ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్థ్ధులు అస్వస్థతకు గురైన సంఘటన నగరంలో కలకలం రేపింది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు గురువారం రాత్రి ఆహారం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబు వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో చిల్డ్రన్స్ వార్డుకు తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ సంతోష్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, డీ హైడ్రేషన్, కారణంగా అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వారికి గ్లూకోజ్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి, చిల్డ్రన్స్ వార్డులో చికిత్సలు పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన వివరాలు, గురువారం రాత్రి వారు తీసుకున్న ఆహారం గురించి వాకబు చేశారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబును అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌వో శ్రీకళ, డాక్టర్ విజారత్. డాక్టర్ సోమ శేఖ ర్, ఎల్‌టి నరసింహారెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శమంతకమణి, గ్రేడ్=2 పద్మ, షాహెదా బేగంతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.