జాతీయ స్థాయి ఇఎంఆర్‌ఎస్ క్రీడల్లో తెలంగాణ జట్టు రికార్డు
జాతీయ స్థాయి ఈఎంఆర్‌ఎస్ క్రీడల్లో…
ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణ జట్టు
మన తెలంగాణ / హైదరాబాద్ : నాల్గవ జాతీయస్థాయి ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్‌ఆర్‌ఎస్) క్రీడల్లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒడిశా సుందర్ఘర్‌లోని రూర్కెలాలో నవంబర్ 11 నుండి 15 వరకు 4వ ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో తెలంగాణ జట్టు చరిత్ర సృష్టించింది. ఓవరాల్ చాంపియన్, టీమ్ చాంపియన్, వ్యక్తిగత చాంపియన్‌షిప్- మూడు కేటగిరీల్లోనూ విజేతగా నిలిచి అపూర్వ రికార్డు నమోదు చేసింది. ఈ జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి 580 మంది క్రీడాకారులు, 68 మంది ఎస్కార్ట్ టీచర్లు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రానికి మూడంకెల పతకాల పంటను అందించారు.
230 పతకాలు – చరిత్రలో తొలిసారి
తెలంగాణ ఈఎమ్‌ఆర్‌ఎస్ విద్యార్థులు మొత్తం 230 పతకాలు సాధించారు. అందులో- 88 బంగారు పతకాలు, 66 వెండి పతకాలు, 76 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తం 230 మెడల్ సాధించి తెలంగాణ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి ప్రత్యర్థి రాష్ట్రాలపై ఆధిపత్యం చాటింది. జాతీయ స్థాయి క్రీడలకు తెలంగాణ ఈఎమ్‌ఆర్‌ఎస్ కార్యదర్శి కె. సీతా లక్ష్మి హాజరై విద్యార్థులను అభినందించి, మరింత ఉన్నత లక్ష్యాల వైపు దూసుకెళ్లాలని ప్రోత్సహించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మజ్ఝి, గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి జువాల్ ఓరం, ఎన్‌ఈఎస్‌టిఎస్ కమిషనర్ అజీత్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు తెలంగాణ బృందం కృషి, క్రమశిక్షణ, అద్భుత ప్రతిభను ప్రశంసించారు. ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణా కార్యక్రమాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థులకు, కోచ్‌లకు, సిబ్బందికి ప్రభుత్వం అభినందనలు తెలిపింది. జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనవిజయం గిరిజన విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తూ, క్రీడా రంగంలో తెలంగాణ ప్రతిభకు కొత్త మైలురాయిగా నిలిచింది.