గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం.. థాయ్‌లాండ్‌లో ఓనర్స్ అరెస్ట్
పనాజి: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్త జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు క్లబ్ యజమానులు సౌరభ్ లూధ్రా, గౌరవ్ లూధ్రాలను థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి అధికారులు వారిని అదుపు లోకి తీసుకున్న దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. ఈనెల 6 న రాత్రి 11.45 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకోగా, నిందితులిద్దరూ 7న ఉదయం 5.30 గంటలకు ఓ విమానంలో థాయ్‌లాండ్ లోని ఫుకెట్‌కు పారిపోయినట్టు ముంబై లోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గుర్తించినట్టు ఇప్పటికే పోలీసులు తెలిపారు. వారి పాస్‌పోర్టులు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఆ దేశంలో ఉండటం చట్టవిరుద్ధం. దాంతో అధికారులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లో భారత్‌కు తరలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవా లోని బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ నుంచి గోవాకు సహ యజమాని అజయ్‌గుప్తా తరలింపు
గోవా క్లబ్ దుర్ఘటన కేసులో సహ యజమాని అజయ్ గుప్తాను దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు గోవాకు తీసుకు వచ్చారు. జమ్ముకు చెందిన గుప్తాను బుధవారం ఉదయం ఢిల్లీ లోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వినోద్ జోషి ముందు హాజరు పరిచారు. 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉంచడానికి పోలీసులకు మెజిస్ట్రేట్ అనుమతించడంతో గోవా పోలీసులు మోపా మనోహర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో గుప్తాను తీసుకుని బుధవారం రాత్రి 9.45 గంటలకు దిగారు. ఆ తరువాత విచారణ కోసం అంజునా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అంతకు ముందు గుప్తాకు వ్యతిరేకంగా లుక్ అవుట్ సర్కులర్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు మేనేజర్లు, స్టాఫ్ సభ్యులు, ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు.