ఎపిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సూర్యాపేట జిల్లాకు చెందిన సుశీల(64), వెంకయ్య(70), మహేశ్(28) గా గుర్తించారు. తిరుపతి దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.