్యా యం, అణ చివేతలకు వ్యతిరేకంగా తన తండ్రిలా పోరాడటా నికి ఇస్రా థియాబ్ దృఢ నిశ్చయంతో ఉంది.
– అనువాదం: శివలక్ష్మి
ఆ కళ్లు
ఎలాంటి కళ్లు అవి?
ఆకాశంలో అంతెత్తున ఎగురుతూ
నేల మీద కదలాడుతున్న
ఎరను పసిగట్టే డేగ కళ్లు కదా ఆ కళ్లు
అప్పటి వరకూ చెట్టు కొమ్మ మీద
తపోదీక్షలో ఉన్నట్టు మౌనంగా కూచున్న
లకుముకి పిట్ట ఉన్నట్టుండి అదాటున
చెరువులోకి దూకి చేపపిల్లను నోట కరచుకొచ్చిన
ముక్కుకొన వాడి చూపులు కదా ఆ కళ్లు
కొన్ని వేల పేజీల మైదానాలపై
లక్షల వాక్యాల పచ్చికల వెంట
పరుగులు తీసి చెంగనాలు పోయిన
లేడి పిల్లల చురుకు గంతులు కదా ఆ కళ్లు
కన్ను గానని కారు చీకట్లో పుంత తోవను
చేయి పట్టి నడిపించే మిరుమిట్లు గొలిపే
ఆనంత మిణుగురుల గుంపు కదా ఆ కళ్లు
వాన కురిసి వెలసిన ఒక సూర్యోదయపు వేళ
టెలిఫోను తీగల మీద బారులు తీరిన
వజ్రపు అంచుల వాన చినుకుల
మిల మిలలు కదా ఆ కళ్లు
లోకపు పెను చీకట్లను
భీకర శబ్దాలతో దునుమాడే
మేఘపు వెండి అంచుల మెరిసే
విద్యుల్లతలు కదా ఆ కళ్లు
పొంగి పొర్లే వాగు వొడ్డున
రెండు దోసిళ్ల ఇసుకను తవ్వగానే
జలజలమంటూ జలం పైకుబికి వొచ్చినట్టు
నిత్య కరుణార్డ్ర సజల నేత్రాలు కదా ఆ కళ్లు
అర్థరాత్రి అరణ్యంలో
పొదల చాటున మాటు వేసి
వేట కోసం ఎదురు చూసే
ఆకలి గొన్న చిరుత పులి
రేడియం కళ్లు కదా ఆ కళ్లు
ఇప్పుడు ఆ కళ్లే పక్షులు వదలి వెళ్లిపోయిన
పాడుబడ్డ గూళ్లలా.. పెంజీకటి కవ్వలి
కృష్ణబిలాల్లా ఇప్పుడు ఆ కళ్లే..
– శిఖామణి
– (గురువు గారు కె.శివారెడ్డి గారికి)
డాన్స్ అండ్ ట్రాన్స్
నీ పక్కన పడ్డాది పిల్లా సూడు
నాది నక్కిలీసు గొలుసు
గున్న గున్న మామిడి గున్న మామిడి తోటకి..
డీజె టిల్లు మామా..
కనీకనపడని రంగురంగుల ఎల్‌ఇడి లైట్ల కింద కాళ్ళు ఆడిస్తూ, చేతులు పైకి ఊపుతూ, పండగ, పెళ్లి, దేవుని ఊరేగింపు ఇలా సందర్భం ఏదైనా గల్లీలలో, పట్టణంలో, పల్లెలో ఎక్కడ చూసినా డీజే పా టలకి డాన్స్‌తో చిందులు తొక్కే యువత, పిల్లలు వృద్ధులు మనకి ఇప్పుడు కనపడుతున్నారు. డీజే తో డాన్స్ చేయడం అనేది ప్రజాస్వామ్యీకరణ చెం దింది. ఆదిమ మానవుడి కాలం నుండే, వేటలో, పనిలో భాగంగా కళ పుట్టింది అంటారు. తర్వాత దేవుళ్ళ కర్మకాండ వచ్చింది. ఆ కర్మ కాండ నుండి కూడా కళ పుట్టింది అని చెబుతారు. ముందు ఆట, తర్వాత పాట, తర్వాత మాట, సంగీతం, కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు, సినిమాలు.. అలా కళలు ఎలా పురోభివృద్ధి చెందాయో మనకు తెలు సు. నిజానికి డప్పులు మోగితే, డాన్స్ చేయాలని ఎవరి కాలు ఊగదు, కానీ విమర్శలు, వెక్కిరింత లు, వచ్చే అడ్డంకులో డాన్స్ చేయడం అంటేనే ఏదో పాప కార్యం అన్నట్టుగా అయిపోయింది. అందు లో స్త్రీలకి మరిన్ను. డాన్స్ చేయాలి అనే కోరిక బలంగా ఉన్న ఆడవాళ్లు ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి దేవుడు పట్టిన దానిలాగానో, దెయ్యం పట్టిన దాని లాగానో డాన్స్ చేసి తమ శరీర ఇచ్చని అలా నెరవేర్చుకుంటారు అనిపిస్తుంది. ఎప్పుడైనా దేవుడి పేరుతో చేసే డాన్స్‌కి కొంత ఒప్పుదల లభిస్తుంది సమాజంలో.
సామూహిక కళాత్మక వ్యక్తీకరణ అనేది సమాజ అభివృద్ధి క్రమంలో క్రమంగా విడిపోయి, చేసే వాళ్ళు, చూసే వాళ్ళుగా, ప్రోసీనియం స్టేజీ వచ్చి విడదీసింది. ఆటలు, పాటలు, జానపద కళా రూపాలుగా, అవి కొందరికే చెందినవిగా మిగిలిపోయాయి. పాశ్చాత్య విద్యా ప్రభావంతో ఆధునిక కవిత్వం, కథలు, నవలలు వచ్చి ఈ రూపాలన్నీ మరింత సోఫిస్టికేట్ అయ్యాయి. యూరోపియన్ నాటక రంగం భారతదేశంలో కాలూనింది. దాని ప్రభావంతో ఒక కాలంలో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు వెల్లువలా వచ్చాయి. జానపద కళా రూపాలు కింది కులాలకే పరిమితం అయితే, సంప్రదాయ సంగీత, నృత్యాలు రాజుల ఆస్థాన మందిరాలకి, దేవదాసీలకు పరిమితం అయ్యాయి. శాస్త్రీయ సంగీతం పెద్ద కులాలకే పరిమితం అయ్యింది. జానపద బాగోతాలు, యక్షగానాలు గ్రామీణ జనం ఆటపాటలుగా ఉండేవి. పాటలు అనేవి పనిలో భాగంగా ఉండేవి. ఆ పాటలు పాడేవారు చూసేవారు వేరుగా ఉండేవారు కాదు. అందులో రిధంని పనిముట్లే అందించేవి.
ప్రజా నాట్య మండలి వంటి అనేక సంస్థలు తర్వాత ప్రజా కళారూపాలని వాడుకలోకి తెచ్చా యి. ప్రజల పాటలకి, విప్లవ వస్తువు జోడించి మళ్లీ జానపద కళారూపాలకి మరింత ప్రాచుర్యం కల్పించాయి. తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ అస్తిత్వం నేపథ్యంతో ఎన్నడూ లేని విధంగా ఆట, మాట, పాట సాగింది. ఎందరో కవులు, కొత్తగా గాయకులు పుట్టుకొచ్చారు.
సినిమా రంగం మొదటి నుంచి శాస్త్రీయ సంగీతం కంటే జానపద రూపంలో ఉన్న పాటల ద్వారానే ఎక్కువ మందిని చేరుకోవచ్చని భావించింది. ఒక పక్క మంచి కొంత సామాజిక స్పృహతో పాటలు వస్తూనే, మరో పక్క ఐటెం సాంగ్స్ పాటల డాన్స్‌లతో జనాలని థియేటర్స్‌కి రప్పించే వాళ్ళు. ఆ పాటలే చాలాసార్లు సినిమా తెరను దాటి, ప్రేక్షకులను దాన్లో భాగం చేయిస్తాయి. పారిశ్రామికీకరణ జరిగి ఎప్పుడైతే యంత్రాలు వచ్చేశాయో సంగీతం రణగొణమయం అయిపోయింది. గులక రాళ్ళు డబ్బాలో పోసి కొట్టినట్టు. ఎలక్ట్రిక్ గిటార్లు, కీ బోర్డులు, జాజ్‌లు, డ్రమ్స్ వచ్చేశాయి. పట్టణీకరణ, రణగొణ ధ్వని మన జీవితంలో భాగం అయిపోయినప్పుడు అటువంటి పాటలు రాక ఏమి చేస్తాయి. యాక్టివ్‌గా పాటలు పాడేవాళ్ళు పాసివ్‌గా చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని వినేవాళ్ళుగా మనుషులు మారిపోయారు. ఎవరి ఇంట్లో టివి వారికి అయిపోయింది. మరో పక్క సౌండ్ సిస్టం టెక్నాలజీలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఒకప్పుడు రేడియో, గ్రామఫోన్ మాత్రం ఉండేవి. తర్వాత కాసెట్స్ వచ్చాయి, ప్లేయర్స్, డీవీడీలు, సిడిలు, ఫోన్‌లు, ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ రకరకాల మార్గాల్లో అందరికీ సంగీతం అందుబాటులోకి వచ్చింది. డీజె అం టే డిస్క్ జాకి అని అర్థం. రికార్డ్ మ్యూజిక్‌ని ప్రేక్షకుల కోసం ప్లే చేసేవాడు అని అర్థం. వీరిని మ్యూ జిక్ క్యూరేటర్స్ అనవచ్చు. మొదట వీళ్ళు రేడియో లలో పాటలు వినిపించేవారు. తరువాత లైవ్ ప్రో గ్రామ్స్‌కి ప్లే చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరికీ డీజె ఒక వేదిక అయ్యింది. ఒక సామూహిక వ్యక్తీకరణ అయిపోయింది.
నలుగురూ కూడి గెంతడం అనేది. వేసేవాళ్ళు చూసేవాళ్ళు అనే గీతని చెరిపి కళ అందరిది అన్నట్లు చేస్తుంది. నీకు కచ్ఛితంగా డాన్స్ రావాలని లేదు. దాని హై సౌండ్‌కి ఆటోమేటిక్‌గా ఊపు వస్తుంది. గెంతాలి, కాళ్లు, చేతులు ఊపుతూ, నిన్ను నువ్వు ఒక గంట మరిచిపోవాలి, చెమటలు చిందా లి. అది ఒక వ్యాయామంలా ఉంటుందేమో. పిచ్చివాడిగానో, దేవుడో, దెయ్యమో పట్టినట్టుగా కాకుం డా, మనిషిలో సహజమైన కోరిక రిధానికి అనుగుణంగా బాడీ కదపడం అనేది. డాన్స్‌లో ట్రాన్స్ అనేది వ్యక్తిని ఒక లిమినల్ స్టేట్‌లో పెడుతుంది. ఆ స్థితిలో వాళ్ళు క్షాళన చెంది మళ్ళీ బయటకి మామూలు వ్యక్తుల్లా వస్తారు. మనం పాసివ్ స్థితి నుండి యాక్టివ్ స్థితిలోకి మారడానికి డీజే ఒక ఉపకరణం. అయితే దాని అతి శబ్దాలు ప్రమాదం. ఏ ఆనందం అయినా తోటివారికి హాని చేయనంత వరకు ఫర్వాలేదు. అందుకే డీజేకి హద్దులు పెట్టుకుని ఆనందించడం మన బాధ్యత.
– జి.ఆర్. శివ్వాల
అంబరాన హారతులు
పెద్దవాగు పాటవింటున్నంతసేపు
అరుణ కాంతుల పరవళ్లు
సుస్వర రాగాలు ప్రవహించినంత దూరం
జలపాతంలో స్నానం చేసినట్లుంటది
పల్లె కన్నీరని
ప్రపంచానికి ఎజెండాగా చేసిన శ్రామికగీతం
సమస్త వృత్తుల జీవన సౌందర్య గీతం
పచ్చ జొన్నకంకులు పాలువోసుకున్నట్లు
ఉవ్వెత్తున ఆకాంక్షల సమరోత్సాహం
ఆ చిటుకుల అందెల రవళులకు
పడగెత్తి బుసకొట్టే పాషాణాలు
కన్నీరు, మున్నీరూ పరిపూర్ణ చంద్రోదయం
చినుకు, జడివాన, మహానది,
మహా సముద్రం కవితాత్మక రాగంలో
ఒదుగడానికి పోటీ పడుతున్నాయి
నల్లతుమ్మ, కొంగ, పిట్ట, సెరువు వెన్నెల
ప్రజల హృదయాలలో మనోముద్రలు
చిందు, భాగోతం, యక్ష, బైరాగి
జమిడీక రాగాలు సమస్తం
పసి మనసు అగ్నిగుండం దూలాడినట్లు
లేగదూడలు అంబాడే అంబురం
బొంగురమై తిరిగే ఆట
పంటచేలు పురి విప్పినట్లు
నక్షత్రాలు కాంతిని విరజిమ్మినట్లు
హరిదాస సంకీర్తనలు అవని రాగాలు
రాజ్యహింసపై రణం, అంటరాని
గాయాలపై పెను సమరం
సమస్త పీడనలపై కార్యక్షేత్రమై
కవాతు చేసింది
మహనీయుల బోధనల
సమతా శాంతి గీతాలాపనలతో ప్రతిధ్వనిస్తూ
అస్తిత్వానికి ఆత్మగౌరవ శిఖరాగ్రం
కాలం అతని పాటతో మేల్కోంటుంది
సంధ్య, అతని అందెల సవ్వడిలో
సేదతీరుతూ నిద్రలోకి జారుతుంది
సూర్యునిది గూడ సంచారమే
అతని పాటది కూడ నిత్య సంచారమే
తరగని భావం తరిగిపోని నిధి
దురాక్రమణ, దుర్బుద్ది, దోపిడీ నిరంతరం
ఆధిపత్య అగ్ని మంటలపై గజ్జ కట్టిన
ఎదురీతలు సమధర్మానికై సమతా గేయాలు అఖండ విముక్తి గీతాలు
బంతి చేమంతులు, బొండుమల్లెల పరిమళాలు
అక్కమహాదేవి, బసవేశ్వరుడు, లక్షమ్మ
ఎరుకలి నాగన్న మీదైనా, ఉత్తరాంధ్ర మీదైనా
పోరాటాల పరిటాల శ్రీరాములైనా
రాయలసీమ రతనాల సీమైనా
సకల అస్తిత్వాల జీవన రాగాల జీవధారలు
లేతకాళ్లు వెండిపట్టీలు తొడుక్కున్న కాంతి
వ్యవసాయనికి నాగలిలా
తెలంగాణా మహాసంగ్రామానికి
యుధ్ధ గానాలు
తల్లీ తెలంగాణమా నిలువెల్ల గానమా
పూసిన పున్నమి వెన్నెల వీణ..
పునర్మిర్మాణ పుట్ట బంగారాలు
కృష్ణా, గోదావరి పరవళ్లలా చైతన్యధారలు
పాలమీగడల తేనె ధారలు
తాటికల్లును ఒంపినట్లు, చెత్తిరి పరుచుకున్నట్లు
వెదురు గుమ్ములల్లుకున్నట్లు
మగ్గంపై చేనేత సింగిడీలు పరిచినట్లు
కసిర గొంగళ్లు కుచ్చుల కడలేసినట్లు
జమ్మి చెట్టున పాలపిట్టలు వాలినట్లు
దీపావళి సంబరాలలా
సంక్రాంతి ముగ్గులు పరుచుకున్నట్లు
ఉగాది షడ్రుచుల సమ్మేళనాలను
ఒంపుతున్న తొలకరి గేయాల సందళ్ళు
కాలజ్ఞానాల తత్వాలు
అచల యోగుల అడుగు జాడలు
హనుమద్దాసు అపర కీర్తనలు
అన్నమయ్య సంకీర్తనలు పాల్కూరికీ స్మరణలు
హఠయోగి చెన్నదాసు పురాతత్వాలు
సత్యహరిశ్చంద్ర వీరబాహుడి రాగాలు
నాటక రంగం అతని అంతరంగ గంధం
నా కొడుకు అంటున్నాడు
నాయనా అల్లరి చేయకు
టివిలో వెంకన్న పాటొస్తున్నది
పెదనాయన జీర రాగం వినమంటున్నాడు
పాత చాటల మీద డేంకడెడ్డం పాటకు
చెరువు సెలిమలలో చిందులేస్తున్న పిల్లలు
పరుగెత్తే పిచ్చుకలు
పాటసంబురానికై నేలవాలిన చిలుకలు
పాటకు డాక్టరేట్ వచ్చిన సంబురం
కోయిల కిలకిలరావాలు
పిచ్చుకలు కిచకిచల చప్పట్లు
దిగ్ దిగ్దింతాలు దోసిళ్లు పట్టినయి
నదులు పూర్ణకుంభాలై, పకృతి బోనమెత్తింది
ధరణి గండదీపమెత్తింది
అమ్మ ఈరమ్మ గొంతుకై
అపరదనుర్దాసు నాయనై
జయహో గోరటివెంకన్న పాటకు
అంబరాన హారతులు
– వనపట్ల సుబ్బయ్య
– (అంబేద్కర్ సార్వత్రిక విశవిద్యాలయం
ప్రజాకవి గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా)