వచ్చే ఎన్నికల్లో బీహార్ గాలి వీస్తుందా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయంతో బిజెపి ఆనందానికి అవధుల్లేవు. ఈ విజయవీర గర్వంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రభంజనం వీస్తుందని ఇప్పటి నుంచే కలలు కంటోంది. బీహార్‌లో కులాల బలం ఒక కథగా మిగిలిపోయి, చివరకు మహిళా ఓటర్లే కీలకమయ్యారు. ఈ అనుభవంతో ప్రధాని మోడీ రైతు వర్గాలను ఆకర్షించడానికి బుధవారం (19.11.25 ) దేశంలోనే అత్యంత నగరీకరణ కలిగిన తమిళనాడు లోని రైతులను పాన్ ఇండియాకు చేరువ చేశారు. వాస్తవానికి తమిళనాడు ఆదాయంలో వ్యవసాయం నుంచి వచ్చేది కేవలం 13 శాతం మాత్రమే. అయినా సరే తమిళనాడు లోని కోయంబత్తూరులో బుధవారం జరిగిన సభలో హాజరైన ప్రజానీకం తమ తువ్వాళ్లను గాలిలో ఎగురవేస్తూ మోడీకి స్వాగతం పలకడంపై పులకించిపోయి తాను రాకముందే ఇక్కడ బీహార్ గాలి వీచినట్టు కనిపిస్తోందని వాక్చాతుర్యం ప్రదర్శించారు.
కోయంబత్తూరునుంచే దేశం లోని రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 21వ విడత ఆర్థికసాయంగా రూ. 18 వేల కోట్లను విడుదల చేయడం గమనార్హం. కోయంబత్తూరు అసెంబ్లీ స్థానం బిజెపిదే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి తన ప్రత్యర్థి కమల్‌హాసన్‌ను చాలా స్వల్ప మెజార్టీతో ఓడించారు. 234 అసెంబ్లీ స్థానాలు కలిగిన తమిళనాడు నుంచి 2.6 శాతం ఓట్లతో నలుగురు బిజెపి ఎంఎల్‌ఎలు గెలిచారు. 2001లో కూడా కరుణానిధి నేతృత్వంలో డిఎంకెతో పొత్తు కుదుర్చుకుని బిజెపి నాలుగు స్థానాలనే దక్కించుకోగలిగింది. కానీ 2006లో పోటీ చేసిన మొత్తం 225 మంది బిజెపి అభ్యర్థుల్లో 221 మంది డిపాజిట్లు కూడా దక్కించుకోలేక కుప్పకూలింది. 2001 నుంచి బిజెపి ఓట్ల వాటా 2 శాతం నుంచి 3 శాతం మించి కొనసాగడం లేదు. గత ఐదు ఎన్నికల నుంచి బిజెపి, డిఎంకె రాజకీయంగా, సిద్ధాంతపరంగా, ఉత్తరదక్షిణ ధ్రువాలుగా ఉంటూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
తమిళనాడులో వ్యవసాయానికి చేనేత రంగం ఊతంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల మాదిరిగానే వాతావరణ మార్పులు వ్యవసాయ, చేనేత రంగాలను ఘోరంగా దెబ్బతీశాయి. ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు ముందు వ్యవసాయ రంగాన్ని కేంద్రం ఆదుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అభ్యర్థించారు. బాగా పండిన వరి ప్రొక్యూర్‌మెంట్ ఎక్కువ చేయాలని, తేమ శాతం మినహాయింపు పరిధిని పెంచాలని, ధాన్యం మిల్లింగ్‌కు భారీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మామిడి గుజ్జుపై జిఎస్‌టి భారం 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. ఈ సమస్యలు రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చెప్పలేం. కుల ప్రభావం ఎలా ఉన్నా సనాతన ధర్మంపై బిజెపికి, డిఎంకెకు మధ్య గట్టి పోరు ఉంటుంది. ఇదిలా ఉండగా కోయంబత్తూరు, మధురలకు మెట్రోరైలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని కొన్నేళ్లుగా తమిళనాడు ప్రభుత్వం కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సంఘర్షణకు దారి తీస్తోంది.
తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్‌లో కూడా ఆరునెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపికి మధ్య కులాలు, మత విశ్వాసాలు ఢీకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఓట్ల బ్యాంకు కోసం కొత్త లక్షాలు పుట్టుకొస్తున్నాయి. ముఫ్పైయేళ్ల వామపక్ష పార్టీకి, టిఎంసికి కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. మమతాబెనర్జీ ప్రభుత్వంలో అనేక పొరపాట్లు చోటుచేసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు కుంగిపోతున్నారు. ఉపకులాలు, గూర్ఖాలకు ప్రత్యేక గుర్తింపు, మతం, భాష తదితర అంశాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ముస్లిం బెంగాలీలు అంతా చొరబాటుదారులే అన్న కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా బెంగాల్‌లో బిజెపి అత్యద్భుతంగా పురోగమిస్తోంది. 2016లో 10% ఓట్లతో మూడు సీట్లను తెచ్చుకున్న బిజెపి, 2021 నాటికి 30 శాతం ఓట్లతో 77 సీట్లను సాధించగలిగింది. బెంగాల్‌లో అనేక కారణాల వల్ల శాంతిభద్రతలు సమస్యలను సృష్టిస్తున్నాయి. వైద్య విద్యార్థులపై అత్యాచారాలు, కొన్ని వర్గాల గూండాయిజం స్థానిక ప్రజలను వేధిస్తోంది.
ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతున్నాయి. దీన్ని నివారించడానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఘర్షణలతో వ్యవస్థీకృత నేరాలుగా మారిన రాజకీయ హింస, వీటన్నిటితో అస్థిరత నెలకొన్న బెంగాల్‌ను తమకు అనుకూలంగా మలచుకుని లాభపడాలని బిజెపి చూస్తోంది. పార్టీ కార్యకర్తల స్వైరవిహారంతో కొన్ని ఘర్షణలు తలెత్తుతుండడంతో కేంద్రం, రాష్ట్రం పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయిలో వీటిని నివారించడం, ప్రజలకు భద్రత కల్పించే బాధ్యత తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యమే అయినా సరిగ్గా నెరవేరడం లేదు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు రెండూ కేంద్ర బిజెపిని వ్యతిరేకించేవే. ఈ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సారూప్యాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమిళనాడు స్థిరపడిన రాష్ట్రం. దాంతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌లో పేదరికం ఎక్కువ.పైగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాల ప్రస్తుత ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే భాషావాదం, మహిళా సంక్షేమంలో ఒకే భావాలు కలిగి ఉంటున్నాయి. తమిళనాడులో మహిళల అక్షరాస్యత 73 శాతం ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 71% వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ యంత్రాంగం భయంకర వ్యవస్థగా తయారవ్వడం బిజెపికి ఒక సవాలుగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఎత్తిచూపడానికి కమలనాథలు అన్వేషించే పనిలో పడ్డారు.