టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం..
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.