దంపతుల ప్రాణం తీసిన మధ్యవర్తిత్వం
సిద్దిపేట: తెలిసిన వాళ్లకు డబ్బులు ఇప్పించి మధ్యవర్తిత్వం వహించారు. అప్పులిచ్చిన వాళ్లు వేధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దాచారం గ్రామంలో వడ్లకొండ శ్రీహర్ష(32), రుక్మిణి (28) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది. అద్దె ఇంట్లో ఉండి దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. తెలిసిన వారికి మధ్యవర్తిత్వం ఉండి అప్పులు ఇప్పించారు.
మధ్యవర్తిగా ఉండి రూ.13 లక్షల వరకు అప్పులు ఇప్పించారు. అప్పులు ఇచ్చిన వారు దంపతులను పలుమార్లు అడిగారు. అప్పు తీసుకున్న వాళ్లు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు వాళ్లు సూసైడ్ లేఖ రాశారు. నమ్మి డబ్బులు ఇప్పిస్తే చెల్లించకుండా మోసం చేశారని ఐదు పేజీల లేఖ రాశారు. నమ్మించి మోసం చేసిన వాళ్లను వదిలి పెట్టకూడదని ఐదుగురు పేర్లు లేఖలో రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.