హైదరాబాద్: శాంతిభద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమన మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చూరగొంటున్నాం అని తెలియజేశారు. పోలీసులు అనేక విపత్తు ల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని కొనియాడారు. పోలీసు అంటే సమాజానికి నమ్మకం అని భరోసా అని, మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని అన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 1959 అక్టోబర్ 21 న భారత్, చైనా సరిహద్దుల్లో 10 మంది జావాన్లు వీరమరణం పొందారని, అప్పట్నుంచి ఏటా ఈ రోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని, అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇటీవల చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయిస్తున్నామని అన్నారు. పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశంసించారు. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్ పేరుతో బృందం నియమించామని, సైబర్, డిజిటల్, మార్ఫింగ్, డ్రగ్స్ లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ముందుందని, ఇటీవల అనేకమంది మావోయిస్టులు పోలీసులుకు లొంగిపోయారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలవాలని మిగతా మావోయిస్టులను కోరుతున్నానని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అనేక విభాగాలకు మహిళా ఐపిఎస్ లు సారథ్యం వహిస్తున్నారని, పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిదని అన్నారు. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పనిచేయాలని కోరారు. తమ ప్రభుత్వం 16 వేల మంది కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.