Latest News
కొన్ని ఎమోషనల్ సీన్స్ సవాలుగా అనిపించాయి
లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఆ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం వుంది. కురల్ పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది.
ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. -కురల్ తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా వుంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఈ పాత్ర చేయడం చాలా మంచి అనుభవాన్నిచ్చింది. -ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు సవాలుగా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. -ప్రదీప్ రంగనాథ్‌తో నటించడం మంచి అనుభవం. ఆయన మల్టీ టాలెంటెడ్. -శరత్ కుమార్ లాంటి సీనియర్ యాక్టర్స్ తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. -డైరెక్టర్ కీర్తి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇందులో వుండే ఎమోషన్స్, ఫన్ చాలా యూనిక్‌గా ఉంటాయి”అని అన్నారు.
బాలానగర్ లో కవల పిల్లలను చంపి… భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పద్మ నగర్ ఫేస్ వన్ లో సాయి లక్ష్మి(27) అనే మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. దంపతులు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబు, పాపను చంపి అనంతరం ఆమె మూడో అంతస్థు నుంచి దూకి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
రాయుడితో బలవంతంగా చెప్పించి… హత్య చేశారు: సుధీర్ రెడ్డి
అమరావతి: డ్రైవర్ రాయుడు వీడియోపై టిడిపి ఎంఎల్‌ఎ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐ, మార్ఫుడ్ వీడియో అని తెలిపారు. రాయుడుతో బలవంతంగా మాట్లాడించి అనంతరం అతడిని చంపి ఉంటారని ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని, తనపై బురద జల్లడానికి ఈ వీడియో విడుల చేశారని మండిపడ్డారు. డిపాజిట్లు రాని వారితో తనకు పని ఏంటని ప్రశ్నించారు. ఆమె తనకు రాజకీయ ప్రత్యర్థి కాదు అని, డిపాజిట్ కూడా రాని వినుత గురించి తాను ఎందుకు లక్షలు ఖర్చు చేస్తానని ప్రశ్నించారు. వినుత దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారని, వాళ్ల డ్రైవర్ గురించి తనకు ఎలా తెలుస్తుందని బొజ్జల సుధీర్ రెడ్డి అడిగారు. వినుతకు బెయిల్ వచ్చిన తరువాత వీడియో విడుదల చేయడంలో అనుమానం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో తన కోసం ఆమె ఎప్పుడు పని చేయలేదన్నారు. ఓటు వేయాలని వనిత ఇంట్లోకి తమ కుటుంబ సభ్యులు వెళ్తే రానివ్వలేదన్నారు. రాయుడి వీడియోపై దర్యాప్తు చేయాలని ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశానని రాయుడు వీడియోలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాయుడు హత్య కేసులో దంపతులు అరెస్టు కావడంతో పాటు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.
కరీంనగర్ లో బాలికపై అత్యాచారం…. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు
విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేషియల్ రికగైజేషన్ తప్పనిసరి
వైద్యకళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం
విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
ఆహార నాణ్యత పరీక్షకు ప్రత్యేక యాప్
సకాలంలో యూనిఫామ్‌లు, పుస్తకాల పంపిణీ
ఖర్చులు, బకాయిలపై యాక్షన్ ప్లాన్
సంక్షేమ వసతి గృహాల సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటును కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు.
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసిసిసిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉపయోగించాలని సిఎం సూచించారు. విద్యార్థులకు విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని దాంతో వారికి లభించే క్యాలరీలను తెలుసుకోవాలని సిఎం ఆదేశించారు.
యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో…
హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డులో అప్‌లోడ్ చేయాలని సిఎం ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సిఎం సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సిఎం సూచించారు.
ఖర్చులు, బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తానికి
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షిప్‌లు సిబ్బంది జీతాలు, డైట్‌ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్‌ను ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అవసరమైన యాప్‌లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజేంటేషన్ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి బుద్ధప్రకాష్ జ్యోతి , బి. షఫియుల్లా, అనితా రామచంద్రన్, క్షితిజ, నిర్మల క్రాంతి వెస్లీ, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
కాంప్‌బెల్, హోప్ హీరోచిత సెంచరీలు.. గెలుపు బాటలో టీమిండియా
భారత్ లక్ష్యం 121 రన్స్, ప్రస్తుతం 63/1
ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న విండీస్
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచింది. 173/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు తిరిగి బ్యాటింగ్‌ను చేపట్టిన విండీస్ 390 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత 121 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌ను చేపట్టిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ జట్టును లక్షం వైపు నడిపిస్తున్నాడు. సోమవారం ఆట నిలిపి వేసే సమయానికి రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టినవిండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాల్ ఆన్ ఆడింది.
హోప్, కాంప్‌బెల్ పోరాటం..
సోమవారం తిరిగి బ్యాటింగ్‌ను ప్రారంభిచిన విండీస్‌కు ఓవర్‌నైట్ బ్యాటర్లు కాంప్‌బెల్, షాయ్ హోప్‌లు అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు కాంప్‌బెల్ అటు హోప్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కాంప్‌బెల్ లంచ్ బ్రేక్‌కు ముందే సెంచరీని సాధించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కాంప్‌బెల్ 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసి కుల్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో హోప్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ తర్వాత హోప్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన హోప్ 214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (40) కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇక చివర్లో జస్టిన్ గ్రీవ్స్, జైడెన్ సీల్స్ అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఇద్దరు కలిసి చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించడం విశేషం. కీలక ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీల్స్ 67 బంతుల్లో 32 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెలివిలియన్ చేరాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా మూడేసి వికెట్లను పడగొట్టారు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
చెర వీడింది…శాంతి చేరువైంది
20మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్
పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇరుపక్షాలలో పండుగ వాతావరణం
అయినవారిని చేరి ఆనందడోలికల్లో..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ నీరాజనం
ప్రపంచానికి మరింతమంది ట్రంప్‌లు కావాలని ఆకాంక్ష
వచ్చే ఏడాది నోబెల్‌కు ప్రతిపాదిస్తామని స్పష్టీకరణ
ట్రంప్‌కు బంగారు పావురాన్ని ప్రదానం చేసిన ఇజ్రాయెల్ నేత
నెతన్యాహు ఇజ్రాయెల్ చట్టసభల్లో ట్రంప్ ప్రసంగం
ధాంక్యూ బీబీ..గొప్పపని చేశావ్: ట్రంప్ ప్రశంస
ట్రంప్ నిజాయితీ ప్రయత్నాలకు మోడీ మద్దతు
గాజా సిటీ: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. ఇజ్రాయెల్‌హమాస్ మధ్య కుదిరిన కొత్త కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సోమవారం ఇజ్రాయెల్ సజీవ బందీలు 20 మందిని దశల వారీగా విడిచిపెట్టింది. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండోదశలో మిగతా 13 మందిని విడిచిపెట్టి రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగించింది. వారిని తీసుకుని రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది.
ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు కూడా త్వ రలోనే అప్పగించనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 2 ల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈలోగా కా ల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన అ మెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ ఈజిప్టులో గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ముందు గా ఇజ్రాయెల్‌కు విచ్చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ “ గాజా యుద్ధం ముగిసింది.
ఈరోజు చాలా గొప్పదినం.ఇది శుభారంభం ” అని ట్రంప్ అభివర్ణించారు. శాంతి ప్రణాళిక ప్రకారం హమాస్ నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బందీల కుటుంబీకులను కూడా ట్రంప్ కలుసుకుంటారు. రెండేళ్ల తరువాత తమ ప్రియతములను చూడగానే ఆయా కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. హమాస్ నుంచి విడుదలైన ఏడుగురి బందీలను ఐడీఎఫ్, ఐఎస్‌ఎ అధికారిక బృందాల సాయంగా ఇజ్రాయెల్‌కు తీసుకువస్తున్నట్టు పేర్కొంది. వారు చేరుకోగానే వైద్యపరీక్షలు జరుగుతాయి. మరికొంతమంది బందీలను ఈరోజు తరువాత రెడ్‌క్రాస్‌కు బదిలీ చేయడమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
ఇజ్రాయెల్ నగరాల్లో ఆనందం వెల్లువ
బందీల పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే లభ్యం కాకపోయినా, వారు విడుదలయ్యారన్న వార్తకు స్వదేశంలో అనేక చోట్ల ఆనందాతిశయా లు వెలువడ్డాయి. నగరాలు, పట్టణాల్లో జనం గుమికూడి విడుదల సంఘటనల లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లను సందర్శిస్తుండటం కనిపించింది. టెల్ అవీవ్‌లో భారీ ఎత్తున బహిరంగంగా తెరలపై దృశ్యా లు ప్రదర్శించారు. చాలా మంది ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతుల స్వాగతం
బందీలు తిరిగి స్వదేశానికి తరలివస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా లిఖితపూర్వకమైన స్వాగతం పలికారు. తాము రాసిన నోట్‌లో “ఇజ్రాయెల్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మీకో సం నిరీక్షిస్తున్నాం. మిమ్మల్ని ఆనందంగా హత్తుకుంటాం” అని పేర్కొన్నారు. తిరిగివచ్చిన బందీలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన రిసెప్షన్ కిట్ అందుతుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆ కిట్‌లో దుస్తులు, వ్యక్తిగత సామగ్రి, లాప్‌టాప్, ఫోన్, టాబ్లెట్ ఉంటాయి. బందీలు వచ్చే దారి పొడుగునా ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వాగత పతాకాలను నెలకొల్పారు.
థాంక్యూ బీబీ.. గొప్పపని చేశావ్: ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్ ప్రసంగం
బందీలను హమాస్ విడిచిపెట్టిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ చట్టసభలో మాట్లాడుతూ.. థాంక్యూ వెరీమచ్ బీబీ, గొప్పపని చేశావని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పొగిడారు. “మధ్య ప్రాచ్యంలో సరికొ త్త చరిత్ర ఉదయిస్తోంది. ఈ పవిత్ర భూమిలో శాంతి వీచికలు వీస్తుండగా ఆకాశం నిర్మలంగా మారింది. తుపాకులు మూగపోయాయి. ప్రస్తు తం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్ లో ప్రారంభమైంది. బందీలు తిరిగి వచ్చారు. ఈ మాట చెప్పడం ఎంతో బాగుంది. కాల్పుల విరమ ణ ఒప్పందానికి సంబంధించి మేం సమయాన్ని వృథా చేస్తున్నామని చాలామంది అన్నారు. కానీ మేం సాధించాం” అని ట్రంప్ మాట్లాడారు. హో లోకాస్ట్ (రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు సాగించిన నరమేథాన్ని హోలోకాస్ట్ అం టారు) తర్వాత యూదులపై జరిగిన అత్యంత దారుణంగా అక్టోబర్ 7 దాడులను వ్యాఖ్యానించారు.
అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంద ని బాధిత కుటుంబాలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు, సలహాదారులు జేర్డ్ కున్నర్‌ను ఈ సందర్భంగా కొనియాడారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ట్రంప్ మాట్లాడుతోన్న సమయం లో కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మారణహోమం అంటూ నినాదాలు చేశారు. దాంతో వారిని చట్టసభ నుంచి బయటకు పంపివేశారు. ఈ నిరసనలపై ట్రంప్‌నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారమంతా గమనించిన ట్రంప్ , సమర్థవంతంగా పనిచేశారని చమత్కరించారు. దాంతో సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ట్రంప్ అని నినాదాలు చేశారు.
అక్కలతో సఖ్యత
సీతక్క, సురేఖలతో విభేదాలు లేవు
వారిరువురు సమ్మక్క, సారక్కలా పని చేస్తున్నారు
నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదు
రూ.70కోట్ల కాంట్రాక్టు కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు
నేనేంటో అందరికీ తెలుసు
మంతి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: అటవీ శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో త నకు ఎలాంటి వివాదాలు లేవని వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ప ష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా, ఎస్ ఎస్ తా డ్వాయి మండలం, మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆల య అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతర వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై మంత్రి స్పందిస్తూ..తానేంటే అందరికీ తెలుసునని, కేవలం రూ.70 కోట్ల విలువైన కాంట్రాక్టు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనపై తమ సహచర మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని వ్యా ఖ్యానించారు. అయినా..నాపై ఫిర్యాదు చేయడానికి ఏ ముందని ప్రశ్నించారు. అధిష్టానానికి ఎవరూ ఫిర్యాదు చే సే ఛాన్సే లేదన్నారు. తాను కూడా అలా జరుగుతుందని న మ్మడం లేదని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేర కు అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. సమ్మక్క, సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో పాల్గొంటానన్నారు. తన సహచర మహిళా మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క, సారక్కలా పనిచేస్తున్నారు అని అన్నారు. తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాల్గొంటానని అన్నారు.
2024లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారి అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రికి అమ్మవార్ల పై ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా అమ్మవార్ల దర్శనం జరగాలని మేడారం సమ్మక్క, సారమ్మ జాతర ప్రాముఖ్యత ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
జీఓ నెంబర్ 93 ని కొట్టేయాలని కోరిన పిటిషనర్
కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఎక్సైజ్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా జారీ చేసిన జీఓ నెంబర్ 93 ను కొట్టివేయాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నూతన మద్యం పాలసీలో ఒక్కో దరఖాస్తు రుసుము మూడు లక్షలుగా నిర్ణయించటం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులకు షాపు దక్కకపోతే సదరు రుసుము అబ్కారీ శాఖకు వెళుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాటరీలో షాపు దక్కకపోతే మూడు లక్షల దరఖాస్తు రుసుము తిరిగి ఇచ్చే విధంగా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో పిటిషనర్ వాదలు విన్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.