అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటలు ఆలుగు పారుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూరు గ్రామం సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. పూర్యనాయక్ తండ సమీపంలోని చంద్రవాగులో రెండు ఆవులు, బర్రెలు చిక్కుకొనిపోయాయి. మూగజీవాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. డోంట్ల దగ్గర మహాసముద్రం చెరువు అలుగు పారుతోంది. కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండాలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. చిన్న కాల్వలను రైతులు మూసీ ఉంచడంతోనే పంట పొలం, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో అచ్చంపేట నుండి ఉప్పునుంతల మండల కేంద్రానికి రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఉప్పునుంతల – అచ్చంపేట ప్రధాన రహదారిపై ఉన్న మల్లప్ప వాగు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు. ఉప్పునుంతల మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు ఎదురుగా ఉన్న కాలనీలో వర్షపు నీటితో జలమయమైంది.