2027 జనాభా లెక్కల నిర్వహణకు రూ. 11,718 కోట్లు
భారత జనాభా లెక్కలు 2027 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లు ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం నాడు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ శుక్రవారం నాడు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనాభా లెక్కల నిర్వహణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొట్టమొదటి సారిగా 2027లో డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల గణన నిర్వహిస్తారని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుంది.తొలివిడతలో ఇళ్లలెక్కలు, తర్వాత జనాభా లెక్కలు చేపడతారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ గృహాల లెక్కలు, 2027 ఫిబ్రవరిలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యూమరేషన్ ) చేపడతారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ఎక్కువ కురిసే ప్రాంతాలలో జనాభా గణన 2026 సెప్టెంబర్ లో నిర్వహిస్తారు. 20 లక్షల సిబ్బంది తో జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో కులగణన డేటా కూడా సేకరిస్తారు. డేటా సేకరణ కోసం మొబైల్ యాప్ వినియోగించుకుంటారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ కార్యక్రమం సాగుతుంది.