కారు కోసం సెర్చ్ చేసి.. డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు..
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేసేందకు కొత్త మార్గాలు తయారు చేస్తున్నారు. రకరకాలుగా కుట్రలు పన్ని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కారు అద్దెకు తీసుకొనేందుకు ప్రయత్నించి డబ్బులు పొగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లాలాగూడకు చెందిన ఓ వ్యక్తి కోయంబత్తూరులో కారు అద్దెకు తీసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేశాడు. శివశక్తి కార్ రెంటల్స్ అనే పేరు చూసి.. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌ని సంప్రదించాడు.
రిజిస్ట్రేషన్ కింద రూ.149 చెల్లించాలని, ఎపికె ఫైల్ పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అది నిజమేనని నమ్మిన బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకొని రూ.149 చెల్లించాడు. ఎపికె ఫైల్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవడంతో అందులోని మాల్వేర్ ద్వారా ఒటిపిలు రాకుండా సైబర్ మాయగాళ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. దీంతో అతని ఖాతాలోని రూ.1.98 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.