క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటాం: బి. శివధర్ రెడ్డి
హైదరాబాద్: లక్డీకపూల్ లోని డిజిపి కార్యాలయంలో కొత్త డిజిపిగా బి. శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డిజిపి కార్యాలయంలోని ఛాంబర్లో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 1994 బ్యాచ్ కు ఐపిఎస్ అధికారి బి. శివధర్ రెడ్డి చెందారు. ఈ సందరర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని, క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామని తెలిపారు.
పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్ నేత ఇటీవల లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని నక్సల్ ను కోరుతున్నామని అన్నారు. లొంగిపోయిన నక్సల్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని, సమాజాభివృద్ధిలో భాగం కావాలని నక్సల్ ను కోరుతున్నామని డిజిపి పేర్కొన్నారు. పిఎస్ ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, పోలీసుశాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు తప్పవని డిజిపి శివధర్ రెడ్డి హెచ్చరించారు.