కర్నూల్ ప్రమాదం.. మృతదేహాల అప్పగింత..
కర్నూల్: కర్నూల్ శివారులో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 18 మృతదేహాలను డిఎన్‌ఎ పరీక్ష ఆధారంగా కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. డెత్ సర్టిఫికేట్లను అందించారు. జిల్లా కలెక్టర్ ఎ.సిరి స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
కర్నూల్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొని.. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు. మరో మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తమ తండ్రి కనిపించడం లేదని ఆయన వ్యక్తి చెప్పారని అన్నారు. డిఎన్‌ఎ పరీక్ష ఆధారంగా ఆ మృతదేహం ఎవరిదనే విషయం తేలుతుందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం తాగలేదని నివేదికలో తేలిందని ఎస్పీ చెప్పారు.