విశాఖ: కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఐదు సెంటర్లు ఉన్నాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాగ్నిజెంట్ సంస్థకు భారత్ నుంచే 2,41,500 మంది పనిచేస్తున్నారని ప్రశంసించారు. సంస్థ చీఫ్ కూడా భారతీయుడేనని, అదీ మన శక్తి అని, ఒక విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ లాంటి సుందరమైన నగరం ఇంకోటి లేదని, కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు. తాను ఏది చేసినా మెగా స్కేల్ లో ఉంటుందని, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని తెలియజేశారు. విశాఖలో ఎనిమిది సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నామని, ఎపిలో టాలెంట్కి కొరత లేదని, త్వరలోనే విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా మారబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వస్తాయని, విశాఖను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
అన్ని నగరాల కంటే విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువ అని, విశాఖను మరింత సుందరమైన నగరంగా, కాలుష్య రహితంగా మారుస్తామని తెలిపారు. అద్భుతాలు సాధిస్తున్నామని, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ మారబోతోందని, త్వరలోనే ఇక్కడ మెట్రో వస్తుందని, ఎకనమిక్ రీజియన్ కింద విశాఖను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ సమ్మిట్లో 613 ఎంఒయులు వచ్చాయని, రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, కంపెనీలు అన్ని ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్గా విశాఖ మారుతుందని చంద్రబాబు తెలిపారు. 2032 నాటికి విశాఖలో 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీ ఉంటుందని, విశాఖ ఎఐ, డేటా సెంటర్ హబ్గా తయారవుతుందని, ఓర్వకల్లో డ్రోన్ సిటీని తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు.