పేరుకు ‘పార్ట్‌టైమ్’.. విధులు ‘ఫుల్‌టైమ్’
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ‘పార్ట్‌టైమ్ అధ్యాపకుల’ జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. రాష్ట్రంలోని నిరుపేద తెగలకు చెందిన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతితోపాటు పోటీ ప్రపంచంలో ఉన్నతంగా రాణించేందుకు ప్రమాణ విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘పార్ట్‌టైమ్ అధ్యాపకుల’ను అన్ని అర్హతలను అనుసరిస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, పటిష్టమైన నిర్దేశంతో ఆయా గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం శుభపరిణామం. అలాగే శాశ్వత అధ్యాపకులవలే ప్రభుత్వ, ఆయా ఉన్నతాధికారుల నియమ నిబంధనలను తూచా తప్పకుండ సక్రమమైన విధులు నిర్వర్తిస్తున్న ‘పార్ట్ టైమ్ అధ్యాపకుల’ జీవితాలు ప్రస్తుతం శ్రమకు తగిన వేతనం అందకపోవడంతో అయోమయ స్థితిలోకి నెట్టివేయబడ్డాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్‌సి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ టీచర్లకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జిఒ నెం 16, 63 ఇప్పటి వరకు అమలు కాకపోవడం గమనార్హం.
ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సేవలను ఇప్పటికైనా గుర్తిస్తూ వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల విధులను తూచా తప్పకుండా, సక్రమంగా అందిస్తున్నందున బేసిక్ పే వేతనాలను పార్ట్‌టైమ్ ఉద్యోగులకు వర్తింపజేయడంతోపాటు 30 శాతం పిఆర్‌సిని అందించాలి. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలు తక్కువే అయినా గురుకులాల్లో అధిక బాధ్యతలను మోస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా శాశ్వత ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఏమాత్రం తక్కువ కాకుండా సమానంగా పని చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ తెగల్లోని తండాలు, గూడెంల్లోని నిరుపేద గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్తును తమదైన శైలిలో తీర్చిదిద్దుతూ, గురుకుల విద్యాలయాల సొసైటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వీరి అమూల్య సేవలను పొందుతున్నందుకుగాను వేతనంగా కేవలం రూ. 14000 మాత్రమే అందిస్తోంది. దీంతో పార్ట్‌టైమ్ అధ్యాపకులు కుటుంబ పోషణలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, అరకొర సౌకర్యాలతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి, రాత, మౌఖిక పరీక్షలు, డెమో క్లాస్ నిర్వహించి, అన్ని రకాల విద్యార్హతలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటిడిఎ పిఒ ద్వారా పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో చాలా మంది గురుకులంలో విద్యను అభ్యసించిన నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందినవారే.
తాత్కాలిక ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో ఉదయం గం. 8 నుంచి మధ్యాహ్నం గం. 1:30 వరకు తరగతులు, డైనింగ్ హాల్ డ్యూటీ, మధ్యాహ్నం గం. 2:30 నుంచి గం. 4:00 వరకు సూపర్‌విజర్ స్టడీ, గం. 4:00 నుండి 4:30 వరకు క్లబ్ కృత్యాల నిర్వహణ, సాయంత్రం 6:30 సప్పర్ డ్యూటీ, గం. 7:30 నుండి 10:00 వరకు నైట్ స్టడీ సూపర్‌విజిన్‌తోపాటు నైట్ స్టే, హాలిడే డ్యూటీ ఉదయం గం. 9:00 నుండి రాత్రి 9:00 వరకు, హౌస్ మాస్టర్ డ్యూటీ, వివిధ రకాల ఇన్‌చార్జి బాధ్యతలు సహా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 24 గంటలు పని చేస్తున్నా కొందరి ప్రధానోపాధ్యాయులు దురుసుతనం ప్రదర్శించినా నోరుమెదపక సొసైటి అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న అధ్యాపకులు పేరుకు పార్ట్‌టైమ్ అయిన విధులు మాత్రం ఫుల్‌టైమ్ చేస్తూ 24 గంటలూ గురుకులాలకే తమ అమూల్యమైన సేవలను అంకితం చేస్తున్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు గురుకుల ఆవరణలో క్వార్టర్స్ ఇవ్వకపోవడం వల్ల నైట్ డ్యూటీ తర్వాత తమ ఇళ్లకు చేరే సందర్భంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ, పలువురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేసే అటెండర్, వాచ్‌మెన్ల వేతనాలతో పోలిస్తే పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలు తక్కువగా ఉండటంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు.
పేరుకే పార్ట్ టైమ్ కానీ, 24 గంటలూ పని చేయిస్తూ అధికారులు పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వం పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉపయోగించుకొని, వేతన విషయంలో తీవ్ర వివక్ష చూపిస్తూ, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. ఇతర గురుకుల సొసైటీ పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలతో పోల్చితే, గిరిజన గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పార్ట్‌టైమ్ అధ్యాపకులకు పనికి తగిన గౌరవ వేతనాలు అందించాలి. ప్రభుత్వం పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యల విషయంలో ప్రత్యేక చొరవ చూపి, గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సమస్యలు తప్పక పరిష్కరించాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిఆర్‌సి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ అధ్యాపకులకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జిఒ నెం. 16, 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం బాధాకరం. ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు నిరుపేద గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అందిస్తున్న నిర్విరామ సేవలను గుర్తిస్తూ, సమస్యల పరిష్కారంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది.
ఈదునూరి మహేష్
9949134467