మన తెలంగాణ/ హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జెఎటి) ఐదు రోజుల పాటు నిర్వహించిన నెక్ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్ 2 విజయవంతంగా ముగిసింది. గురువారం దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటి క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ముగింపు వేడుకలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ కె.శివసేనా రెడ్డి, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరినాథ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది ఆటలతోనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. 80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్, సైక్లింగ్లో పతకాలు గెలుస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మీడియా సంస్థలన్నింటిని ఒక వేదికపైకి తీసుకొచ్చి లీగ్ నిర్వహించిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ సభ్యులను అభినందించారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన రమేశ్‌కు ఎంఎల్‌ఆర్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందజేశారు. ఫైనల్లో విజేత, రన్నరప్‌గా నిలిచిన జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెక్ సీఈఓ, డాక్టర్ ఎజిహిల్ కుమార్ అన్నమలై, రేసింగ్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి, స్పోర్టిఓ ప్రతినిధి వృశాంక్ రెడ్డి, క్రిక్ లీగ్స్ సీఈఓ గణేష్, ఎస్‌జెఏటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సీజన్-2 విజేత సాక్షి టీవీ
ఫైనల్లో టీవీ-9ను ఓడించి జేపీఎల్ కప్ గెలిచిన సాక్షి టీవీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఘన విజయం 91 పరుగుల్ని 11 ఓవర్లలోనే ఊదేసిన సాక్షి, పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రమేశ్, చైతన్య కీలక ఇన్నింగ్స్ ఆడారు. 36 బంతుల్లో 60 పరుగులతో ఆజేయంగా నిలిచిన రమేశ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లీగ్‌లో మూడు మ్యాచ్‌లలో 190 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు సాక్షి టీమ్ ఈ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా అవతరించింది.
మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు
నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన సాక్షి జట్టుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్‌లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. ‘నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయి. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.