భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు
భక్తుల భద్రతే పరమావధిగా బుతువులవారీ ఎస్ఒపి ఏర్పాటు
తిరుమల: తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా బుతువులవారీ ఎస్ఒపి తీసుకురావాలని అధికారులకు టిటిడి అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జెఇఒ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి, ఇతర టిటిడి అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా పురాతన గోపురాలు, కట్టడాల ధృడత్వం, సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు.
భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించేందుకు సమయపాలనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో క్యూలైన్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా ఎస్ఎస్ డి టోకెన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోడానికి వీలుకలుగుతుందని తెలిపారు.
భారీ వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగిపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించాలన్నారు. అటవీశాఖ మరియు రవాణా విభాగం వారికి సదరు ఆదేశాలు జారీచేయడమైనది.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తి.తి.దే లోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎలక్ట్రికల్ మరియు ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశించిన ఆన్ లైన్ సేవలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని మరియు విద్యుత్తు సరఫరా ప్రదేశాలు మరియు జంక్షన్లు దగ్గర సరైన కంచె మరియు సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆదేశించారు. విద్యుత్ విభాగాధిపతిని ఒక ప్రత్యేక విపత్తు స్పందన ఫోన్ నెంబర్ని కేటాయించి దానిని తిరుమల తి.తి.దే సిబ్బందికి మరియు భక్తులకి చేరే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఇటు వంటి విపత్తు సమయాలలో వాట్సాప్ సేవలను శాఖల పరంగా విస్తృతంగా వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. దిగువ ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి మరియు మాల్వాడిగుండం పక్కన వర్షాకాల జలపాతాల వద్ద భక్తులు గుమికూడి సెల్ఫీలు తీసుకోకుండా భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరాయంగా రెండు ఘాట్ రోడ్లలో నడిపి అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరవేయాల్సిందిగా సూచించారు.
వర్షాకాలంలో భక్తులు జారీ పడకుండా ఆలయం, మాడ వీధుల్లో నారతో తయారు చేసిన పట్టలు (కాయర్ మేట్లు) ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించడంతో పాటు, ఆలయం, ఆలయ పరిసరాల్లో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలన్నారు. భూగర్భ మురుగు నీటిలో చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించి సజావుగా నీరు పోయే విధంగా చూసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు రెయిన్ కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. వేసవి, వర్షం, మంచు కాలాల్లో భక్తులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేర్వేరుగా నిర్దేశిత ప్రణాళిక విధానం (Sop)లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.
శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్, మాడ వీధుల్లో రంగ వల్లులు, కూల్ పెయింట్ వేసిన ప్రాంతాల్లో జారి పడే ప్రమాదం ఉన్నందున, వాటిని గరుకుగా చేసి భక్తులు జారకుండా ఉండేదుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వర్షం పడే సమయం చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తులు చెట్లు కింద ఉండకూడదని సూచించారు. ఈ సందర్భంగా వైద్య విభాగానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది.