తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచుతాం
డిజిటల్ విద్యా హబ్ దిశగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
సిఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ,
కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌ల మధ్య అవగాహన ఒప్పందం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని సిఓఎల్ అధ్యక్షుడు అండ్ సిఈఓ పీటర్ స్కాట్‌తో ముఖ్యమంత్రి వెల్లడించారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడియా ఆధునిక డిజిటల్ హబ్‌గా ఇది పనిచేస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించనుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌తో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం మంగళవారం సిఎం అధికారిక నివాసంలో జరిగింది.
టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఎంఓయూ కీలకం: ఘంటా
ఈ సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయనున్నట్లు విసి ప్రొ. ఘంటా చక్రాపాణి వెల్లడించారు. ఈ ఒప్పందంతో బోధన, అభ్యాసం, పరిశోధనా రంగాల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ఆధునిక డిజిటల్ హబ్‌గా పనిచేయనుందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. దూర విద్యలో చేరి ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే చాలా మంది విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో చేరుతారని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సి ఈ ఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ పేర్కొన్నారు. ఉత్పాదక ఉత్పత్తి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా విద్యా విధానం ఉండాలన్నారు.