కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ
క్రిప్టో ద్వారా రవి బ్యాంక్ ఖాతాలకు నెలకు రూ.15లక్షలు ట్రాన్స్‌ఫర్
ప్రహ్లాద్ పేరుతో పాస్‌పోర్ట్, విదేశాలకు పారిపోవాలని ప్లాన్
బెట్టింగ్ డబ్బులతో హైదరాబాద్, విశాఖ, కరేబియన్ దీవుల్లో ఆస్తుల కొనుగోలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో ఇడి రంగంలోకి దిగింది. ఐ బొమ్మ పేరుతో వెబ్‌సైట్ నిర్వహించిన రవి పలు బెట్టింగ్ యాప్‌ల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. క్రిప్టో వాలెట్ నుంచి రవికి చెందిన ఐసిఐసిఐ ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్ ఖాతాకు నెలకు రూ.15లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రవికి సంబంధించిన నాలుగు బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.20కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా విదేశాల నుంచి మనీలాండరింగ్ ద్వారా రవి డబ్బులు తీసుకున్నట్లు తెలియడంతో ఇడి అధికారులు రంగంలోకి దిగారు. మరో వైపు రవి పోలీసుల విచారణకు సహకరించనట్లు తెలిసింది.
రవిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా బుధవారానికి వాయిదా వేశారు. రవిని అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్క్‌లు, సర్వర్లలో ఉన్న సినిమాలు, నెట్ వర్క్ గురించి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఐ బొమ్మ ద్వారా రవి భారీ డబ్బులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. తనను పోలీసులు వేటాడుతున్నారని గుర్తించిన రవి, ప్రహ్లాద్ పేరుతో పాస్‌పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. 2022లో ఇండియా సిటీజన్ షిప్ వదులుకుని కరేబియన్ దీవి నెవెడా పౌరసత్వం తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయించి విదేశాల్లో స్థిరపడాలని భావించిన రవి, బెట్టింగ్ నుంచి వచ్చే డబ్బులతో నెలకొక దేశం తిరిగేవాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో రవి ఇళ్లు కొనుగోలు చేశాడు. తనకు యూరప్ దేశాల్లో తిరగడం చాలా ఇష్టమని చెప్పినట్లు తెలిసింది.
డేటా క్లియర్…
రవిని కూకట్ పల్లిలోని ఇంటి నుంచి అరెస్టు చేసేందుకు వెళ్లిన సైబర్ క్రైం పోలీసులకు డోర్లు తెరవకుండా ఉన్నాడు. పోలీసులు వచ్చినట్లు గ్రహించిన రవి ఇంట్లోనే ఉండి టెలీగ్రాం, మొబైల్‌లో డేటాను క్లియర్ చేసి, ల్యాప్‌టాప్‌ను బాత్రూంలో దాచిపెట్టాడు. భారీగా డబ్బులు సంపాదించిన రవి బంధువులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. రవిని రెండు డొమైన్లు పట్టించినట్లు తెలిసింది, అమెరికాలో ఒకటి, అమీర్‌పేట్‌లో మరో డొమైన్‌ను రవి రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. 17వెబ్‌సైట్లు నిర్వహించిన వరి ఐ బొమ్మ, బప్పం టివిలను నిర్వహించాడు. వీటి ద్వారా పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేసి విన్‌బెట్, వన్ ఎక్స్ బెట్‌ను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.