మోగ్లీ చేసే యుద్ధంలో అందరూ తోడుండాలి, గెలిపించాలి
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ “కలర్ ఫోటో లాగే మోగ్లీ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. భైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత విశ్వప్రసాద్‌కు అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాలో రోషన్, సాక్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది”అని తెలిపారు. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ “మోగ్లీ తన ప్రేమ కోసం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ. అందరూ కూడా మోగ్లీ చేసే యుద్ధంలో తోడుండాలని కోరుకుంటున్నాను. థియేటర్స్‌లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను”అని తెలియజేశారు. మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ “ఇది చాలా మంచి సినిమా. సినిమాపై నమ్మకంతో డిసెంబర్ 13న వస్తున్నాము. రోషన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన విశ్వప్రసాద్‌కి ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ సాక్షి, బండి సరోజ్ కుమార్, చంద్రబోస్, రవికాంత్ పేరేపు, హేమంత్ మధుకర్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.