నిజామాబాద్: బనక చర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జిఒలు వెలువడ్డాయన్నారు. బనకచర్ల, బిసి రిజర్వేషన్లు, బిజెపి – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది, బనకచర్ల జిఓలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది మాజీ సిఎం కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో కెసిఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, అప్పుడు ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని దుయ్యబట్టారు. బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామని, హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని, బిసిల రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బిజెపి అని ధ్వజమెత్తారు. తెలంగాణలో కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, పారదర్శకంగా నిర్వహించామని, బిజెపి – బిఆర్ఎస్ కలిసి బిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, బిసిల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం బిజెపి, బిఆర్ఎస్ చేస్తున్నాయని, ఢిల్లీ బిసి రిజర్వేషన్ ధర్నాకు బిజెపి నేతలు ఎందుకు ముఖం చాటేశారని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే బిసి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, సిఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బిజెపి, బిఆర్ ఎస్ నేతలకు లేదని మహేష్ కుమార్ గౌడ్ చురకలంటించారు. హైదరాబాద్ నుంచి ముంబయి వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సిఎం చర్చించానని, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని, కామారెడ్డి బిసి సభ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు.