మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో రి టైర్డ్ అయిన కొందరు డిస్టిక్ రిజిస్ట్రార్‌లు, మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు గ్రూప్‌గా ఏర్పడి అందినకాడికి దండుకుంటున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్లాట్లు, భూముల నిషేధిత జాబితాలో ఉన్నా, వాటికి అనుమతి లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఈ గ్రూపు సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని వారం రోజుల క్రితం సంబంధిత మంత్రికి, సిఎంకు ఫిర్యాదులు రావడం విశే షం. 18 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ రిటైర్ అ యిన డిఆర్‌లను, సబ్ రిజిస్ట్రార్‌లను తన గ్రూప్‌లో కలుపుకొని ఈ దందాకు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఎంఓ లో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో ఈ గ్రూపు సభ్యు లు సబ్ రిజిస్ట్రార్‌లపై రిజిస్ట్రేషన్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
వివాదాస్పద ప్లాట్లు, ప్రభుత్వ భూములే లక్షం..
ఈ గ్రూపు సభ్యులకు కొందరు డిఆర్‌లుగా, సబ్ రిజిస్ట్రార్‌లు వత్తాసు పలుకుతుండడం విశేషం. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు వెనుకడుగు వేస్తుండగా ఈ గ్రూపులోని సభ్యు లు వారిపై ఒత్తిడి తెస్తున్నారని, రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్ట్రార్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, గండిపేట్, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్భుల్లాపూర్ ఉప్పల్, శంషాబాద్, యాదగిరిగుట్ట, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, హయత్‌నగర్, ఎల్‌బినగర్, శంకర్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌లలోని వివాదాస్పద ప్లాట్లు, ఇళ్లు, ప్రభుత్వ భూములే లక్షంగా వీరి ఆగడాలు అధికమయ్యాయని పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. కొన్నేళ్లుగా వీరి ఆగడాలు అధికం కావడంతో సబ్ రిజిస్ట్రార్‌లు కొందరు సెలవుల్లో వెళ్లిపోతున్నారని, దీంతో తమకు అనుకూలంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారని సమాచారం.
తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పదోన్నతి పొందారని..
గ్రేటర్ పరిధిలో పనిచేసే ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ ఈ మధ్య ఆడిట్ పేరుతో సబ్ రిజిస్ట్రార్‌లను వేధిస్తున్నారని వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్‌కు ఆడిట్‌తో సంబంధం లేకున్నా ఆడిట్ నిర్వహించడం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిధిలో పనిచేసే మరో ఆడిట్ రిజిస్ట్రార్‌కు త్వరలో డిఐజీగా పదోన్నతి రావాల్సి ఉండగా ఆయన పదోన్నతులకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని ఆ శాఖకు సమర్పించారని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఆయనకు గతంలో ఇచ్చిన పదోన్నతుల విషయంలోనూ విచారణ జరపాలని, దీంతోపాటు ప్రస్తుతం డిఐజీగా ఆయన పదోన్నతి ఇవ్వొద్దని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.
ముందుకు కదలని పదోన్నతుల ఫైలు
పదోన్నతులకు సంబంధించి ఫైల్ పెట్టాలని మంత్రి ఆదేశించినా ఇప్పటివరకు అతీగతీ లేదని ఆ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక జాయింట్ ఐజి, నాలుగు డిఐజీ పోస్టులు, 7 డిఆర్ పోస్టులు, 7 గ్రేడ్ 1, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు దానికి సంబంధించి సీనియార్టీ జాబితాను ఆ శాఖ ఉన్నతాధికారులు రూపొందించలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంవత్సరం కాలంగా ఈ పదోన్నతులకు సంబంధించి ఫైలు ముందుకెళ్లకుండా కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని, వారికి పదోన్నతి వస్తే రోజువారీ ఆదాయం పోతుందన్న ఉద్ధేశ్యంతోనే ఇలా అడ్డుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా..
ప్రస్తుతం కాప్రాలో, గతంలో కూకట్‌పల్లిలో పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గతంలోనూ ఈ సబ్ రిజిస్ట్రార్ రెండుసార్లు ఏసిబికి పట్టుబడడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినా ఆ సబ్ రిజిస్ట్రార్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇబ్రహీపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల క్రితం రెండురోజులు సెలవుపై వెళ్లి మళ్లీ తిరిగి విధుల్లో చేరలేదు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన అబ్‌స్కాడింగ్ అంటూ ఉన్నతాధికారులు ఐజికి రిపోర్టు ఇచ్చారు. ఈయన గతంలో రెండుసార్లు ఏసిబి పట్టుబడ్డారు.
ఈయనపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనకు ఇబ్రహీంపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌గా విధులు కేటాయించినా మళ్లీ అక్కడ భారీగా అవినీతికి పాల్పడడం విశేషం. 10 రోజుల క్రితం తాండూరు ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కడంతో ఆయన స్థానంలో వేరే వాళ్లు ఇన్‌చార్జీగా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే తాండూరు ఆఫీసులో ముగ్గురు ఏసిబికి చిక్కడం విశేషం. ఈ శాఖలో సబ్ రిజిస్ట్రార్‌ల కొరత ఉండడంతో కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 2లు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1పై గతంలోనూ అనేక ఫిర్యాదులు రావడం విశేషం.