International
ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా
సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె -ర్యాంప్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా ర్యాంప్ మీట్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ “ఈ సినిమా ఫుల్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. నువ్వు ఎంత బాగా స్క్రిప్ట్‌లో రాస్తే అంత బాగా నటిస్తానని కిరణ్ అన్న ప్రోత్సహించేవారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కె ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. అది దృష్టిలో పెట్టుకునే కథ రాశాను, సినిమా రూపొందించాను. థియేటర్స్‌లో సినిమా చూస్తున్నప్పుడు కూడా కిరణ్ అబ్బవరం ర్యాంప్ అనే అనుకుంటారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ “కె ర్యాంప్ కథను నా దగ్గరకు కిరణ్ పంపించారు. కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
మా సంస్థలో మరో ఎంటర్‌టైనర్ అని ఫిక్స్ అయ్యా. జైన్స్ నానితో ఇండస్ట్రీకి మరో త్రివిక్రమ్, హరీశ్ శంకర్ దొరికినట్లే. డైలాగ్స్ అంత బాగా రాసుకున్నారు నాని. ఈ దీపావళికి పోటీ ఎంత ఉన్నా మా మూవీ సక్సెస్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాం”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ దీపావళికి థియేటర్స్‌కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను కె ర్యాంప్ ఎంటర్‌టైన్ చేస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. హీరోయిన్ యుక్తికి హీరోతో సమాన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఉంది. తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నేను చిల్లరగా ఉంటా. యుక్తి క్యారెక్టర్ పిచ్చిది. వీళ్లిద్దరు కలిస్తే ఎంత వినోదం వస్తుందో థియేటర్స్‌లో చూస్తారు. ఈ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యుక్తి తరేజా, నరేష్, రవి, బ్రహ్మ కడలి, చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకలను ఏ రోజున జరుపుకోవాలంటే?
వరంగల్: సద్దుల బతుకమ్మ వేడుకల విషయంలో గందరగోళం నెలకొంది. కొందరు పండితులు సోషల్ మీడియాలో బతుకమ్మ పండుగపై వివాదం సృష్టిస్తున్నారు. పండితుల భిన్న ప్రకటనలతో మహిళలు అయోమయంలో పడేస్తున్నారు. ఈ నెల 30న అష్టమిరోజు శాస్త్ర ప్రకారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ నెల 29న వేడుకలు జరపాలంటున్న మరికొందరు పండితులు చెబుతున్నారు. 9రోజులే ప్రామాణికం కావడంతో శాస్త్రం వర్తించదని వాదనలు వస్తున్నాయి. 30న సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
అలర్ట్- IIT GATE 2026 రిజిస్ట్రేషన్‌కి ఈరోజే చివరి తేదీ..
టివికె అధినేత విజయ్ కు భారీ భద్రత
చెన్నై: టివికె అధినేత, హీరో విజయ్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. విజయ్‌ను అరెస్ట్ చేయాలని డిఎంకే, ఎఐడిఎంకె, కాంగ్రెస్ నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ టివికె నేతల ఆరోపణలు చేస్తున్నారు. శనివారం తమిళనాడులో కరూర్‌లో నిర్వహించిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో గాయపడిన విషయం విధితమే. ఈ ఘటనపై విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యం గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలకు పోటెత్తిన భక్తులు – ఇవాళ సాయంత్రం గరుడ వాహన సేవ, 2 లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు….!
యువత నెత్తురులో ప్రవహించే ఉత్తేజం.. భగత్‌సింగ్
గాంధీజీ, నెహ్రూజీ దేశస్వాతంత్య్రం కోసం శాంతియుతంగా సహాయ నిరాకరణ ఉద్యమం నడిపినట్లుగానే, కొందరు విప్లవకారులు దేశ స్వాతంత్య్రం కోసం తమ చెమటను, రక్తాన్ని చిందించారు. చెప్పుకోదగ్గ అనేక మంది విప్లవకారులలో దేశ యువత మెదళ్ళలో నాటుకుపోయిన పేరు షాహిద్ భగత్ సింగ్. 23 సంవత్సరాలలోనే నా దేశానికి స్వాతంత్య్రం కావాలంటూ, అసమానతలు లేని సమాజస్థాపనే లక్ష్యంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉరి తీయబడ్డాడు. భారత ప్రజలకు భగత్ సింగ్ అనాగరిక ఆలోచనలు వీడి, శాస్త్రీయ దృక్పథంతో ఎలా పురోగమించాలో నేర్పాడు. భారత రాజకీయాల్లో నూతన ఆవిష్కృతం భగత్ సింగ్ లౌకికవాది. ప్రజలకు సమాజంలోని రుగ్మతలను తెలియజెప్పి, హేతుబద్ధతో ఆలోచించడం, సమానత్వంకై పోరాడే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాడు. దేశాన్ని, దేశప్రజలను ఎంతగానో ప్రేమించాడు. మనిషిని మనిషి దోచుకునే విధానం పోవాలని, దేశాన్ని, దేశం దోపిడీ చేసే విధానం ఉండకూడదని అన్నాడు. దీని కోసం భారతీయ యువత సంఘటితమై కొట్లాడాలన్నారు. భారత యువత ఉప్పొంగే నెత్తుటి నరాలలో ప్రవహించే ఉత్తేజం భగత్ సింగ్, భారతదేశ చరిత్రలో అతని పేరు చిరస్మరణీయం.
భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907, నాటి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న పంజాబ్ ప్రొవిజన్స్‌లో బంగా అనే గ్రామంలో జన్మించాడు. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములైన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతిల నుండి, ఆంగ్లో- సిక్కు ఉద్యమంలో పాల్గొన్న ముత్తాత సర్ధార్ ఫతే సింగ్ నుండి స్ఫూర్తి పొందాడు. తన గురువు గదర్ వీరుడు కర్తార్ సింగ్ షరభా నుండి రాజకీయ ప్రేరణ పొందాడు. డిఎవి పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అనంతరం నేషనల్ కళాశాలలో చేరాడు. భగత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చిన్న వయసులోనే చదవడం, రాయడంపట్ల ఎక్కువ మక్కువ, నాటికల్లో, పాఠశాలల్లో నిర్వహించే ఉపన్యాస పోటీల్లో బాగా రాణించేవాడు. సామ్యవాద భావజాలంపట్ల ఆకర్షితుడైనాడు. 1926 మార్చిలో నవజవాన్ సభ అనే యువ ఇండియన్ సోషలిస్టు సంస్థ స్థాపించాడు, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరి, విప్లవకారులైన చంద్రశేఖర్ ఆజాద్ రాంప్రసాద్ బిస్మిల్, మరికొందరితో కలిసి పనిచేసాడు. తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించినప్పుడు, దేశస్వాతంత్య్రమే తన లక్ష్యమని, అసమానతలు లేని సమసమాజ స్థాపన తన ధ్యేయమని, ఆయా లక్ష్యాల కోసం పనిచేసే క్రమంలో పెండ్లి ఆటంకంగా మారుతుందని తాను పెళ్లి చేసుకోబోనని తల్లిదండ్రులకు సూటిగా చెప్పాడు. అమృత్ సర్‌లో ఉర్దూ, పంజాబీ వార్తాపత్రికలకు సంపాదకుడుగా పని చేశాడు. నేనేందుకు నాస్తికుడనయ్యాను అనే అంశంపై వ్యాసాన్ని రాసాడు. తన సాహిత్యం, దేశ యువతను ఆకర్షింప చేస్తోందని, తన ఆలోచనలు దేశవ్యాప్త యువతను సంఘటితం చేస్తుందని గమనించిన బ్రిటిష్ పాలకులు 1927లో భగత్ సింగ్ అరెస్ట్ చేశారు.
1928లో సైమన్ కమిషన్ లాహోర్‌కు వచ్చినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. హాజరైన జన సందోహాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించారు. లాలాలజపతి రాయిపై క్రూరంగా దాడి చేశారు, పోలీసులు కొట్టిన తీవ్రమైన దెబ్బలతో నవంబర్ 17, 1928 న గుండెపోటుతో లాలాలజపతిరాయ్ మరణించారు. లాలాజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సుకుదేవ్ తాపర్, శివరాం రాజ్‌గురు స్కాట్‌ను చంపాలని నిర్ణయించుకుంటారు. అనుకోకుండా తమ ఎత్తుగడ విఫలమై స్కాట్‌కు బదులుగా, అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జెపి సాండర్స్‌ను చంపగా, ఈ ఘటనను శాంతియుత పంథాలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీతో సహా కొందరు జాతీయ నాయకులు ఖండించారు.అనేక వార్తాపత్రికలు దీనిని తప్పుబట్టాయి. కానీ దేశవ్యాప్తంగా యువత, పెద్ద ఎత్తున ప్రజానీకం భగత్ సింగ్ ధైర్యసాహసాలను చూసి బ్రిటీష్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. స్కాట్ దొరకకపోగా, తమ ఎత్తుగడ విఫలమై జెపి సాండర్స్ మరణించగా, అక్కడినుండి నలుగురు విప్లవకారులు సైకిళ్లపై తమ ఇండ్లకు చేరి, లాహోర్‌ని విడిచివెళ్లి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నాయకుల ఇండ్లల్లో తల దాచుకున్నారు. ఈ కాలంలోనే భగత్ సింగ్ తన తలపాగా తీసేసి, తల జుట్టు, గడ్డం కత్తిరించుకొని, ఓ టోపీ ధరించి బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువతను చైతన్యం చేశాడు. యువత కర్తవ్యాన్ని గుర్తు చేసాడు. లాహోర్ నేషనల్ కళాశాల భగత్ సింగ్ ప్రేరణగా నిలిచింది. కళాశాలలో సుఖదేవ్, భగవతీ చరణ్ వోహ్రా, యశ్ పాల్, జయదేవ్ గుప్తా, రామ్ క్రిషన్‌లు తోటి విద్యార్థులు. నేషనల్ కళాశాలకే మరొక పేరు తిలక్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ గా పిలిచే వారు. 1921 లో లాహోర్‌లో ప్రారంభించబడింది. భగత్ సింగ్ అధ్యాపకుల నుండి ప్రేరణ పొందాడు. కళాశాల ప్రిన్సిపల్ చాబిల్ దాస్ రచనల నుండి మరింత ప్రేరణ పొందాడు. చింగారియాన్, మేరీ ఇంక్విలాబ్ యాత్ర వంటి రచనల నుండి స్ఫూర్తిని పొందాడు. ఫ్రొఫెసర్ జై చంద్ర విద్యాలంకార్ రౌలత్ కమిటీ రిపోర్టును తరగతి గదిలో బోధించినప్పుడు విద్యార్థులు రక్తమరిగిపోయేది. భగత్ సింగ్‌ను ఓ గొప్ప దేశభక్తుడిగా తీర్చిదిద్దింది ఈ కళాశాల, భగత్ సింగ్ సామ్యవాద ఆలోచనలకు బీజంపడింది ఇక్కడే. అనంతరం రష్యాలో సోవియట్ విప్లవాన్ని అధ్యయనం చేశాడు. రష్యన్ సోవియట్ విప్లవ స్ఫూర్తితోనే స్వాతంత్య్రోద్యమంలో చేరాడు. అనేకమంది దేశభక్తులను ఈ కళాశాల అందించింది. విప్లవకారుల నర్సరీగా కళాశాలను పిలిచేవారు.
భగత్ సింగ్ నిరంతర అధ్యయనశీలి, విప్లవం కేవలం అధ్యయనం ద్వారా మాత్రమే పురోగమిస్తుందని నమ్మాడు. తన తోటి మిత్రులను అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం చైతన్యం చేసేవాడు. ఆనాటి విప్లవకారులలో, ఇతర రాజకీయ నాయకులలో కెల్లా భగత్ సింగ్ మంచి మేధావి. బాధల నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవాలంటే నిరంతరం అధ్యయనం చేయడమే పరిష్కారమని అన్నాడు. నిరంతరం తన చొక్కా జేబులోనే పుస్తకాలను ఉంచుకొని సమయం దొరికినప్పుడల్లా చదివేవాడు. అధ్యయనంపట్ల గల పట్టుదల పాఠశాల, కళాశాల, జైలు నుండి కుటుంబీకులకు, స్నేహితులకు రాసిన అందుబాటులో ఉన్న సుమారు 59 లేఖల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో నేటి యువత ఏమీ తెలియని కూడలిలో నిలబడి ఉంది. డ్రగ్స్, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్నది. యువతే దేశానికి ఆయువుపట్టు. నేటి యువతకు భగత్ సింగ్ జీవితమే ఒక ప్రేరణగా నిలుస్తుంది. దేశాభివృద్ధిలో యువకుల పాత్ర ఏమిటో మన యువత గుర్తెరగాలి. దేశం పురోగమించాలంటే యువత ఆలోచనలు, ఎత్తుగడలపైనే ఆధారపడి ఉంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే యువతే కీలకం. దేశభవిష్యత్తు యువత భుజస్కంధాలపై ఉంది. మనిషి ఎంతటి విపత్తులోనైనా తన ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని, త్యాగం లేకుండా ఏది సాధించలేమని, మనిషి జీవితంలో ఎప్పటికీ నిరంతర అధ్యయనశీలిగా ఉండాలని, మీ పట్ల మీరు ఎలా ఉన్నా, ఇతరుల పట్ల సున్నితంగా ఉండాలని భగత్ సింగ్ ఆకాంక్షించాడు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధి కృషి చేయాలి.
– బి వీరభద్రం, 9398535441
నేడు భగత్ సింగ్ జయంతి 188
నదీనదాలు.. ప్రజోపయోగ నిధులు
నదుల సంరక్షణపై పోరాడిన బ్రిటీష్ కొలంబియాకు చెందిన నదుల సంరక్షణ సంస్కర్త మార్క్ ఏంజిలో స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి ఏటా సెప్టెంబర్ 4వ ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుతున్నది. వందకు పైగా దేశాల్లో జరిగే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం నదులను కాలుష్యం నుండి కాపాడడం, వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయ మార్పులకు అడ్డుకట్టవేయడం. ఇప్పటికే దేశం లో నదీజలాల పంపిణీ విషయంలో అంతరాష్ట్ర వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అధిక వర్షాలతో అపారమైన జలసంపద కడలి పాలై నిరుపయోగంగా మారుతున్నది. నదుల కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. నదులు అంతర్ధానం కాకుండా, నదులను కాలుష్య రహితంగా మార్చి సాగునీటికి, తాగునీటికి లోటులేకుండా చేయాలి. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలు, మితిమీరిన నీటి వినియోగం, కాలుష్యం వలన భవిష్యత్తులో నదులు అంతరించే అవకాశముంది. వీటితోపాటు అడవులను నరికి వేయడం, వర్షాభావం, పర్యావరణాన్ని పట్టించుకోకుండా నిర్మించే ఆనకట్టల వల్ల నదులు నిర్జీవంగా మారే ప్రమాదం పొంచి ఉంది. గంగా నదీ కాలుష్య ప్రక్షాళన దాదాపుగా విఫలమైనది.
యమునా నది కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచ మానవాళికి నదులు చేస్తున్న మహోపకారం మరువలేనిది. అపారమైన జలసంపదతో తులతూగే నదులను పరిరక్షించుకోవడం మన కనీస బాధ్యత. గతం వర్తమానంగా, వర్తమానం భవిష్యత్తుగా పరివర్తన చెందడం సహజ ప్రక్రియ. ‘గతం గతః’ అని, ‘గతజలసేతు బంధనంబు..తగదు’ అంటూ గత విషయాలను వదిలేస్తే వర్తమానం దుర్భరంగా, భవిష్యత్తు అంధకార బంధురంగా మారక తప్పదు. గతం వర్తమాన, భవిష్య కాలాలను శాసించే శిలాశాసనం. ఇప్పటి వరకు మనం నదుల విషయంలో, నదీ జలాల విషయంలో శ్రద్ధ చూపలేకపోయాం. గతంలో జరిగిన తప్పిదాలు ఇక ముందు పునరావృతం కారాదు. నదుల్లో నీరు వృథాగా పోవడం రాబోయే సంక్షోభానికి సూచనగా ఎంతోమంది జలవనరుల నిపుణులు దశాబ్దాల నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయినా పట్టించుకోని పాప ఫలితమే ప్రజలపాలిట శాపమై కూర్చుంది. ఇకనైనా నదీజలాల సక్రమ వినియోగం, నదుల సంరక్షణపై తగిన శ్రద్ధ వహించకపోతే రాబోయే కాలమంతా ప్రజలు తీవ్ర నీటిఇబ్బందులకు గురికాక తప్పదు. నదుల్లో కాలుష్యం అరికట్టకపోతే జలచరాలన్నీ అంతరించిపోగలవు. మానవవిజ్ఞానం ఎంత పెరిగినా, మనిషి హృదయం తరిగిపోయి, అత్యాశ పెరిగిపోయి తన పతనానికి తానే బాటలు వేసుకుంటున్నాడు. పచ్చదనం నశించింది, పర్యావరణం చెడింది. భూతాపం పెరిగింది. కాలుష్యం కట్టలు తెంచుకుని, వరద గోదారిలా జనజీవనాన్ని ముంచెత్తుతున్నది. నదులన్నీ తరిగిపోతున్నాయి. నదుల్లో కాలుష్యం తారస్థాయికి చేరింది. ఇంతటి విపత్తును మునుపెన్నడూ కనలేదు. మానవ మనుగడకు ఆధారమైన నదులను పరిరక్షించకపోతే భవిష్య పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి.
నదులు ప్రకృతి ప్రసాదించిన వరం. నదులే నాగరికతకు చిహ్నాలు. నదీ తీరప్రాంతాల్లోనే జనజీవనం అధికం. ప్రపంచంలో ఎన్నో నదులున్నాయి. నైలు నది, మిసిసిపి, హోయాంగ్ హో, అమెజాన్, కాంగో వంటి నదులు ప్రపంచంలో పేరొందిన నదులు. ఈజిప్టును నైలునదీ వరప్రసాదం అంటారు. ఈ నది ప్రక్కనే అనేక చారిత్రక కట్టడాలు వెలిసాయి. నదులు శక్తి వనరులు. సింధు నాగరికత, హరప్పా మెహంజదారో నాగరికత గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. నదీసంపద నిలకడగా ఉంటే ఏ దేశ అభివృద్ధి అయినా స్థిరంగా ఉంటుంది. అలాంటి నదీజలసంపద కడలిపాలవుతున్నది. భారత దేశంలో నదులకు కొరతలేదు. జీవనదులు, వర్షాధార నదులతో భారత ఉపఖండం ప్రకృతి మాత ఒడిలో పూదండ లా రాణిస్తున్నది. భారత దేశంలో ఎన్నో నదులు, ఉపనదులున్నాయి. నదీ వ్యవస్థకు భారతదేశం పుట్టినిల్లు. అందుకే భారత్ ను ‘లాండ్ ఆఫ్ రివర్స్’ గా పిలుస్తారు. నదీ తీరంలో అరణ్యాలు, జంతుసంపద ఏర్పడుతున్నాయి. తాగునీటికి, రవాణాకు, మత్స్య సంపదకు నదులే సోపానాలు. జలవిద్యుత్, సాగునీటికి నదులే ఆధారాలు. నదుల వలన కలిగే ప్రయోజనాలు అపారం.
నదులు ప్రకృతి సంపదలో ఒకభాగం. ఎక్కడైతే నదులు, నీటి ప్రవాహాలు ఉంటాయో, అక్కడే మానవ ఆర్ధిక వికాసం వెల్లివిరుస్తుంది. నదులు, నీటి వనరులు లేక పోతే మానవ జీవనం దుర్భరం. అలాంటి నదులను కాలుష్యంతో నింపేస్తున్నాం. నదీ పరీవాహక ప్రాంతాల్లో వెలసిన గ్రామాలు, నగరాల వలన కాలుష్య సమస్య తలెత్తింది. వినియోగించిన నీటిని నదుల్లోకి శుద్ధి చేయకుండా వదిలేయడం, వాడి పారేసిన ప్లాస్టిక్ వంటి వ్యర్ధ పదార్ధాలను నదుల్లో వదలడం ఘోరం. దీనివలన నదీజలాలు కలుషితమైపోతున్నాయి. నదులనుండి సముద్రాల్లో కలిసే నీటి వలన సముద్ర జలాలు కలుషితం కావడం, సముద్ర జీవరాశులు చనిపోవడం, పర్యావరణ విధ్వంసం జరగడం భావ్యం కాదు.
ఇలాంటి పరిస్థితులను నిలువరించి, నదులను పరిరక్షించాలనే ధ్యేయంతోనే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నదుల సంరక్షణపై అనేక కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ప్రజల్లో నదులపట్ల, నీటిపట్ల చక్కని అవగాహన కోసం జరిగే ఒక ముఖ్యమైన సందర్భమే ప్రపంచ నదుల దినోత్సవం. నదులను పరిరక్షించి ప్రపంచ మానవాళి మనుగడను కాపాడాలన్న ధ్యేయంతో జరిగే ప్రపంచ నదుల దినోత్సవం రాబోయే ఉపద్రవానికి అడ్డుకట్ట వేయాలి. నదుల పరిరక్షణ విషయంలో అశ్రద్ధను వీడి బృహత్తర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలి. ఏదిఏమైనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ నదుల సంరక్షణ విషయంలో సమష్టి బాధ్యత వహించాలి.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463
(నేడు ప్రపంచ నదుల దినోత్సవం)