ఈ గెలుపుతో ప్రజల పట్ల మా బాధ్యత మరింత పెరిగింది: మహేష్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టమైందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల తొలివిడతలో ఘనవిజయం సాధించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తల విజయం అని.. అన్ని వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని తెలియజేశారు. ఈ గెలుపుతో ప్రజల పట్ల తమ బాధ్యత మరింత పెరిగిందని, 2,3 దశల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని మహేష్ గౌడ్ అన్నారు. ఓట్ చోరీతోనే తెలంగాణలో బిజెపి ఎంపిలు గెలిచారని, తెలంగాణలో 8 మందిని ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపిలు ఉన్న బిజెపి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది ఎంత? అని బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపిలకు వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ నేతల బాగోతాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బయటపెడుతోందని, కవిత ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సిఎం రేవంత్ రెడ్డిను కోరతానని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.