International
గట్టి పోటీ ఇస్తున్న వెస్టిండీస్.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారత్ వెస్టిండీస్ మధ్య రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఆరంభంలో వేగంగా రెండు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత క్యాంప్‌బెల్ (115), హోప్ (103)లు జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇద్దరు సెంచరీలు సాధించారు. కానీ, ఈ ఇద్దరు ఔట్ అయిన తర్వాత కెప్టెన్ చేజ్ (40) మినహా మిగితా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. అయితే వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి ఏకపక్షంగా మారిన మ్యాచ్‌ను జెస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్‌ల జోడీ మలుపు తిప్పింది. చివరి వికెట్‌కు వీరిద్దరు కలిసి 50 పరుగులు జోడించారు. టీ-బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇలాంటి దివాలాకోరు సిఎంను.. నేను ఎక్కడా చూడలేదు: కెటిఆర్
హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ తరపున ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానంటూ అజారుద్దీన్ ను పక్కకు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దివాలాకోరు సిఎం నేను ఎక్కడా చూడలేదని, తనను దొంగలా చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్ కు తగలాలని కెటిఆర్ పేర్కొన్నారు. కారు కావాలా? బల్డోజర్ కావాలా? జూబ్లీహిల్స్ ఓటరు తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారని విమర్శించారు. దొంగఓట్లనూ ఎదుర్కోవడంపై పార్టీపరంగా దృష్టి సారించామని తెలియజేశారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ అవుతుందని, బిఆర్ఎస్ నేతలు దగ్గరుండి అందరూ ఓట్లేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ సూచించారు.
బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం
అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాలంపల్లి గ్రామానికి చెందిన రైతుల బాలాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అతడిని స్థానిక పిఎస్ కు తరలించారు. బాలాంపల్లి గ్రామంలోని తన భూమిని ఎపిఐఐసి తీసుకుంటోందని రైతు ఆరోపణలు చేశారు. బాలకృష్ణ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసిన రైతును పోలీసులు మీడియాకు చూపలేదు.
అదిరిపోయే పర్ఫార్మెన్స్.. సూర్యవంశీకి ప్రమోషన్
చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో కాంట్రాక్ట్ సంపాదించుకొని.. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టులో చోటు సాధించి.. పలు సిరీస్‌లలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో వైభవ్‌కి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది.
రంజీ ట్రోఫీ 2025-26లో తలపడే బిహార్ జట్టుకి వైభవ్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సోమవారం ఈ దేశవాళీ టోర్నీలో తలపడే 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిఎ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా సకిబుల్ గని ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. బిహార్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది. బిహార్ జట్టులో పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్‌కు జట్టును ఎంపిక చేయడానికి రాష్ట్రంలో తగినంత మంది సెలెక్టర్లు లేరని తెలుస్తోంది. అందుకే జట్టు ప్రకటన ఆలస్యమైందని సమాచారం.
ఒంగోలులో బోల్తాపడిన బస్సు: విద్యుత్ ఉద్యోగి మృతి… 16 మందికి గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఎస్ కాలేజీ సమీపంలో మినీ బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు పత్తికొండకు చెందిన జూనియర్ లైన్‌మెన్ చరణ్ గా గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా చేయడానికి పలమనేరు నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు!
LG Electronics IPO లిస్టింగ్ ఎప్పుడు? పెట్టుబడిదారులకు భారీ లాభాలు పక్కా!
టిడిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన వీడియో వైరల్?
అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పై డ్రైవర్ రాయుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశారని రాయుడు వీడియో వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో ఇప్పటికే కోటి వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంఛార్జీ కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మరణానంతరం సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. వినుత దంపతుల ఆరోపణలకు బలం చేకూర్చేలా రాయుడు సెల్ఫీ వీడియో లభించింది. బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుజిత్ రాయుడికి శ్రీకాళహస్తి జనసేన నాయకుడు పేటచంద్ర పరిచయం చేశాడు. వినుత దంపతులకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేయడానికి రూ.30 లక్షలకు రాయుడు ఒప్పందం కుదిర్చుకున్నాడు. ముందుగా రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని, ఒప్పందం ప్రకారం వినుత, ఆమె భర్త చంద్రబాబు కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు బొజ్జల అనుచరుడు సుజిత్‌కు రాయుడు సమాచారం చేరవేసేవాడు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు రావాల్సిన డబ్బులను పేట చంద్రను రాయుడు అడిగాడు. దీంతో పేట చంద్ర వెళ్లి సుజిత్‌ను అడగగా, రూ.20 లక్షలు సర్దుబాటు చేశానని, ఆ మొత్తాన్ని పేటచంద్ర వద్దే ఉంచుకొని, అవసరమైనప్పుడు రాయుడుకు ఇచ్చేవాడు. అయితే ఒకరోజు సుజిత్, చంద్రతో కలిసి డ్రైవర్ మద్యం సేవిస్తుండగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చాడు. రాయుడు చెల్లి, అవ్వ తదితర కుటుంబ వివరాలన్నీ ఎమ్మెల్యే చెప్పడంతో పాటు ఇవన్నీ ఎలా తెలుసని ప్రశ్నించగా, ఎమ్మెల్యే అన్నాక ఆ మాత్రం తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మాట్లాడారు. వినుతకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను రికార్డ్ చేసి ఇవ్వాలని, అలాగే తనను తిట్టిన రికార్డ్ చేసి ఇస్తే, మిగిలిన మొత్తాన్ని ఇస్తానని ఎమ్మెల్యే రాయుడుకు హామీ ఇచ్చారు.
కానీ వీడియోలు రికార్డ్ చేయడం కష్టమని, ఇదే విషయాన్ని సుజిత్‌కు రాయుడు తెలియజేశాడు. ఇదే సందర్భంలో జనసేన నాయకుడు కొట్టే సాయి నుంచి ఫోన్ కాల్ వచ్చినా తాను రిసీవ్ చేసుకోలేదని, దీంతో చంద్ర, సుజిత్ చెప్పినట్టు వీడియోలు తీసి ఇవ్వాలని కొట్టే సాయి రాయుడికి మెసేజ్ పెట్టాడు. తనకు సందేశాలు పెట్టొద్దని, ఏదైనా వుంటే చంద్రాకు చెప్పాలని రాయుడు సూచించాడు. తాను సిమ్ మార్చడంతో బిజెపికి చెందిన విజయ్ తో కలిసి సుజిత్ తన ఊరికి వచ్చాడని, ఆ తర్వాత వినుత పర్సనల్ వీడియోలు రికార్డ్ చేస్తుండగా తాను దొరికిపోయానని వెల్లడించారు. తాను దొరికిన విషయాన్ని సుజిత్, చంద్ర శేఖర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. వినుత అభ్యంతరకర వీడియోలు తీస్తే రూ.30 లక్షలు కాదు, అంతకు మించి ఇప్పిస్తానని చంద్రశేఖర్ తెలిపాడు. రాయుడు పేరు బయటకు రాకుండా చూసుకుంటానని చంద్రశేఖర్ తెలిపినట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోలు ఫేక్ అని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎఐతో చేసిన వీడియోలను ఇప్పుడు బయటకు వదిలారని టిడిపి కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.