హైదరాబాద్: కొండా మురళి ఎపిసోడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం పనులపై వివాదం చేయడమేంటని రేవంత్ మండిపడినట్టు సమాచారం. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని, నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అధిష్టానానికి కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్కి పూర్తి నివేదిక రేవంత్ రెడ్డి పంపినట్టు కాంగ్రెస్ వర్గాల పేర్కొంటున్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన గొడవ సద్దుమణిగి రెండు రోజులు గడువక ముందే తాజాగా మరో ఇద్దరు మంత్రుల విభేదాలు చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై అదే జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మేడారం జాతర పనుల కాంట్రాక్టుల విషయంలో జిల్లా, పైగా తన శాఖ (దేవాదాయ) అయిన వ్యవహారాలలో ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ నేరుగా సిఎంకు, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు వరంగల్ కాంగ్రెస్ వర్గాల సమాచారం. మేడారం జాతర సందర్భంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.71కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనికిగాను టెండర్లను పిలవగా, ఈ టెండర్‌ను ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరునికి ఇప్పించుకోవడానికి అధికారులపై వత్తిడి తెస్తున్నారని మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదులో ఆరోపించినట్టు ఈ వర్గాలు తెలిపాయి.
వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం ఏంటి అని వరంగల్ కాంగ్రెస్ నేత కొండా మురళీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకున్నారని, దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షిలకు కొండా మురళి ఫిర్యాదు చేశారు.