నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడుతూ “నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చూసిన ఒక సంఘటన ఆధారంగా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ప్రేరణనిచ్చింది. ఇలా సమయం ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి ‘ది గర్ల్ ఫ్రెండ్‘ కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ‘ది గర్ల్ ఫ్రెండ్‘ కథను అల్లు అరవింద్ చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రష్మిక, మా కాంబోలో ముందుగా అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం. -టీజర్, ట్రైలర్‌లో ఆడియెన్స్‌ను కావాలనే వేరే విధంగా ఊహించుకునేటట్టు చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్‌లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుంది. ఈ డ్రామా సర్‌ప్రైజ్ చేస్తుంది. ఒక జంట జీవితంలో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్‌లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్‌గా చేశాం. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని రష్మిక సపోర్ట్ చేసింది. ఈ కథలో హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం. – ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీలోని విక్రమ్ క్యారెక్టర్‌కు దీక్షిత్ బాగుంటాడు అనిపించింది. మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్చరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను సంప్రదిస్తే… వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని వద్దన్నారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సి వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్‌కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది. – హేషమ్ అబ్దుల్ వాహాబ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ తో మూవీలోని ఫీల్ మరింత పెరిగింది. ఇక నెక్స్ నేను డైరెక్ట్ చేయబోయే రెండు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక, నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సి ఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది” అని అన్నారు.