ఐపిఎల్ యాక్షన్ 2026లో దేశీయ ఆటగాళ్లే కీలకం
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ 2026 సీజన్ కోసం సన్నహాలు మొదలుపెట్టింది బిసిసిఐ. ఆటగాళ్ల మెగా వేలంతో ఈ సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ మెగా ఆక్షన్ అబుదాబి వేదికగా ఈనెల 16న నిర్వహించనుంది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకునేందుకు స్టార్ ఆటగాళ్లను దక్కించుకునే యోచనలో ఉన్నాయి. అయితే, గత కొన్ని సీజన్ల నుంచి స్వదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. అన్‌క్యాపెడ్ ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 ఏళ్లు దాటిన ఆగాళ్లను తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి ఫ్రాంచైజీలు. అయితే, వీరిలో ఐదుగురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా, తొలి వరుసలో నిలవనున్నాడు. 2025-26 స్మాట్ టోర్నమెంట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఏడు మ్యాచ్‌లలో 350 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ జట్లకు కీలకమైన మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే సత్తా ఉన్న ఆటగాడు చందేలా. దీంతో కోసం ఫ్రాం చైజీలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకపోవచ్చు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోట్లు పలకడం ఖాయం. మరో ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ గతంలో ముంబైఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఉన్న పంజాబ్ యువ ఆటగాడు,ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. స్మాట్‌లో పంజాబ్ తరఫున మూడోస్థానంలో ఆడి, ఏడు మ్యాచ్‌లలో 241 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 172.14తో దూకుడై ఆటతీరుతో చెలరేగుతున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇతడిని తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తూ.. ఏడు మ్యాచ్ల్లో 242 పరుగులు సాధించాడు. అతని సగటు 40+, స్ట్రైక్ రేట్ 162.41 గా ఉంది.
అతని మెరుపు ఇన్నింగ్స్లు హర్యానా సూపర్ లీగ్కు అర్హత సాధించడానికి దోహదపడ్డాయి. అతని దూకుడు ఆట ఐపీఎల్ జట్లకు మిడిల్ ఆర్డర్‌లో ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. ఐపీఎల్లో అనుభవం ఉన్న మనన్ వోహ్రా, 2025-26 స్మాట్‌లో చండీగఢ్ తరఫున ఆడిన ఏడు మ్యాచ్‌లలో 278 పరుగులు చేశాడు. అతని సగటు 46.33, స్ట్రైక్ రేట్ 135.60. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోల్పోయిన వోహ్రా, తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వోహ్రాకు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. దీంతో ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బరోడా జట్టుకు చెందిన భాను పనియా ఐపిఎల్ 2026 వేలంలో కీలకంగా మారనున్నాడు. 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగే సామర్థం ఉన్న ఈ యువ బ్యాటర్, చివరి ఓవర్లలో భారీ షాట్లు కొట్టే అసాధారణ సామర్థ్యం కలిగిఉన్నాడు. స్మాట్ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్ల్లో ఒకేసారి ఔటై, 112 సగటు, 180+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ తరహా లోయర్ హిట్టింగ్ చేసి, భారీగా పరుగులు రాబట్టగలిగే యువ బ్యాటర్. దీంతో పనియా సయితం వేలంలో కీలకంగా మారనున్నాడు.