పారా ఛాంపియన్‌షిప్‌లో.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్
గ్వాన్‌జూ: ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ శీతల్‌దేవీ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ వన్ ఓజ్‌నుర్ క్యూర్‌గిర్డీని 146-143 తేడాతో ఓడించి స్వర్ణపతకం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలోని గ్వాన్‌జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ ఘనత సాధించింది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.
అంతకు ముందు.. తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవీ కాంస్యం గెలుచుకుంది. మరోవైపు మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో సరితతో కలిసి ఆమె రజత పతాకంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో టర్కీకి చెందిన పారా ఆర్చర్ల చేతిలో వీళ్లు ఓడిపోయారు. జమ్ము కశ్మీర్‌కి చెందిన శీతల్ దేవి.. ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల చేతులు లేకుండానే జన్మించింది. అయినా ఆమె కుంగిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణాలు ప్రయోగించడం నేర్చుకొని భారత్ గర్వపడే ఆర్చర్‌గా నిలిచింది.