1 జిబి డేటా ఖర్చు..ఓ చాయ్‌తాగినంత: ప్రధాని మోడీ
భారతదేశంలో ఒక్క జిబి వైర్‌లెస్ డేటా కేవలం ఒక్క కప్పు ఛాయ్ ధర అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించారు. మొబైల్స్ నుంచి సెమికండక్టర్ల వరకూ వివిధ రంగాల్లో తాము చేపట్టిన మేకిన్ ఇండియా సత్ఫలితాలకు ఈ మొబైల్ డేటా ధర తార్కాణం అవుతుందని అన్నారు. ఇప్పుడు ఇండియా శరవేగపు డిజిటల్ వృద్ధిని సంతరించుకుందని తెలిపారు. ఇక్కడి ప్రజాస్వామిక విధానాలు, సరళీకృత వ్యాపార పంథాతో పెట్టుబడిదార్లకు వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. బిజినెస్ నిర్వహణ సరళీకృతం అవుతోందని వివరించారు. పెట్టుబడులకు అనువైన మిత్రత్వ వేదికగా మన దేశం ఇప్పుడు గురుతర ఇమేజ్‌ను సంతరించుకుంది. డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోవడం వల్లనే కారుచౌక అందులోనూ టీ ధరకు డేటా అందరికి లభ్యం అవుతోందన్నారు. సృజనత్మాకత, పెట్టుబడులు , మేకిన్ ఇండియానే మన బలం , మన ప్రభుత్వం ఎంచుకున్న డిజిటల్‌తొలి దృక్ఫథానికి ప్రాతిపదిక అని చెప్పారు.
ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం రెండో అతి పెద్ద టెలికం మార్కెట్ అయ్యింది. ఇక 5 జి మార్కెట్‌నూ ద్వితీయ స్థానంలో నిలిచింది. దీనికి కారణం కేవలం మన మొబిలిటి అంతకు మించి మైండ్‌సెట్ ఈ రెండు ఎంలే మనకు విజయాలకు మూలం అయ్యాయయని తెలిపారు. దేశంలో ఇటీవలే మేడిన్ ఇండియా 4జి స్టాక్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు . ఈ సామర్థం సంతరించుకున్న ఐదు దేశాలలో ఇండియా కూడా ఒకటిగా నిలిచింది. ఇంతకు ముందు డిజిటల్ అనుసంధానం అనేది కొందరు సంపన్నులకే పరిమితం అయిన లగ్జరీ ప్రక్రియ. అయితే ఇప్పుడు మనం తీసుకున్న చర్యలతో ఇండియాలో ఇది ఇప్పుడు ఏ కోణంలో చూసినా ఇది భారతీయ జీవితంలో అంతర్గత అనుసంధాన ప్రక్రియ అయి నిలిచిందని ప్రధాని తెలిపారు. దశాబ్ధకాలంలో భారతదేశం సాధించిన వివిధ స్థాయిల డిజిటల్ రంగ విజయాలను ఈ నేపథ్యంలో ప్రధాని సభికులకు తెలిపారు. కప్పు చాయ్ తాగిన ధరతో డేటా లభ్యం అనేది మరి ఏ ఇతర చోట అయినా వీలవుతుందా? అని ప్రశ్నించారు.