స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. ఇప్పుడు ఈ జోడీ ‘అఖండ’ సీక్వెల్.. ‘అఖండ: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దాం.
కథ: మురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీవోలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా ఆమె బయో సూట్ తయారు చేస్తుంది. దాని మీద ట్రయల్స్ నడుస్తుండగానే.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్‌ను గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళాకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యత కూడా జననినే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోరా అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ (బాలకృష్ణ) రంగప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అతనెలాంటి పోరాటం చేశాడు? దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు? అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలను మిళితం చేసి దర్శకుడు బోయపాటి రాసుకున్న ఈ కథ బాలకృష్ణ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దేశంలో వీస్తున్న హిందుత్వ భావాలను బలపరిచే విధంగా సనాతన ధర్మ బోధ చేయడం కూడా కలిసొచ్చే అంశమే. ఇక టాలీవుడ్‌లో మాస్ పేరుతో కొంచెం అతి చేసినా చెల్లే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దర్శకుల్లో బోయపాటి శ్రీనుకు కూడా ఇలాంటి ఇమేజే ఉంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మాస్ విధ్వంసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య, బోయపాటి అంటేనే అన్నీ కొంచెం అతిగా ఉంటాయనే అంచనాతోనే థియేటర్లలోకి వెళ్లినా సరే.. ‘అఖండ-2’లోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అతి హద్దులనూ దాటేస్తుంది. మనిషి తిరగేసి తలను పట్టుకుని హారతి ఇవ్వడమేంటి.. హెలికాఫ్టర్ రెక్కలను త్రిశూలం మీద పెట్టి తిప్పడమేంటి.. అదే త్రిశూలంతో మెషీన్ గన్నును ఆపరేట్ చేయడమేంటి.. ఇండియన్ ఆర్మీ వల్ల కానిది హీరో ఒక్కడే చేయడమేంటి.. ఒక్కడే చైనా మీదికి యుద్ధానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ జనరల్ ను చంపడమేంటి.. అబ్బో మామూలు విన్యాసాలా అవి? మాస్ అంటే ఇంతే మరి.. వీటినే ఎంజాయ్ చేస్తాం అంటే సినిమా నిండా ఇలాంటి విన్యాసాలకు.. విధ్వంసాలకు లోటే లేదు. బాలయ్యతో చేసిన తొలి రెండు చిత్రాల్లో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం ఆధ్యాత్మిక టచ్ ఇచ్చాడు. బోయపాటి ఈసారి ‘అఖండ 2’లో రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చాడు.
మన సంస్కృతి, ఆధ్యాత్మికత అంశాలు ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్న ట్రెండులో ‘అఖండ’ అద్భుత విజయాన్నందుకుంది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనేసరికి బోయపాటి అన్నీ డబుల్ డోస్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్తా సినిమాలో కొన్నిసార్లు అతిగా అనిపించినా… కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇక ‘అఖండ 2’లో బాలకృష్ణ రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశాడు. ఎమ్మెల్యే మురళీకృష్ణ గా ఆకట్టుకున్న బాలకృష్ణ, అఖండ రుద్రగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ రెండు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్… ఆడియెన్స్‌తో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి.ఇందులో ’బజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాలి… కీలకమైన జనని పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలోనే ఎంట్రీ ఇస్తుంది. అతనిపై చిత్రీకరించిన రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో మొదటిది బాగుంది, రెండోది పూర్తిగా గ్రాఫిక్స్‌తో పర్వాలేదనిపించింది.
మెయిన్ విలన్స్‌గా సాంగ్య, కబీర్ దుహాన్ సింగ్, ’కల్కి’ ఫేమ్ శాశ్వత్ ఛటర్జీ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ, అనీశ్ కురువిల్లా, సర్వదమన్ బెనర్జీ, రవివర్మ, విజీ చంద్రశేఖర్, వైజి మహేంద్ర, శరత్ లోహితస్య తదితరులు పోషించారు. వీరంతా తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. బోయపాటి శ్రీను చిన్న కొడుకు వర్షిత్ ఇందులో భక్త ప్రహ్లాదుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి బోయపాటి రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టేలా ఉంది. పాటలు ప్రేక్షకులను అలరించాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ కు, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి ’అఖండ -2’ నచ్చుతుంది. అలానే ద్వితీయార్థంతో అందరూ కనెక్ట్ అయితే… ’అఖండ’ తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోగలదు.