శభాష్ జమ్ము కశ్మీర్ టీమ్.. చరిత్రలో తొలిసారిగా..
రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో జమ్ము కశ్మీర్ టీం చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ జట్టును ఓడించింది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకూ 43 సార్ల ఈ రెండు జట్లు తలపడగా.. తొలిసారి విజయం సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని వారి సొంత మైదానం (అరుణ్ జైట్లీ స్టేడియం)లో జమ్మూ జట్టు చిత్తు చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది.
179 పరుగుల లక్ష్య చేధనలో కమ్రాన్ ఇక్బాల్ అద్భుత శతకం (133 నాటౌట్) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ జట్టు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ని హడలెత్తించింది. 211 పరుగులకే ఢిల్లీని ఆలౌట్ చేసింది. పేసర్ ఆకిబ్ నబి 5 వికెట్లు పడగొట్టగా.. వన్ష్‌రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో జె అండ్ కె జట్టు 310 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీ చేయగా.. అబ్దుల్ సమద్ 85, కన్హయ్య 47 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు.
99 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఢిల్లీ ఈసారి కూడా తడబడింది. 277 పరుగులకే ఆలౌటై.. జె అండ్ కె జట్టుకు 179 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూ అండ్ కశ్మీర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు.