హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్ లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఏదైనా చేయాలని గతంలో ఏ నేత అనుకోలేదని తెలియజేశారు. అందుకే ఈ సారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని, స్వాంతత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సిఎం అయ్యారని అన్నారు. తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సిఎం కాలేదని, ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ రాష్ట్ర సిఎంగా మీ ముందు నిలబడ్డారని రేవంత్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరువు, వలసలకు మాత్రమే పేరుగాంచిందని, పాలమూరు నుంచి ఎంపిగా చేసిన మాజీ సిఎం కూడా ఈ జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు.
పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఈ సారి పాలమూరు బిడ్డను గెలిపించి అధికారం కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ఈ సారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణ పేట- కొండగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని, నారాయణ పేట- కొండగల్ ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామని, పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా.. ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని ఆవేదన వక్తం చేశారు. మాయగాళ్ల మాటలు విని.. ప్రాజెక్టులు, అభివృద్ది పనులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే.. మక్తల్- నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నారాయణ పేట జిల్లా మక్తల్ సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్- నారాయణ పేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, మక్తల్ లో క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులకు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరిమక్తల్ లో పలు అభివృద్ధి సిఎం మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. జూరాల దిగువన రూ. 121.92 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి, అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. అనంతరం సభలో సిఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.