2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, ఇతర రాష్ట్రాలలో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ కూటమి మనోధైర్యాన్ని పెంచే తీర్పు. ఎన్నికల ఫలితాలు.. సంఖ్యలే సుస్పష్టం చేశాయి. బిజెపి, జెడి(యు), ఎల్‌జెపి (రామ్ విలాస్) నేతృ-త్వంలో ఎన్‌డిఎ, బీహార్‌లోని 243 సీట్లలో దాదాపు 202 సీట్లు అంటే.. మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలిచింది. బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నితీశ్ కుమార్ తన సత్తా చాటి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని స్థానాన్ని నిలుపుకున్నాడు.
కాంగ్రెస్, ఆర్‌జెడి, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ లేదా ఇండియా కూటమి చిన్నగా కుంచించుకుపోయింది. కనీసం 40 స్థానాలు కూడా దాటలేక చతికిలబడింది. ఈ ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వారిలో ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒకరు. పోలింగ్‌కు చాలా ముందుగానే, బీహార్‌లో ఓటర్లజాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) దాదాపు 47 లక్షల మందిని, ముఖ్యంగా 16 లక్షల మంది మహిళలను తొలగించిందని, లింగ నిష్పత్తిని దెబ్బతీసిందని, ఓటు హక్కు కోల్పోవడంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తిందని యోగేంద్ర యాదవ్ సుప్రీం కోర్టును హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యానాలు, ఇంటర్వ్యూలలో ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు.
1, ఎన్‌డిఎకు గల నిర్మాణాత్మక ప్రయోజనం
ప్రస్తుతం ఎన్‌డిఎ గతంలో కంటే విస్తృతమై సామాజిక పరంగా చక్కటి సంకీర్ణాన్ని కలిగి ఉంది. అగ్రకులాలు, ఒబిసిల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎన్‌డిఎ వైపే ఉన్నారు. యాదవులు, ముస్లింలు ఆర్‌జెడికి సాంప్రదాయ పునాదిగా ఉన్నా, వామపక్షాలు వెంట ఉన్నా, ప్రతిపక్ష కూటమి తన పరిధిని విస్తరించుకోలేపోయింది.
2. రాజకీయ సాంకేతికతతో ఓటర్ల జాబితా సవరణ
యాదవ్, ఇతర కార్యకర్తలు సర్ ను జాబితా ప్రక్షాళనగా కాకుండా, ముస్లింలు, మహిళలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియగా చూశారు. ప్రతిపక్షం వైపు మొగ్గుచూపే అంశాలను పట్టించుకోలేదు.
3. సంస్థాగతమైన అసమానతలు
ఎన్‌డిఎకు చెందిన బూత్ స్థాయి యంత్రాంగం, ఐటి మద్దతులో సాగిన ప్రచారం, సందేశాలు పంపడంలో అనుసరించిన క్రమశిక్షణ ఇండియా కూటమి ప్రయత్నాలు కచ్చితంగా గండికొట్టాయి. ఈ ఎన్నికలలో ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఛత్ పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఓటు వేయడానికి తిరిగి వచ్చారు. అనేక నియోజకవర్గాలలో రికార్డుస్థాయి ఓటింగ్ నమోదు కావడానికి వారు తిరిగి రావడమే కారణమని వ్యాఖ్యాతలు గమనించారు. ఏళ్లుగా వలసలు బీహార్ దుస్థితికి అద్దంగా నిలిచాయి. 2025 లో వలసదారుల ఆలోచన మారింది. వారు కుటుంబాలను కలవడానికే కాక, రాజకీయ సృ్పహతో ఓట్లు వేసేందుకు తిరిగి వస్తున్నారు. ఇంతకీ వారు ఎవరికి ఓటు వేసి ఉంటారన్నడే మిలియన్ డాలర్ల ప్రశ్న.
బిజెపి పాలిత అసోం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కొద్ది ఏళ్లుగా ఒకే మాట అంటున్నారు. రాహుల్ గాంధీ ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే, బిజెపి ఓట్లు అంత ఎక్కువ పెరుగుతాయి అని. అసోంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ గుదిబండగా మారారని అంటున్నారు. బీహార్ ఫలితం చూస్తే ఇది పాక్షిక సత్యం కూడా. ఈ మధ్య అనేక రాష్ట్రాల ఎన్నికలలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు బీహార్‌లలో రాహుల్ భారీగా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు లేదా ఇండియా బ్లాక్‌కు తగిన ఫలితాలు లభించలేదన్నది నిజం.
అయితే బీహార్‌లో ఎన్‌డిఎ భారీ విజయానికి రాహుల్ గాంధీకి ఆపాదించడం సులభం. కానీ, ఆ విజయానికి కారణం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలపై నితీశ్ కుమార్ ఆలోచన, స్థానికంగా ఆయనపై ఉన్న నమ్మకం, సంక్షేమ పథకాల ద్వారా మహిళల్లో మోడీకి ఉన్న ఆకర్షణ, అటు కులాల సెంటిమెంట్‌ను, ఇటు సంక్షేమ పథకాలను సమతూకం చేస్తూ ఎన్నికల వ్యూహంపై ఎన్‌డిఎ ఆధారపడి ఉంది.
బలమైన నాయకత్వం లోపం
తటస్థ ఓటర్లకు ఉన్న ఏకైక ప్రశ్న. రాహులా, మోడీయా అని కాదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతి రాష్ట్రంలోనూ స్థిరమైన, బలమైన నాయకత్వాన్ని అందించగలవా అన్నదే. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం అందించలేమని వారే నిరూపించుకున్నారు. విశ్లేషాత్మకంగా చూస్తే బిజెపి విజయాలకు రాహుల్ అసమర్థత కారణం కాదు. ప్రతిపక్షాల అస్తవ్యస్త పరిస్థితి. అధికార పార్టీ క్రమశిక్షణ అసలు కారణం. ముందుకు సాగాలంటే.. ప్రతిపక్షాలు వ్యూహాలను సమీక్షించుకోవాలి. బీహార్ ఓటమి ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం. బిజెపి వ్యతిరేక భావన, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని, ఎన్‌డిఎను చిత్తుగా ఓడిస్తాయన్న భ్రమలు మానుకోవాలి. వారి ఆలోచన మారాలి. వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాలి. పలు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. ప్రత్యేక వ్యూహ రచనకు పూనుకోవాలి. అన్ని రాష్ట్రాలలోనూ ఒకే మూస ధోరణి పనిచేయదు.
ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని తిరిగి కల్పించాలి
ప్రతిపక్షాలు ఎన్నికల సమగ్రతను చట్టపరమైన సాంకేతిక సమస్యగా కాక, ప్రధాన రాజకీయ సమస్యగా పరిగణించాలి. ఓడిపోయినప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేయడం కాకుండా, ఓటర్ల జాబితాలో తొలగింపులు, తప్పిపోయిన ఓటర్లు బూత్‌స్థాయి అవకతవకలను క్రమబద్ధంగా నమోదు చేయడంతోపాటు, ఓటర్ల జాబీతాలో వారి పేర్లను తనిఖీ చేసి పునరుద్ధరించడానికి పౌరులకు సహాయపడే విధంగా గ్రూస్ రూట్ ప్రచారాలు చేపట్టాలి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఇసి జవాబుదారీతనంలో సంస్కరణల కోసం ఓ స్పష్టమైన జాతీయ స్థాయి ప్రచారం సాగించాలి. మేం గెలిచినప్పుడు మాత్రమే ఇవిఎంలను గౌరవిస్తాం అన్న ధోరణికు స్వస్తి చెప్పాలి.
కేడర్ కేంద్రీకృత రాజకీయాలకు మారాలి
బిజెపి విజయానికి కారణం మోడీయో, నితీశ్ కుమారో, బిశ్వశర్మనో కాదు. బూత్ స్థాయి వ్యూహాన్ని అమలు చేయగల లక్షలాది మంది కార్యకర్తలు కూడా. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో హడావుడి చేయడం కాకుండా ఎన్నికల సీజన్‌కు మించి స్పష్టమైన కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యువత, మహిళలు, వలసదారులతో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకోవాలి. బిజెపికి దీటుగా దూకుడుగా డిజిటల్ సాధనాలను వాడుకోండి. పారదర్శకంగా, సమస్యల పరిష్కారానికి తోవచూపే సందేశాలతో ఆకట్టుకోండి. ఒకప్పుడు అగ్రవర్ణాలకే పరిమితమైన బిజెపి యాదవేతర ఒబిసిలు, దళితులు, మహిళా లబ్ధిదారులతోపాటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుని తన కూటమిని విసృ్తతం చేసుకుంది. ప్రతిపక్ష మండల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, సామాజిక న్యాయంపై మొగ్గు చూపాలి. ఉద్యోగాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య వంటి స్పష్టమైన ఆర్థిక ఎజెండాతో ఆకట్టుకోవాలి. ఎన్‌డిఎ నుంచి ప్రస్తుతం సంక్షేమం, గుర్తింపు మాత్రమే పొందుతున్న అసంఘటిత కార్మికులు, వలసదారులు, యువతను ఈవ్యూహం ఆకర్షిస్తుంది.
నితీశ్ కుమార్ స్థానిక ఇమేజ్, మోడీ జాతీయ స్థాయి బ్రాండ్ బీహార్‌లో ఓ అపూర్వ విజయాన్ని అందించాయి. ప్రతిపక్షాలకు సంబంధించినంతవరకూ బెంగాల్‌లో మమతా బెనర్జీయే కీలకమైన నేతగా కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఆమెను బలహీనపరచాలనుకుంటున్నారా లేక విభేదాలు మరచి ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా అన్నది నిర్ణయించుకోవాలి. అసోంలో తరుణ్ గొగోయ్ తర్వాత ఓ శూన్యత ఏర్పడింది. సాంసృ్కతిక రంగంలో జుబీన్ లాగ ప్రతిపక్షంలో ఏ నాయకుడికీ అంతటి గౌరవం లేదు. తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ అసోంలో, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతున్నా, విద్యార్థి ఉద్యమాలు, పౌరసమాజం, చిన్న పార్టీలను ఏకంచేసి, ప్రాంతీయ నాయకుల రెండో శ్రేణి నిర్మాణం చాలా అవసరం. కేరళలో ఇప్పటికే పినరయి విజయన్, శశిథరూర్ వంటి ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో విస్తరించాలంటే మరింత సమన్వయం అవసరం. నైతిక ఆగ్రహం, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా చివరిక్షణంలో సీట్ల సద్దుబాటు వల్ల ఎన్‌డిఎను ఓడించలేమన్నది ప్రతిపక్షాలకు బీహార్ నేర్పిన పాఠం. సంస్థాగతంగా బలపడడం, తెలివిగా సంకీర్ణాలు ఏర్పాటు, న్యాయం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగితేనే ప్రతిపక్షాలకు, ఇండియా కూటమికి భవిష్యత్తు.
– గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు