హైదరాబాద్: కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే.. దేశాభివృద్ధి మరింత వేగం అవుతుందని, కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని, హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నామని, తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని అన్నారు.
జిడిపి లో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్ నగరాలు కీలకంగా ఉన్నాయని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకుంటే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని, హైదరాబాద్ మెట్రోరైలు, ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సహకరిస్తే.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, మోడీ గుజరాత్ మోడల్ రూపొందించుకున్నట్లే తాము తెలంగాణ మోడల్ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే తాము మూసి పునరుజ్జీవనం చేపట్టామని, ప్రధాని మోడీ..గుజరాత్ కు ఇచ్చిన సహకారాన్నే తాము తెలంగాణకు కోరుతున్నామని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.