చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా
రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ
పలు ప్రాంతాలలో వాహన విస్తృతంగా తనిఖీలు.
మన తెలంగాణ/ రాజేంద్రనగర్: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్నెస్ లేని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేయడం ప్రారంభించారు. జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం అదేశాల మేరకు గురువారం కూడా ఓవర్ లోడ్ తో రోడ్డుపై నడుస్తున్న వాహనాలపై కొరడా ఝుళిపించారు. టిప్పర్ లారీ ఓవర్ లోడ్ తో బస్సు ఢీకొట్టి 20 మంది ప్రాణాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవర్ లోడ్ తో తిరుగుతున్న వాహనాల పై ప్రత్యేక నిఘాను రవాణా శాఖ పెట్టింది. మోటారు వెహికల్ యాక్ట్ కు విరుద్దంగా నడుస్తున్న పలు వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వాహనాలను అనువనువు రవాణా శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి డాక్యుమెంట్స్ ను అధికారుల బృందం చెక్ చేస్తున్నారు.నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను ఎక్కడిక్కడ సీజ్ చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెయింగ్ స్లిప్ లను క్షుణ్ణంగా ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో నడుస్తున్న వాహనాల యజమానులకు, డ్రైవర్ లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణ కమిషనర్ సదానందం హెచ్చరించారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు రోడ్డుపై తిరిగితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై ఎలాంటి వాహనాలు తిరిగినా కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ట్యాక్స్ లేని వాహనాలకు 200 శాతం పెనాల్టిలు వసూల్ చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వాహనాలను తీసుకువచ్చే డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దుకు వెనుకాడేది లేదని ఆయన చెప్పారు. ప్రతి రోజు తనిఖీలు చేసినప్పటికి ఓవర్ లోడ్ తో కొంత మంది వాహనాలు నడుపుతున్నారని తెలియజేశారు. అలాంటి వాహనాలపై నిఘా ప్రత్యేక నికా కొనసాగించి ఓవర్ లోడ్ తో వాహనాల పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడితే ఊరుకోమన్నారు. మైనింగ్ అధికారులు కూడా ఓవర్ లోడ్ వాహనాల పై దృష్టి సారించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మైనింగ్ అధికారులు కూడా సహకరించాలని, లారీలు ఎక్కడి నుండి మెటీరియల్ తీసుకొని వస్తున్నారో అక్కడే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు క్రషర్ మిషన్లపై దృష్టి పెట్టాలని, అక్కడే ఓవర్ లోడ్ కాకుండా చూస్తే సమస్యలు ఉత్పన్నము కావన్నారు. ఇకపై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు రోడ్డుపై తిరిగితే మోటార్ వాహన చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకోవడానికి సంకోచించేదిలేదని ఆయన హెచ్చరించారు.