జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నా మని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు.
సిఎం రేవంత్, కెసిఆర్‌ల ప్రతిష్ఠకు అగ్నిపరీక్ష. హైదరాబాద్ మహానగర పరిధిలోని జూబ్లీహిల్స్ శాసనసభా స్థానానికి 11న జరిగే ఉపఎన్నిక ప్రచారం పూర్తయి, పోలింగ్‌కు సర్వం సిద్ధంగా ఉంది. బిజెపితో సహా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ విజయసాధనకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత, మాజీముఖ్యమంత్రి కెసిఆర్‌ల ప్రతిష్ఠకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా నిలిచింది. జూబ్లీహిల్స్ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మరణించడంతో జరుగుతున్న ఉపఎన్నికలో గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకిదింపి సానుభూతి ఓట్లతో మళ్ళీ గెలవాలని భారత రాష్ట్రసమితి గట్టి ప్రయత్నాలే చేస్తున్నది.ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి, కెసిఆర్‌ను మళ్లీ సిఎంగా తేవాలనే వ్యూహంతో బిఆర్‌ఎస్ శ్రమిస్తోంది. కెటిఆర్, హరీశ్‌రావు పలువురు మాజీమంత్రులు, శాసనసభ్యులు, స్థానిక నేతలను వీరేంటబెట్టుకుని ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేశారు. నియోజక వర్గంలోని శ్రీనాగరకాలనీ, బోరబండ, వెంగళరావునగర్, షేక్‌పేట, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, 7 కార్పొరేట్ డివిజన్లలోని బస్తీలు, మురికివాడలు, ప్రధాన రహదారులలో బిఆర్‌ఎస్ మాజీమంత్రులు, శాసనసభ్యులు సిహెచ్ మల్లారెడ్డి, ఎస్. నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద గౌడ్ ప్రభృతులు గల్లీగల్లీలో ఇంటింటికీ తిరిగి కారుగుర్తుకు ఓటేసి కెసిఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బిసి సాధికారత నినాదంతో యువకుడు, శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌ను హస్తం అభ్యర్థిగా పోటీకి దింపి గెలుపుకోసం చెమటోడుస్తోంది.
తెలంగాణ మంత్రు లు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సహా మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ వంటి నేతలే గాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకుని వివిధ డివిజన్‌లలో విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో లక్షా 1.4 లక్షల బిసి, లక్ష ముస్లిం, 20 వేలు క్రైస్తవ ఓటర్లున్నారు. నిజానికి ఈ స్థానం మినీ భారత్. ఉత్తరాది వారుతెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన సామాజిక వర్గాల వారూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో వున్నారు. ఈ ఎన్నిక మోడీ, కెసిఆర్ ద్వయానికి, రేవంత్, రాహుల్, ఒవైసిల మధ్య జరుగుతున్న పోరుగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ముస్లింలను ఆకట్టుకోవడానికి కొద్దిరోజుల ముందే క్రికెట్ ఆటగాడు అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చి మైనారిటీ వ్యవహారాల శాఖను కట్టబెట్టారు. మజ్లిస్ పార్టీ పోటీ చేయకుండా ఈసారి హస్తం పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందని, ముస్లిం రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి పెంచుతామని చెప్పి మోసం చేశారని మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చిస్తోందని, పదేళ్ల తర్వాత కొత్తకార్డులను ఇచ్చిందని, ఇళ్లకు ఉచిత కరెంటు, రూ. 500 కే వంట గ్యాస్ సరఫరా చేస్తోందని చెబుతూ, జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం వేలకోట్లు కొల్లగొట్టి యువతకు ఉద్యోగ, ఉపాధిని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసి ఆదుకున్నామని, రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని సిఎం భరోసా ఇచ్చారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు బిఆర్‌ఎస్ ఎంపిలు మద్దతు పలకడం చూస్తే కెసిర్ మోడీకి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న సంగతి తెలుస్తోందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్‌కు ఎటిఎంగా ఉందని గతంలో ఆరోపించిన మోడీకి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణ జరిపి, సిబిఐ, ఇడిలతో విచారణ జరిపించాలని శాసనసభ తీర్మానించి కేంద్రానికి పంపినా, ఇకారురేస్‌లో అవినీతి జరిగినా మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కారుగుర్తుకు ఓటేస్తే కమలానికి ఓటేసినట్లేనని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ముస్లింల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఇది ముస్లింలను బుజ్జగించడమేనని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరరావు స్పందించారు. బిజెపి నేతలు కమలం గుర్తుకు ఓటేయాలని వారు కోరారు. జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నామని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు. బోరబండ చౌరస్తాలో పిజెఆర్ విగ్రహం, అమీర్ పేట మైత్రీవనం కూడలిలో తెలుగుతేజం ఎన్‌టిఆర్ విగ్ర హం నెలకొల్పుతామని హామీ ఇచ్చి రేవంత్ వారి మన్ననలు పొందారు.
జూబ్లీహిల్స్‌లో ఆధునిక ఐటిఐ, మహిళా కళాశాల నెలకొల్పుతామని, మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని చెబుతూ ఎలాగైనా హస్తం పార్టీ గెలుపుసాధించి తీరాలనే పట్టుదలతో సిఎం ప్రచారం సాగించారు. జూబ్లీహిల్స్‌లో సంపన్న వర్గాలు ఉన్నా పేద, మధ్య తరగతి వారే అధికం. బస్తీలు, మురికివాడలలో పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా సరిగాలేకపోవడం, మురుగునీటి పారుదల సరిగాలేక నీరు రోడ్లపైకి రావడం, రోడ్లు గండ్లుపడి అధ్వానంగా, దుర్గంధం వేదజల్లడం ప్రజలను పీడిస్తున్న ప్రధాన సమస్యలు. రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయితే సమస్యలు తీరుతాయని మంత్రులు, అధికార పార్టీల నేతలు అంటున్నారు. ఉప ఎన్నికలో హస్తం పార్టీ ఓడితే సిఎం రేవంత్ పదవికి వెంటనే ముప్పులేకపోయినా అసమ్మతి పెరిగి, నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ నేతలు మళ్లీ అసమ్మతి కార్యక్రమాలు మొదలెడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. కెసిఆర్ ప్రచారానికి రాకపోగా, కనీసం కారుగుర్తుకు ఓటేయమని ప్రకటన చేయక పోవడం ఆ పార్టీ శ్రేణులకు కొంత నిరుత్సాహం కలిగించింది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రతిష్ఠకు పోటీగా భావిస్తున్నారు. మాగంటి సునీతపై బిఆర్‌ఎస్ సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభావం చూపితే హస్తం పార్టీ విజయం. పోటాపోటీగా ఉన్నందున ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో చూడాల్సిందే.
పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381