‘జీరో కార్బన్ సిటీ’గా
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం
ఈ నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థల ఏర్పాటు
డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు
నిర్మాణం పూర్తయితే 13 లక్షల మందికి ఉద్యోగాలు
9 లక్షల జనాభా కోసం నివాస సముదాయాల నిర్మాణం
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నిర్మాణాలను ప్రారంభించనున్న పలు కంపెనీలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అరుదైన ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. 13,500 ఎకరాల్లో సువిశాలంగా రూపుదిద్దుకోనున్న ఈ నగరం రానున్న రోజుల్లో 13 లక్షల ఉద్యోగాలను కల్పించనుంది. వచ్చే ఫిబ్రవరి చివరిలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. తొమ్మిది విభాగాలుగా దీని నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025తో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఈ నగరం కీలక గమ్యస్థానంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల ప్రతినిధులు హాజరుకావడం, రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగడం, ఫ్యూచర్ సిటీ పట్ల పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమ్మిట్‌తో ఈ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలో ఇప్పటికే అనేక స్మార్ట్ సిటీలు, కొత్త నగరాల నిర్మాణ ప్రతిపాదనలు వచ్చినా దశాబ్దాలుగా కేవలం అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేదికగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత, కార్యాచరణ వేగానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో ఈ నగరం ప్రపంచపటంలో నిలిచిపోతుందని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు.
నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు
ప్రస్తుతం సమ్మిట్ ముగిసిన వెంటనే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఇన్ఫ్రా, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఏఐ, విద్యా, క్రీడలు వంటి రంగాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా, వ్యాపార – పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆరు విభాగాలుగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలకు నిలయంగా (ఆరు విభాగాలుగా), వచ్చే ఫిబ్రవరి చివరిలో ఈ నగర నిర్మాణం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్మాణ ప్రక్రియలో భాగంగా డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఇక, మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు సైతం ఇక్కడ మొదలవుతాయి.
పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు
13,500 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని ‘జీరో కార్బన్ సిటీ’గా రూపొందించే లక్ష్యంతో నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్, గ్రీన్‌ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరం సమగ్ర జీవన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ 13 లక్షల మందికి ఉద్యోగాలు, 9 లక్షల జనాభా కోసం నివాస సము దాయాలు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ‘వంతార’తో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రేసింగ్ ట్రాక్‌లు వంటి వినోద, క్రీడా సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అద్భుతమైన మౌలిక వసతులు, ఆధునిక రవాణా వ్యవస్థలతో ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా నిలువనుంది. సమ్మిట్ విజయం తర్వాత, దేశంలో ఏ కొత్త నగరానికి దక్కని ప్రాముఖ్యత ఈ ప్రాజెక్టుకు దక్కింది. ఇది తెలంగాణ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనుంది.
15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీతో…..
15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెఫ్ట్‌తో ఈ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఫిబ్రవరిలో (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసు ప్రారంభం కానుంది. ఈ నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌డిసి అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీలో లే ఔట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తోంది.