బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి మాజీ భార్య మృతి
ముంబై: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అదుర్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య మరణించారు. ఆయన మొదటి భార్య, ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కానీ, మహేశ్ మంజ్రేకర్ నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. 1987లో మహేశ్, దీపాను వివాహం చేసుకున్నారు. 1995లో వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో వివాహబంధానికి స్వస్తి పలికారు. వీరిద్దరికి కుమారుడు సత్య మంజ్రేకర్, కుమార్తె అశ్వమి మంజ్రేకర్‌లు ఉన్నారు. ఆ తర్వాత మహేశ్, మేధా మంజ్రేకర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. సాయి మంజ్రేకర్ తెలుగులో మేజర్, స్కంధ, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాల్లో నటించింది.