నఖ్వీకి బిసిసిఐ వార్నింగ్
ట్రోఫీ అప్పగించాలని డిమాండ్
ముంబై: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మోసిన్ నఖ్వీకి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆసియా కప్ ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని నఖ్వీని కోరింది. ఒక వేళ ట్రోఫీని అందించకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) దృష్టికి తీసుకెళుతామని బిసిసిఐ హెచ్చరించింది. మొండి పట్టును వదిలి వెంటనే ట్రోఫీని అందించేందుకు చర్యలు చేపట్టాలని నఖ్వీకి సూచించింది. ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా కొనసాగుతున్న పిసిబి చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఈ అంశంలో తీవ్ర వివాదం నెలకొంది. ట్రోఫీ తానే అందిస్తానని నఖ్వీ పట్టుబట్టాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నఖ్వీని చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన నఖ్వీ టీమిండియాకు అందించాల్సిన ట్రోఫీతో పాటు మెడల్స్‌ను తాను బస చేసిన హోటల్‌కి తీసుకెళ్లి పోయాడు. ఇక ఆసియాకప్ ముగిసి 20 రోజులు గడిచినా నఖ్వీ భారత్‌కు ట్రోఫీని అందించలేదు. దీంతో భారత క్రికెట్ బోర్డు నఖ్వీకి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.