తనిఖీ సరే, బోధన ఎలా!
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు శాశ్వతంగా తనిఖీ బృందాలు నియమించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. సుమారు 24 వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి 299 కమిటీలువేసి వాటిలో పాఠశాలల్లో బోధించి కనీసంగా పదేళ్ళ బోధనానుభవం కలవారిని శాశ్వతంగా తనిఖీ బృందాలుగా నియమిస్తారు.16,474 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి 504 మంది ఉపాధ్యాయులతో 168 తనిఖీ బృందాలు, 3,100 మాధ్యమిక పాఠశాలలకు 105 మంది ఉపాధ్యాయులను 35 బృందాలుగా, 4,672 ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు 864 మంది ఉపాధ్యాయులతో 96 పర్యవేక్షణా బృందాలు వెరసి 1473 మంది ఉపాధ్యాయులు శాశ్వతంగా మానెటరింగ్ ప్రక్రియలో వినియోగం చేస్తారు. ఇక ఈ తనిఖీ బృందాలలో నియమితులైన వారెవరూ ఇంకా వారివారి పాఠశాలల కెళ్ళి పాఠాలు చెప్పవలసిన పనిలేదు. అంటే 1473 పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనా సేవలు ఇంకా అందవని అర్థం.
ఇక గత ముప్పైఏళ్ళుగా పాఠశాలల తనిఖీ అధికారులు అయిన మండల విద్యాశాఖ్య అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ పోస్టులు నింపకుండా విద్యాశాఖ చోద్యం చూస్తా ఉంది. అత్యంత కీలకమైన ఈ పాఠశాల తనిఖీ అధికారులు పోస్టులు నింపకపోగా తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌ఛార్జీలను వేసి చేతులు దులుపుకుంటున్నారు. నియమించిన ఈ తనిఖీ అధికారులు ఎప్పటిదాకా ఉంటారో, పోస్టు ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 634 మండల విద్యాశాఖ అధికారులు, 70 మంది జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, 33 మంది జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీకి అధికారికంగా ఉండగా, తాజాగా ఈ నియామకాల వల్ల విద్యాశాఖ సాధించేది ఏమీ ఉండదు? ఇంతకు ముందు అనుభవాలు మనకు ఉండనే ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఓ 30 ఏళ్ళ క్రితం మండల విద్యా వనరుల కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులు బృందాలను మండల రీసోర్స్ పర్సన్ లుగా నియమించి ఓ దశాబ్దం పాటు ప్రయోగం చేశారు. ఈ రీసోర్స్ పర్షన్ల నియామకం వలన ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరే లేదని, పైగా ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని తిరిగి వారందరినీ వారివారి పాఠశాలకు పంపించి వేశారు. తనిఖీ బృందాలలో నియమితులైన వీరు ఉద్యోగ ధర్మం కంటే సొంతపనులపై తిరిగారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే సొంత వ్యాపారాలు ప్రారంభించారు.
మరికొందరు ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిన సమయంలో సొంత పనులు చక్కబెట్టుకున్నానే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే విద్యాహక్కు చట్టం -2009 వచ్చిన తర్వాత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతృత్వంలో ఒక సబ్జెక్టు నిపుణుల బృందంను వారంలో ఒకరోజు ఇతర పాఠశాలల తనిఖీకి వాడుకున్నారు. అయితే ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధానానికి కూడా మంగళం పాడారు. గత అనుభవాలు ఉండికూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయడం వలన విఫల ప్రయోగం కాదా? తెలంగాణ విద్యా శాఖ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈ తనిఖీ బృందాలు నియామకం వలన మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ ఉప అధికారులకు ప్రత్యామ్నాయంగా మరో అధికార కేంద్రం అనధికారికంగా పెట్టారనే భావన, పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తమ తోటి ఉపాధ్యాయులే, సమాన హోదాలో తమను తనిఖీ చేయడం ఏమిటి? అనే ఒక రకమైన ఆత్మనూన్యతకు గురయ్యేఅవకాశం ఉంది.
ఇక తనిఖీ బృందాలకు టిఎ, డిఎల కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతచేస్తే చివరకు 60 శాతం విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలు తనిఖీకి వీరికి అధికారం కల్పిస్తారా? లేదా? కేవలం 40 శాతం పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలకే ఈ తనిఖీలను పరిమితం చేస్తారా? ఇలా చేసినట్లైతే అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నియంత్రణ కనీసంగా లేని ప్రైవేటు పాఠశాల మానెటరింగ్‌కు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళన, నియంత్రణ అవసరం లేదా? అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన, కేవలం గణితం, సైన్స్ తప్ప మరో సబ్జెక్టుపై బోధన కేంద్రీకరించలేని ప్రైవేటు పాఠశాల తనిఖీ బాధ్యత ఎవరు చేపట్టాలి? ఇక విద్యాహక్కు చట్టం -2009 లోని నిబంధన 19 (1)హెచ్ ననుసరించి 2010 ఏప్రిల్ నుండి మన పరీక్షా విధానం సమూలమైన మార్పుకు గురైంది.
సులభతరమైన, ఒత్తిడి లేని నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో తనిఖీ అధికారులు అవసరం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరగతి గది మధ్య ఎప్పటికప్పుడు అత్యంత సులభతరంగా ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈ పునచ్ఛరణ అనుభవం నుండే అటు ఉపాధ్యాయుడు తన బోధనా అనుభవాలు స్థిరీకరణ జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొంటారు. ఎందుకో మన తెలంగాణ విద్యాశాఖ ఇసిసిఇ విధానాన్ని జీర్ణించుకున్నట్లు కనిపించడంలేదు. అందుకు తాజా ఉదాహరణ గత దశాబ్ద కాలంగా నడుస్తున్న పదవ తరగతి పరీక్షలలో గ్రేడులకు బదులు తిరిగి మార్కులు ప్రవేశపెట్టడం. తరగతి గది మూల్యాంకనం ప్రక్రియ అయిన నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అవుతుంది. పరీక్షలను చట్టబద్ధ స్థితి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెప్పు కోసం గ్రేడుల నుండి మార్కుల వైపు మోగ్గు చూపిన వైనం స్పష్టంగా కనపడుతుంది. గతంలో మండల రీసోర్స్ పర్షన్ల నియామకాలు వలన తేలింది ఏమంటే చాలా చోట్ల ఎంఆర్‌పిలు తమ విధులు విస్మరించి సొంత పనుల వైపు మొగ్గారు.
విద్యాశాఖ అధికారులకు దళారీ వ్యవస్థగా పని చేశారు. పాఠశాలలు తనిఖీలు చేయాల్సిన వీరు కాగితాలు స్వీకరించి, కాకి లెక్కలు, గణాంకాలు, నివేదికలు స్వీకరించే పరిస్థితి మాత్రమే ఉండేది. ఆ కాగితాలు కంప్యూటర్ కెక్కించడంపై సమీక్షలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదు! కనుక తెలంగాణ విద్యాశాఖ పెద్ద సంఖ్యలో శాశ్వతంగా మానెటరింగ్ జట్టును నిర్మించేటప్పుడు గత అనుభవాలను తప్పనిసరిగా సమీక్షించుకోవాలసిన అవసరం ఉంది. తనిఖీ అధికారులు ఏర్పరిచే ముందు నమోదు క్షీణించిపోతున్న ప్రభుత్వ బడుల సంస్కరణ, పునర్వ్యవస్థీకరణ వైపు దృష్టి పెట్టడంతోపాటు, ప్రైవేటు పాఠశాలల వనరులలోపం, నిబంధనలు ఉల్లంఘన, ఫీజుల క్రమబద్ధీకరణ తదితర విషయాలు తనిఖీ చేసి చక్కదిద్దాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన ఉంది.
ఎన్. తిర్మల్
94418 64514