అమెరికా నుంచి వెలువడే ‘పొలిటికో’ అనే రాజకీయ పత్రికలో వెలువడే కథనాలకు ప్రపంచమంతటా మంచి విలువే ఉంది. అవి ఒకోసారి సంచలనాత్మకంగా తోచవచ్చు. కాని వాటిలో చివరకు అసత్యాలుగా తేలేవి చాలా తక్కువ. పైగా ‘స్కూప్ స్టోరీస్’ అని ఇంగ్లీషులో వ్యవహరించే, ‘మరెవరికీ తెలియని, రాయని కథనాలను’ వెలికి తీయటం తమ పని అని ఆ పత్రిక సగర్వంగా ప్రకటిస్తుంటుంది. అటువంటి పేరున్నది గనుకనే ‘పొలిటికో’కు అనేక అవార్డులతో పాటు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతి కూడా లభించింది. ఈ కారణాల వల్లనే ఆ పత్రిక ఇటీవల ప్రచురించిన ‘కోర్5’ రాజకీయ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అందులోని సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా తన నాయకత్వాన కొన్ని దశాబ్దాలుగా ఉన్న నాటో, జి7, జి20 వగైరా కూటములు అన్నింటిని వదలివేసి, కొత్తగా జి 5 అనదగ్గ ‘కోర్5’ కూటమి ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నది. ఈ కొత్త కూటమిలో అమెరికాతో పాటు రష్యా, చైనా, జపాన్, ఇండియాలు ఉండవచ్చునట. ఈ కథనాన్ని అమెరికా అధ్యక్షుని వైట్ హౌస్ నిజం కాదంటూ కొట్టి వేసింది. అయినప్పటికీ, “అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే” అన్న పాట వలె, ట్రంప్ మాటలకు అర్థాలు ఏవైనా కావచ్చునని అనుభవంలోకి వచ్చినందున, ఈ విషయమై చర్యలు జరుగుతూ ఉన్నాయి. అదట్లుంచినా మరొకటి గమనించాలి.
ఎప్పుడైనా సరే ఇటువంటి ముఖ్యమైన ఆలోచనలు జరిగినపుడు, వాటికి ఒక స్వరూపం, తర్వాత పరస్పర అంగీకారం స్థూలంగానైనా వచ్చే వరకు విషయం తెర వెనుకనే ఉంటుంది. ఇది ఎక్కడైనా సర్వసాధారణం. ఇట్లా అంటున్నామంటే ‘కోర్5’ ఆలోచన నిజమైనదే అని చెప్పటం కాదు. కావచ్చు, కాకపోవచ్చు కూడా. అదెట్లున్నా దీని గురించి, తాత్కాలికంగానైనా కొంత సమాలోచన అవసరం. ఒకవేళ ట్రంప్ ఆలోచన నిజమే అయితే తను ఈ ఆలోచన ఎందుకు చేస్తుండవచ్చు? అటువంటి కూటమి ఏర్పాటు సాధ్యమా? సాధ్యమైతే ఆ కూటమి వ్యవహరణ ఏ విధంగా ఉండవచ్చు? అనేవి మూడు ప్రధానమైన ప్రశ్నలు. ఈ ఆలోచనలు చేసే ముందు ఒక మాట చెప్పుకోవాటి. ‘కోర్5’ ఆలోచన నిజం కాదని వైట్ హౌస్ ఖండించగా, తక్కిన నాలుగు దేశాల నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు. అందులో ఆశ్చర్యమూ లేదు. ఏ దేశమైనా, ముఖ్యంగా ఇటువంటి సీరియస్ విషయాలలో, కేవలం పత్రికా కథనాలపై స్పందించదు. అవి తమపై ఆరోపణల వంటివి అయితే తప్ప. ఒకవేళ అమెరికా ఇటువంటి ప్రతిపాదన అధికారికంగా చేసినట్లయితే అపుడు ఏదో స్పందన ఉండవచ్చు. ‘కోర్5’ ఆలోచన లేదని వైట్ హౌస్ అంటున్నందున, ఆ ప్రతిపాదన ఇంత వరకు ఎవరికీ చేయలేదని భావించవలసి ఉంటుంది. మొత్తం అయిదు దేశాలూ రహస్యాన్ని పాటించదలిస్తే తప్ప.
అయితే, ఎటు నుంచి ఏ ధ్రువీకరణ లేకున్నా, ఇటువంటి కూటమితో భారత దేశానికి లాభమేమిటనే ఊహాగానాలు మాత్రం దేశంలో మొదలైపోయాయి. దాని గురించి ఇక్కడ మాట్లాడేది ఏమీ లేదు. ఇవన్నీ వదలివేసి, పైన పేర్కొన్న మూడు ప్రశ్నల గురించి ఆలోచిద్దాము. కోర్5 ఆలోచన నిజమే అనుకుంటే, అమెరికా అధ్యక్షునికి ఆ తరహా ఆలోచన ఎందుకు కలిగి ఉండవచ్చునన్నది మొదటి ప్రశ్న. అమెరికా 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 80 సంవత్సరాలుగా అగ్రరాజ్యంగా ఉంటూ వస్తున్నది. 1991 వరకు అప్పటి సోవియెట్ నాయకత్వాన అమెరికాకు పోటీగా రెండవ ధ్రువం ఉండినప్పటికీ అగ్రరాజ్యం మాత్రం అమెరికాయే. అణ్వస్త్ర బలిమిని మినహాయిస్తే ఇతరత్రా సైనికంగా, ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికాభివృద్ధిపరంగా పరిస్థితి అదే. 1991లో సోవియేట్ పతనం తర్వాత ఇక చెప్పనక్కర లేదు. అట్లా సుమారు 20 సంవత్సరాల పాటు ఎదురులేని ఏకధ్రువ ప్రపంచాధిపత్యం తర్వాత రష్యా తిరిగి పుంజకోవటం, చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించటం, బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు బలపడుతుండటం వల్ల అమెరికా బలిమి గతం కన్న బలహీన పడుతుండటం నిజమే అయినా, అమెరికా అగ్రస్థానం మాత్రం స్థూలంగా కొనసాగుతూనే ఉన్నది.
వారు యథేచ్ఛగా తమకు అవసరమైన చోటనల్లా సైనిక చర్యలకు పాల్పడుతుండటం, ప్రపంచ వాణిజ్యాన్ని ఒకప్పటి స్థాయిలో కాకున్న ఇంకా చాలా మేరకు నియంత్రించ గలగటం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఐక్యరాజ్య సమితి నుంచి మొదలుకొన్ని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ మొదలైన ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం వంటివి ఇందుకు తార్కాణాలు. అదే సమయంలో తక్షణ స్థితిగతులు, సమీప భవిష్యత్తుకు పరిమితం కాక మధ్యకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి తెలివైన నాయకత్వం ఆలోచించవలసి ఉంటుంది గనుక, ఆ విధంగా చూసినపుడు మాత్రం తమ అగ్రనాయకత్వం దీర్ఘకాలం పాటు కొనసాగగలదనే భరోసా అమెరికా నాయకత్వానికి కలిగే అవకాశం లేదు. అటువంటపుడు తమ వ్యూహాలపై పునరాలోచన తప్పనిసరి అవుతుంది. దాని ఫలితమే ‘కోర్5’ ఆలోచన అయి ఉండాలి. ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఇంతకాలం కలసి వచ్చిన స్వీయ ఆధారాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆ క్రమాన్ని నిలువరించగల అవకాశాలు కన్పించటం లేదు. మరొక వైపు, ఇంతకాలం వెంట నిలిచిన యూరప్, ఇతర నాటో రాజ్యాలు కూడా నెమ్మదిగానైనా బలహీనపడుతున్నాయి.
చిరకాలంగా తమకు లోబడి ఉండిన అనేకానేక ఇతర దేశాలు స్వతంత్ర మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొత్తగా తమ ఛత్రచ్ఛాయలోకి రాగోరేవారు కన్పించటం లేదు. బలప్రయోగంతోనో, ఆర్థికపరమైన వత్తిళ్లతోనే ఆ పని చేయబోతున్నా పరిస్థితి ఒక పరిమితిలో తప్ప ఆశాజనకంగా లేదు. అటువంటి స్థితిలో, కోర్5’ వంటి కొత్త తరహా వ్యూహ రచన అవసరమవుతుంది. అది ముసాయిదా వ్యూహం మాత్రమే. నిజంగా రూపు తీసుకునేదీ లేనిదీ తెలియదు. కోరుకున్న ఫలితం సాధించేదీ లేనిదీ తెలియదు. ప్రయత్నమైతే జరగాలి. అంతకన్న మార్గాంతరం లేదు. రెండవ ప్రశ్నకు వస్తే, ‘కోర్5’ ఏర్పాటు సాధ్యమా? ఇది అసలు సిసలైన సవాలు. అది సాధ్యం కానిదన్నదే వెంటనే కలిగే అభిప్రాయం. ఎందువల్లనంటే అందులో అనేక ప్రశ్నలున్నాయి. అన్నీ చిక్కులమారివే. అసలు అటువంటి కూటమిలో చేరేందుకు జపాన్, ఇండియాల మాట ఎట్లున్నా రష్యా, చైనాలు ఎందుకు అంగీకరించాలి? వారిద్దరికీ అమెరికా సైద్ధాంతిక శత్రువు. అనేక దశాబ్దాలుగా ప్రత్యర్థి. రాగల కాలంలోనూ సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా, వ్యూహాత్మకంగా శాశ్వత ప్రత్యర్థివంటిది.
అమెరికా ఆధిపత్యాన్ని క్రమంగా బలహీనపరచి, దానితో సమాన స్థాయి సాధించి, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, డీడాలరైజేషన్, బెల్డ్ అండ్ రోడ్ పాలసీ వగైరాల ద్వారా బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణ ఆ రెండింటి దీర్ఘకాలిక లక్షం. ఆ విధంగా అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్యవాదం, ప్రపంచాధిపత్యం ముగిసిపోవాలన్నది వారి పట్టుదల. ఇవన్నీ సానుకూలమవుతున్న సూచనలు కూడా ఉన్నప్పుడు, ‘కోర్5’ పేరిట అమెరికా కూటమిలో చేరవలసిన అవసరం వాటికి ఏమున్నది? అందుకు పొడిగింపుగా ఇతర సమస్యలున్నాయి. అమెరికా తన ఇండో పసిఫిక్ ఆధిపత్య వ్యూహంతో చైనా, రష్యాలకు సమస్యలు సృష్టిస్తున్నది. ఆ ప్రాంతపు మిత్రదేశాలలో సైనిక స్థావరాలను నిర్వహిస్తున్నది. తైవాన్ సమస్యను అనువుగా చేసుకుని చైనాను, హోక్కైరో దీవుల సమస్యతో రష్యాను ఇబ్బందిపెడుతున్నది. అందుకు జపాన్‌ను ఉపయోగించుకుంటున్నది.
ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మరొక వైపు చైనాతో పాటు ఇండియాతో టారిఫ్‌లు, వాణిజ్య ఒప్పంద యుద్ధాలు, రష్యాకు సంబంధించి ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలు అనేకం కనిపిస్తున్నావే. అటువంటపుడు, పరస్పర సాధారణ సంబంధాలు వేరు. కాని ఇండియా చైనా, జపాన్‌చైనా, జపాన్ రష్యా ఒక కూటమిగా పని చేయగలగటం అసాధ్యం. ఆయా సమస్యలు పరిష్కారం కూడా సమీప భవిష్యతులో కనిపించదు. చివరి ప్రశ్న ‘కోర్5’ వ్యవహరణ. అసలు ఆ కూటమి లక్షాలు ఏమిటి? రాజకీయంగా ఏం చేస్తుంది? ఆ కూటమి వల్ల ఆయా దేశాలకు గాని, ప్రపంచానికి గాని ఉపయోగం ఏమిటి? కూటమికి ముఖ్యంగా యూరపియన్ యూనియన్ లోబడి ఉంటుందా? అన్నింటికిమించి ఈ కొత్త రూపంలో తన అగ్రస్థానాన్ని నిలుపుకొనేందుకు, సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడుకునేందు అమెరికా చేయగల ప్రయత్నాలను మిగిలిన వారు అంగీకరిస్తారా? అందువల్ల, ఆచరణాత్మకంగా చూసినపుడు, ‘కోర్5’ ఆలోచన ఒక భ్రమగానే కనిపిస్తుంది.
– టంకశాల అశోక్ ( దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)